మరోసారి అదరగొట్టిన శ్రేయస్‌..

Shreyas Gopal Takes Hat-Trick Wickets - Sakshi

శ్రేయస్‌ గోపాల్‌ మరోసారి అదరగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్‌.. బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించాడు. భారీ వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్మిత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆ తర్వాత భారీ వర్షంతో చిన్నస్వామి స్టేడియం చెరువును తలపించింది. దీంతో చివరకు 30-30 బాల్స్‌ (5 ఓవర్ల) మ్యాచ్‌ను ఆడించారు. 30 బంతుల మ్యాచ్‌లో రాజస్థాన్‌ బౌలర్‌ శ్రేయస్‌ హ్యాట్రిక్‌ సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్‌ వేసిన శ్రేయస్‌.. మొదటి మూడు బంతులకు 6, 4, 2 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్‌ గోపాల్‌ తన బౌలింగ్‌ మాయాజాలంతో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి మెరుపులకు కళ్లెంవేశాడు. వరుస బంతుల్లో సిక్స్, ఫోర్‌ కొట్టిన కోహ్లి నాలుగో బంతినీ బాదేందుకు ప్రయత్నించాడు. లాంగాన్‌లో లివింగ్‌స్టోన్‌ క్యాచ్‌ పట్టడంతో కోహ్లి నిష్క్రమించాడు. ఆ మరుసటి బంతికే డివిలియర్స్‌ (4 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఔటవ్వగా.. స్టొయినిస్‌ డకౌట్‌ కావడంతో ఈ సీజన్‌లో రెండో ‘హ్యాట్రిక్‌’ నమోదైంది. చివరకు మళ్లీ వర్షం రావడంతో  ఈ మ్యాచ్‌ రద్దయింది. ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో కోహ్లి, డివిలియర్స్‌లను మూడేసి సార్లు ఔట్‌ చేసిన తొలి బౌలర్‌గా  శ్రేయస్‌ గోపాల్‌ నిలిచాడు. కోహ్లి, డివిలియర్స్‌ వంటి బ్యాట్స్‌మెన్‌ను వెనువెంటనే ఔట్‌ చేసిన శ్రేయస్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

19వ హ్యాట్రిక్‌..
ఐపీఎల్‌ చరిత్రలో ‘హ్యాట్రిక్‌’ తీసిన 16వ బౌలర్‌ శ్రేయస్‌ గోపాల్‌. ఇప్పటివరకు లీగ్‌ చరిత్రలో మొత్తం 19 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అమిత్‌ మిశ్రా (ఢిల్లీ, డెక్కన్‌ చార్జర్స్, సన్‌రైజర్స్‌) మూడుసార్లు... యువరాజ్‌ సింగ్‌ (పంజాబ్‌) రెండుసార్లు ఈ ఘనత సాధించారు. లక్ష్మీపతి బాలాజీ (చెన్నై), ఎన్తిని (చెన్నై), రోహిత్‌ శర్మ (డెక్కన్‌ చార్జర్స్‌), ప్రవీణ్‌ కుమార్‌ (బెంగళూరు), అజీత్‌ చండేలా (రాజస్తాన్‌), సునీల్‌ నరైన్‌ (కోల్‌కతా), ప్రవీణ్‌ తాంబే (రాజస్తాన్‌), షేన్‌ వాట్సన్‌ (రాజస్తాన్‌), అక్షర్‌ పటేల్‌ (పంజాబ్‌), సామ్యూల్‌ బద్రీ (బెంగళూరు), ఆండ్రూ టై (గుజరాత్‌ లయన్స్‌), జైదేవ్‌ ఉనాద్కట్‌ (పుణే), స్యామ్‌ కరన్‌ (పంజాబ్‌), శ్రేయస్‌ గోపాల్‌ (రాజస్తాన్‌) ఒక్కోసారి హ్యాట్రిక్‌ నమోదు చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top