మిస్టర్‌ కూల్‌ ధోనికి జరిమానా

MS Dhoni Fined In CSK Vs RR Match Over Argument With Umpires On Field - Sakshi

జైపూర్‌ : ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ ధోనికి జరిమానా పడింది. అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా మిస్టర్‌ కూల్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. గురువారం జైపూర్‌లో రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆఖరి దాకా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి ధోని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ (43 బంతుల్లో 58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)గా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ కెప్టెన్‌గా ‘సెంచరీకొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. (ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మొత్తం 166 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు 65 మ్యాచ్‌లలో మాత్రమే ఓడగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.)

చదవండి : (చెన్నై సిక్సర్‌)

అయితే ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోని ఈ మ్యాచ్‌లో తొలిసారిగా అంపైర్లతో వాదనకు దిగి చేదు అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. టాపార్డర్‌ విఫలం కావడంతో ఛేజింగ్‌ బాధ్యతను భుజాన వేసుకున్న ధోనిని.. స్టోక్స్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే అతడు డగౌట్‌ చేరిన మరుసటి బంతికే వివాదం చెలరేగింది. గెలుపు కోసం చెన్నై 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్‌ సాంట్నర్‌ 2 పరుగులు చేశాడు. అయితే ప్రధాన అంపైర్‌ దీనిని తొలుత హైట్‌ నోబాల్‌గా ప్రకటించి... ఆ తర్వాత లెగ్‌ అంపైర్‌ కాదనడంతో వెంటనే చేతిని దించేశాడు. ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్‌- స్ట్రైక్లో ఉన్న జడేజా మొదట అంపైర్లను ప్రశ్నించాడు. తర్వాత కెప్టెన్‌ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. కానీ అంపైర్లు అది నోబాల్‌ కాదనడంతో చేసేదేమీలేక ధోని నిరాశగా డగౌట్‌ చేరాడు. ఈ నేపథ్యంలో అతడి మ్యాచ్‌ ఫీజులో సగం కోత విధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top