ఏం పిచ్‌లు.. ఎవడు ఆడుతాడు: ధోని ఫైర్‌

MS Dhoni slams Chennai Pitch Again - Sakshi

చెన్నై : కోల్‌కతానైట్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఒకే ఒక్కడు ఆండ్రీ రసెల్‌ (44 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని చెన్నై కష్టపడి 18 ఓవర్లు ఆడి ఛేదించింది. నెమ్మదైన పిచ్‌ కావడంతో బ్యాట్స్‌మన్‌ పరుగుల చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు. మ్యాచ్‌ అనంతరం చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోని పిచ్‌ క్యూరెటర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఈ నెమ్మదైన పిచ్‌లు ఎవడికి కావాలని, ఇలాంటి వికెట్‌పై ఎవరు ఆడుతారని మండిపడ్డాడు. పూర్తిగా బ్యాటింగ్‌ చేయరాకుండా ఉన్న ఈ పిచ్‌పై సమతూకమైన జట్టుతో దిగడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ఆల్‌రౌండర్‌ బ్రేవోతో పాటు డేవిడ్‌ విల్లీ కూడా జట్టుతో లేకపోవడంతో జట్టు కూర్పులో తమకు ఇబ్బందైనట్లు చెప్పుకొచ్చాడు. ఈ పిచ్‌ను చూసినప్పుడు తాము కూడా తేలిపోతామనుకున్నామని, కానీ విజయంతో ముగించామన్నాడు.

ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా క్యూరెటర్స్‌ ఈ తరహా పిచ్‌నే సిద్దం చేశారు. ఆ మ్యాచ్‌లో బెంగళూరు కేవలం 70 పరుగులకే కుప్పకూలడం.. అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై 18 ఓవర్లు ఆడి చేధించడం తెలిసిందే. అప్పట్లో కూడా ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి కూడా అదే తరహా పిచ్‌ తయారు చేయడంతో ధోని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top