నాడు విమర్శలు.. నేడు ప్రశంసలు!

MS Dhoni showed how to bat calmly under pressure, says VVS Laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్:  ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. యువతరానికి జట్టులో దక్కాల్సిన సమయం ఆసన్నమైందని, ఇప్పటికైనా అన్ని విధాలుగా ఆలోచించి గౌరవ ప్రదంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదంటూ 'మిస్టర్ కూల్' ధోనికి భారత మాజీ క్రికెటర్లు సలహాలిచ్చేశారు. మరికొందరు మాజీలు మాత్రం ధోనికే తమ మద్ధతని, అతడి అనుభవాన్ని తక్కువగా అంచనా వేయోద్దంటూ హితవు పలికారు. తాజా ఇన్నింగ్స్‌తో ధోని విమర్శకుల నోళ్లు దాదాపు మూయించి, తానేందుకంత స్పెషలో చెప్పకనే చెప్పేశాడు.

ముఖ్యంగా ధోనిని విమర్శించిన వాళ్లలో మణికట్టు ఆటగాడు, వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ ఒకరు. నేడు ధర్మశాలలో లంకతో జరిగిన తొలి వన్డేలో ధోని కీలక ప్రదర్శనను గుర్తించాడు లక్ష్మణ్. దీంతో తొలి వన్డేలో నెగ్గిన లంక జట్టుకు అభినందనలు తెలపడంతో పాటు ధోని ఆటతీరును సోషల్ మీడియా ద్వారా ప్రశంసించాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఎలా ఆడాలో ఎంఎస్ ధోని మరోసారి తన బ్యాట్‌తో నిరూపించాడంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు లక్ష్మణ్. ధోని ఆటలో పస తగ్గిందని.. క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని లక్ష్మణ్ కామెంట్లు చేయగా, అజిత్ అగార్కర్ కూడా వత్తాసు పలికాడు. ఆ సమయంలో కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలు ధోనికి అండగా నిలిచారు.

శ్రీలంకతో నేడు (ఆదివారం) జరిగిన తొలి వన్డేలో భారత్‌ 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ధోని (65;87 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో రాణించడంతో భారత్ 112 పరుగులకు ఆలౌటైంది. ఐతే స్వల్ప స్కోరు కావడంతో లంక చేతిలో దారుణ పరాభవాన్ని చవిచూసిన్నప్పటికీ.. కీలక సమయంలో ఆడిన ఇన్నింగ్స్‌తో, తనపై విమర్శలు చేసి రిటైరవ్వాలంటూ ఉచిత సలహాలిచ్చిన ఆటగాళ్లతోనే శభాష్ అనిపించుకుంటున్నాడు మహీ.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top