మళ్లీ మెక్సికో మెరుపులు 

Mexico Continues Strong Play With Convincing Win Over South Korea - Sakshi

వరుసగా రెండో విజయం

కొరియాపై 2–1తో గెలుపు

నాకౌట్‌కు మరింత చేరువ

రొస్తావ్‌ ఆన్‌ డాన్‌: ఈ ప్రపంచ కప్‌లో ప్రమాదకర జట్టుగా అందరూ అభివర్ణిస్తున్న మెక్సికో... గ్రూప్‌ ‘ఎఫ్‌’లో వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2–1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీనే మట్టి కరిపించిన మెక్సికో ముందు... సాధారణమైన దక్షిణ కొరియా నిలవలేకపోయింది. ఆ జట్టు తరఫున ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జేవియర్‌ హెర్నాండెజ్‌ (66వ నిమిషం), కార్లొస్‌ వెలా (26వ నిమిషం) గోల్స్‌ చేశారు. కొరియాకు హెచ్‌ఎం సన్‌ (90+3వ నిమిషం) గోల్‌ అందించినా అప్పటికే ఆలస్యమైపోయింది. రెండు పరాజయాలతో కొరియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం 6 పాయింట్లతో మెక్సికో నాకౌట్‌ రేసు ముందంజలో ఉంది. జర్మనీ–స్వీడన్‌ శనివారం అర్ధరాత్రి తలపడనుండగా, ఈ నెల 27న మెక్సికో–స్వీడన్, జర్మనీ– దక్షిణ కొరియా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత  ఏ రెండు జట్లు నాకౌట్‌కు చేరతాయనే స్పష్టత వస్తుంది. 

దీటుగా మొదలుపెట్టి... 
ఫామ్‌లో తేడా ఉన్నా దక్షిణ కొరియా ప్రత్యర్థికి దీటుగా మ్యాచ్‌ను ప్రారంభించింది. కానీ వరుసగా కార్నర్, ఫ్రీ కిక్‌లతో పరీక్షించిన మెక్సికో క్రమంగా బంతిని ఆధీనంలోకి తీసుకుంది. 26 నిమిషంలో జాంగ్‌ హ్యున్‌సూ చేతికి బంతి తగలడంతో ఆ జట్టుకు అనుకోని వరంలా పెనాల్టీ దక్కింది. దీనిని పొరపాటు లేకుండా కార్లొస్‌ వెలా గోల్‌గా మలిచాడు. ఇక్కడినుంచి మెక్సికో ఆధిపత్యమే సాగింది. ఆ జట్టు పాస్‌లు విఫలమైన సందర్భంలోనే కొరియాకు అవకాశం వచ్చింది. వీటిలోంచే మూడు సార్లు ప్రతి దాడులు చేసినా అవేవీ గోల్‌ కాలేదు. రెండో భాగం ప్రారంభంలోనూ మెక్సికో హవానే సాగినా కొరియా కొంత ప్రతిఘటించింది. అయితే... 66వ నిమిషంలో లొజానో అందించిన పాస్‌ను హెర్నాండెజ్‌ లాఘవంగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టడంతో ఆధిక్యం 2–0కు పెరిగింది. పూర్తిగా వెనుకబడిన కొరియా నిర్ణీత సమయంలో గోల్‌ చేయలేకపోయింది. అయితే, ఇంజ్యూరీలో సన్‌ ఆ లోటు తీర్చాడు. పెనాల్టీ ఏరియా బయట బంతి దొరకబుచ్చుకున్న అతడు ఎడమ కాలితో బలమైన షాట్‌ కొట్టి గోల్‌ చేశాడు. ఇది మ్యాచ్‌ గణాంకాలను 2–1గా మార్చేందుకు మాత్రమే ఉపయోగపడింది.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top