‘మన్కడింగ్‌’పై మాటమార‍్చిన ఎంసీసీ

MCC takes U turn, says Ashwins Mankading of Buttler not in spirit of game - Sakshi

లండన్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇటీవల రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన జోస్ బట్లర్‌ను కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘మన‍్కడింగ్‌’ చేయడం పెద్ద దుమారం రేపింది. దీనిపై ఇంకా పెద్ద ఎత్తున చర‍్చలు కొనసాగుతున్నాయి. అశ్విన్‌ మన్కడింగ్‌ వ్యవహారంపై క్రికెట్ ‘లా’మేకర్ అయిన మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) తీవ్రంగా చర్చిస్తోంది. అయితే మన్కడింగ్‌ క్రికెట్‌లో తప్పనిసరి అని స్పష్టం చేస్తూ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ అనవసరంగా క్రీజు వదిలి వెళ్లకూడదని మంగళవారం సూచించిన ఎంసీసీ.. రోజు వ్యవధిలోనే అశ్విన్‌ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది.

‘ఈ ఘటనను మరోసారి సమీక్షించాం. అయితే అశ్విన్‌ చర్య క్రీడా స్ఫూర్తికి అనుకూలంగా ఉందని మేం భావించడం లేదు. అశ్విన్‌ క్రీజును చేరుకునే సమయానికి.. బంతి వేయాలనుకునే సమయానికి మధ్య ఎక్కువ గ్యాప్‌ ఉందని  మేం విశ్వసిస్తున్నాం. అశ్విన్‌ బంతి వేస్తాడని భావించిన బట్లర్‌.. ఆ సమయంలో క్రీజులోనే ఉన్నాడు’అని తెలిపారు.
(ఇక్కడ చదవండి: అశ్విన్‌ తప్పులేదు.. మన్కడింగ్‌ ఉండాల్సిందే’)

మరోవైపు ఎంసీసీ ముందుగా ఇచ్చిన ప్రకటనపై యూటర్న్‌ తీసుకుందన్న వ్యాఖ్యలను స్టీవార్ట్‌ కొట్టిపారేశారు. బౌలర్‌ బంతి వేసేవరకూ నాన్‌స్ట్రైకర్‌ క్రీజును వదిలి వెళ్లకూడదని మరోసారి స్పష్టం చేశారు. అయితే కీలక సమయంలో బట్లర్‌ క్రీజులోనే ఉన్నాడని మేం భావిస్తున్నామని తెలిపారు. అశ్విన్‌ తన డెలివరీని ఆలస్యం చేసిన తర్వాత.. బట్లర్‌ క్రీజులోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. బౌలర్‌ బంతి వేసేవరకూ నాన్‌స్ట్రైకర్‌ క్రీజులోనే ఉంటే.. ఈ విషయాలన్నీ చర్చకు రావన్నాడు. దాంతో మన్కడింగ్‌పై కచ్చితమైన స్పష్టతను ఎంసీసీ ఇవ్వకపోవడంపై క్రికెట్‌ విశ్లేషకుల్ని సైతం గందరగోళానికి గురి చేస్తోంది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top