కర్ణాటకకు భారీ ఆధిక్యం

Karnataka has a huge lead - Sakshi

ముంబైతో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌  

నాగ్‌పూర్‌: బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుతంగా ఆడటంతో... ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో మాజీ చాంపియన్‌ కర్ణాటక భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 115/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక ఆట ముగిసే సమయానికి 122 ఓవర్లలో ఆరు వికెట్లకు 395 పరుగులు సాధించింది. ఇప్పటికే 222 పరుగుల ఆధిక్యం కూడగట్టుకున్న కర్ణాటక మూడో రోజు ఈ ఆధిక్యాన్ని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. అబ్బాస్‌ (50; 5 ఫోర్లు)తోపాటు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (78; 11 ఫోర్లు, ఒక సిక్స్‌), సీఎం గౌతమ్‌ (79; 12 ఫోర్లు, ఒక సిక్స్‌), శ్రేయస్‌ గోపాల్‌ (80 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించి అర్ధ సెంచరీలు చేశారు. గోపాల్‌తో పాటు కెప్టెన్‌ వినయ్‌ కుమార్‌ (31 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. కరుణ్‌ నాయర్‌ (16), పవన్‌ దేశ్‌పాండే (8) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. తొలి రంజీ మ్యాచ్‌ ఆడుతోన్న ముంబై బౌలర్‌ శివం దూబే 79 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. మ్యాచ్‌ మరో మూడు రోజులుండటం.. కర్ణాటక భారీ ఆధిక్యం సంపాదించడంతో 41 సార్లు చాంపియన్‌ ముంబైకి క్లిష్ట పరిస్థితే ఎదురుకానుంది.

గుజరాత్‌ 180/6
జైపూర్‌: భార్గవ్‌ మిరాయ్‌ (67), పార్థివ్‌ పటేల్‌ (47) రాణించినా... ఓపెనర్లు ప్రియాంక్‌ పాంచాల్‌ (4), సమిత్‌ గోహిల్‌ (0), మిడిలార్డర్‌లో జునేజా (10), చిరాగ్‌ గాంధీ (4) విఫలమవడంతో బెంగాల్‌తో క్వార్టర్స్‌లో గుజరాత్‌ తడబడింది. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు మరో 174 పరుగులు వెనుకబడి ఉంది. రజుల్‌ భట్‌ (13), పీయూష్‌ చావ్లా (22) క్రీజులో ఉన్నారు. బెంగాల్‌ బౌలర్‌ అమిత్‌ (3/46) రాణించాడు.  

మధ్యప్రదేశ్‌ 338;ఢిల్లీ 180/2
సాక్షి, విజయవాడ: తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ గౌరవప్రదమైన స్కోరు చేయగా... ఢిల్లీ దీటైన సమాధానమిచ్చింది. విజయవాడలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 223/6తో ఆట ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ను హర్‌ప్రీత్‌సింగ్‌ (107) గట్టెక్కించాడు. మనన్‌శర్మ (4/46) రాణించాడు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ (6) త్వరగా ఔటైనా రూకీ చండేలా (73 బ్యాటింగ్‌), ధ్రువ్‌ షరాయ్‌ (78) భాగస్వామ్యంతో ఢిల్లీ మెరుగైన స్కోరు దిశగా వెళ్తోంది.  

విదర్భ 246; కేరళ 32/2
సూరత్‌: కేరళతో మరో క్వార్టర్స్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. అక్షయ్‌ వాద్కర్‌ (53) ఒక్కడే అర్ధసెంచరీ సాధించాడు. స్పిన్నర్‌ కేసీ అక్షయ్‌ (5/66) రాణించాడు. ఆట ముగిసే సమయానికి కేరళ రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. జలజ్‌ సక్సేనా (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top