60 ఏళ్లలో ఇదే తొలిసారి!

Italy fails to qualify for World Cup for first time in 60 years - Sakshi

మిలాన్: నాలుగు సార్లు ప్రపంచ ఫుట్ బాల్ చాంపియన్ అయిన ఇటలీకి ఈసారి ఆదిలోనే చుక్కెదురైంది. కనీసం వరల్డ్ కప్ అర్హత సాధించడంలో ఇటలీ చతికిలబడింది.  వరల్డ్ కప్ క్వాలిఫై టోర్నమెంట్ లో భాగంగా సోమవారం స్వీడన్ తో జరిగిన చివరి ప్లే ఆఫ్ మ్యాచ్ ను ఇటలీ డ్రా చేసుకోవడంతో వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయింది. ఫలితంగా దాదాపు 60 ఏళ్లలో తొలిసారి వరల్డ్ కప్ కు క్వాలిఫై కాకుండా ఘోర అవమానాన్ని చవిచూడాల్సి వచ్చింది. 1958 లో చివరిసారి వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయిన ఇటలీ..ఆపై ఆరు దశాబ్దాల సుదీర్ఘ కాలం తరువాత చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. కాగా, తొలి లెగ్ లో ఇటలీపై ఒక మ్యాచ్ గెలిచిన స్వీడన్ వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. తద్వారా 2006 తరువాత తొలిసారి స్వీడన్ వరల్డ్ కప్ కు క్వాలిఫై అయ్యింది.

తొలిసారి 1934లో విశ్వ విజేతగా నిలిచిన ఇటలీ.. ఆ తర్వాత 1938, 1982, 2006లలో ప్రపంచ చాంపియన్ అయింది. క్వాలిఫై అవ్వాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇటలీ విఫలమైంది. కడవరకూ పోరాడినా గోల్ చేయడంలో మాత్రం సఫలం కాలేదు. ఈ ఓటమితో 39 ఏళ్ల చాంపియన్ గోల్ కీపర్, కెప్టెన్ గియాన్‌ లూగి బఫన్ కెరీర్ కూడా ముగిసింది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌తో వీడ్కోలు పలుకుతానని బఫన్ ముందుగానే ప్రకటించాడు.  ఇటలీ తరపున 175 మ్యాచ్ లకు బఫన్ ప్రాతినిధ్యం వహించాడు. 2006లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో బఫన్ సభ్యుడిగా ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top