ముంబై ఇండియన్స్‌దే విజయం | IPL 2019 Mumbai Indians Beat RCB By 5 wickets | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌దే విజయం

Apr 15 2019 11:54 PM | Updated on Apr 16 2019 12:03 AM

IPL 2019 Mumbai Indians Beat RCB By 5 wickets - Sakshi

ముంబై: మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక వాంఖెడే మైదానంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది. దీంతో ముంబై ఖాతాలో ఐదో విజయం నమోదు కాగ.. ఆర్సీబీ ఏడో ఓటమి చవిచూసింది. ఆర్సీబీ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో ఓవర్‌ మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. 

ఛేదనలో ముంబై కలసికట్టుగా పోరాడింది. తలో చేయి వేసి విజయంలో తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. తొలుత ఓపెనర్లు డికాక్‌(40), రోహిత్‌(28)లు శుభారంభాన్ని అందించారు. అనంతరం సూర్యకుమార్‌(29), ఇషాన్‌ కిషాన్‌(21) రాణించారు. అయితే కృనాల్‌ పాండ్యా(21 బంతుల్లో 11) జిడ్డుగా ఆడటంతో విజయం ఆలస్యమైంది.  చివర్లో హార్దిక్‌ పాండ్యా(37నాటౌట్‌; 16 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు)మెరుపులు మెరిపించడంతో ముంబై విజయం ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో మొయిన్‌ అలీ, చహల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు.
అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ ఆదిలోనే విరాట్‌ కోహ్లి(8) వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో పార్థీవ్‌ పటేల్‌కు జత కలిసిన ఏబీ డివిలియర్స్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 37 పరుగులు జత చేసిన తర్వాత పార్థీవ్‌(28) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై డివిలియర్స్‌-మొయిన్‌ అలీల జోడి దూకుడుగా ఆడింది. ఈ జోడి పోటీ పడి పరుగులు సాధించింది. అయితే 32 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించిన తర్వాత మొయిన్‌ అలీ ఔటయ్యాడు.

ఈ క్రమంలోనే మొయిన్‌-డివిలియర్స్‌ల జోడి 95 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇక స్టోయినిస్‌ విఫలం చెందగా, డివిలియర్స్‌ 51 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు చేసిన తర్వాత రనౌట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. చివరి ఓవర్‌లో డివిలియర్స్‌ ఔటైన తర్వాత అక్ష్‌దీప్‌ నాథ్‌, పవన్‌ నేగీలు ఔటయ్యారు. దాంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లసిత్‌ మలింగా నాలుగు వికెట్లు సాధించగా, హార్దిక్‌ పాండ్యా, బెహ్రాన్‌డార్ఫ్‌లు తలో వికెట్‌ తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement