
న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్‌లపై భారీ జరిమానా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంబుడ్స్‌మన్ రిటైర్డ్ జస్టిస్ డి.కె. జైన్ వారిద్దరిపై రూ. 20 లక్షల చొప్పున జరిమానా విధించారు. తాత్కాలిక నిషేధంతో ఇప్పటికే ఐదు వన్డేలకు దూరమవడంతో తదుపరి చర్యలు అనవసరమని ఆయన భావించారు. అయితే చెత్త వాగుడుపై భేషరతుగా క్షమాపణలు చెప్పాలని అంబుడ్స్‌మన్ ఆదేశించారు.
జరిమానాగా విధించిన మొత్తంలో రూ. లక్ష చొప్పున దేశం కోసం ప్రాణాలర్పించిన పది మంది పారామిలిటరీ కానిస్టేబుళ్ల కుటుంబాలకు అందజేయాలని, మరో 10 లక్షలను అంధుల క్రికెట్ అసోసియేషన్‌కు విరాళంగా ఇవ్వాలని తన తీర్పులో వెల్లడించారు. ఇవన్నీ కూడా నాలుగు వారాల్లోపే పూర్తి చేయాలని లేదంటే బోర్డు వారి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తుందని రిటైర్డ్ జస్టిస్ జైన్ స్పష్టం చేశారు. ‘కాఫీ విత్ కరణ్’ అనే ప్రముఖ టీవీ షోకు విచ్చేసిన వీరు మహిళల గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యానించడంతో తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి.