ధోని అన్నా ఇప్పుడే రిటైర్మెంట్‌ వద్దు

Fans Urge MS Dhoni to Stay On  - Sakshi

‘ధోని బాయ్‌ ఇప్పుడే రిటైర్మెంట్‌ వద్దు.. మెగా టోర్నీ నిష్క్రమణతోనే మా గుండెపగిలింది. ఈ పరిస్థితుల్లో నీ రిటైర్మెంట్‌ ప్రచారం మమ్మల్ని ఇంకా బాధపెడుతోంది. దయచేసి ఆ నిర్ణయం మాత్రం తీసుకోవద్దు.’ అని సోషల్‌ మీడియా వేదికగా యావత్‌ క్రికెట్‌ అభిమానుల మిస్టర్‌ కూల్‌ను అభ్యర్థిస్తున్నారు. #Donotretiredhoni యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన సెమీస్‌లో మాత్రం పరిస్థితులు అనుకూలించక న్యూజిలాండ్‌కు తల వంచింది. అభిమానులకు గుండె కోతను మిగిల్చింది. 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. టాపార్డర్‌ చేతులెత్తేసినా.. ఓటమి కళ్లుముందు కనిపిస్తున్నా.. మ్యాచ్‌ ఫినిషర్‌ ధోని ఉన్నాడులే గెలిపిస్తాడులేనన్న ఓ చిన్న ఆశ.. ప్రతి అభిమాని మదిలో మెదిలింది. 12 బంతుల్లో 36 పరుగులు.. ధోని అనుభవం ముందు పెద్ద లెక్కకాదు. కానీ అదృష్టం కలిసిరాక రనౌట్‌ రూపంలో ఆ ఆశ కూడా ఆవిరైంది. 

ఏనాడు భావోద్వేగాలను ప్రదర్శించని ధోని కూడా ఈ రనౌట్‌తో కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ రనౌట్‌ అంపైర్‌కు కూడా ఇష్టం లేదని అతని ముఖకవలికల ద్వారా స్పష్టమైంది. ఇక ఓ కెమెరా అయితే కన్నీరే కార్చేసింది. ఇవన్నీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే మీడియా మాత్రం ధోని తొలి మ్యాచ్‌లో రనౌట్‌.. ఆఖరి మ్యాచ్‌లో రనౌట్‌ అంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. దీన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని ధోనిని వేడుకుంటున్నారు. ‘వీల్‌చైర్‌లో ఉన్న ధోనికి తన జట్టులో చోటిస్తానని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ డివిలియర్స్‌ అన్న మాటలే ధోని ఎంత గొప్ప ఆటగాడో తెలియజేస్తున్నాయి. తమ దేశ పౌరసత్వం ఉంటే ఇప్పుడే ధోనిని తమ జట్టులోకి తీసుకుంటామని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ అన్న వ్యాఖ్యలు ధోని విలువెంటో చెబుతున్నాయి. కానీ మనవాళ్లే ధోని రిటైర్మెంట్‌పై ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ధోని భారత జట్టుకు లభించిన ఓ ఆణిముత్యమని, మరెవరిని ఊహించలేని పాత్ర అతనిదని.. ఇప్పుడే రిటైర్మెంట్‌ వద్దని వేడుకుంటున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top