ఆర్చరీ కోచ్‌ మినహా...  | Sakshi
Sakshi News home page

ఆర్చరీ కోచ్‌ మినహా... 

Published Thu, Sep 20 2018 1:36 AM

Except Jeevan Jyot Singh naminated to  - Sakshi

న్యూఢిల్లీ: ‘ద్రోణాచార్య’ అవార్డుకు నామినేట్‌ అయిన భారత కాంపౌండ్‌ విభాగం ఆర్చరీ జట్టు కోచ్‌ జీవన్‌జ్యోత్‌ సింగ్‌ తేజ మినహా... నామినేట్‌ చేసిన మిగతా అందరికీ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణా చార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డులు అధికారికంగా ఖాయ మయ్యాయి. ఈ మేరకు అవార్డుల సెలెక్షన్‌ కమిటీ పంపించిన జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కొరియాలో 2015లో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా జీవన్‌జ్యోత్‌ నిర్లక్ష్యం కారణంగా భారత యూనివర్సిటీ పురుషుల జట్టు ఇటలీ జట్టుతో జరగాల్సిన కాంస్య పతక పోరుకు నిర్ణీత సమయానికి వేదిక వద్దకు చేరుకోలేకపోయింది. దాంతో నిర్వాహకులు ఇటలీకి కాంస్య పతకం ఖాయం చేశారు. ఈ ఉదంతంపై విచారణ చేసిన ఆలిండియా యూనివర్సిటీల సంఘం జీవన్‌జ్యోత్‌పై మూడేళ్లపాటు, భారత ఆర్చరీ సంఘం ఏడాది పాటు నిషేధం విధించింది.  

కోర్టుకు వెళ్తా: జీవన్‌జ్యోత్‌ 
తన పేరును ద్రోణాచార్య అవార్డుల జాబితా నుంచి తొలగించడంపై జీవన్‌జ్యోత్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘చివరి నిమిషంలో నా పేరు తొలగించడం అన్యాయం. ఈ విషయాన్ని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా. న్యాయం కోసం కోర్టులో క్రీడా శాఖపై కేసు వేస్తా’ అని జీవన్‌జ్యోత్‌ తెలిపాడు. ‘2015 ప్రపంచ యూనివర్సిటీ ఉదంతం విషయంలో నా తప్పిదం లేకపోయినా శిక్ష అనుభవించాను. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించానని అనుకుంటే జకార్తా ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు కోచ్‌గా నన్ను ఎందుకు పంపించారు. నన్ను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేయకూడదని క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయంతో తీవ్రంగా కలత చెందాను’ అని జీవన్‌జ్యోత్‌ తెలిపాడు. 2018 జాతీయ క్రీడా పురస్కారాల విషయానికొస్తే భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి, వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానులకు ‘ఖేల్‌రత్న దక్కనుంది. ‘అర్జున’ అవార్డుల కోసం ఎంపిక చేసిన 20 మంది క్రీడాకారుల జాబితాలో తెలంగాణ నుంచి డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సిక్కి రెడ్డి కూడా ఉంది. ఈనెల 25న రాష్ట్రపతి భవన్‌లో  అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.  

Advertisement
Advertisement