‘కోట్లా’పై పాంటింగ్‌ ధ్వజం

Cant accept performance like that: Ricky Ponting - Sakshi

పిచ్‌ అధ్వాన్నంగా ఉందన్న డీసీ కోచ్‌  

న్యూఢిల్లీ:  సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ చేతుల్లో చిత్తుగా ఓడిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తమ మైదానంలోని పిచ్‌ను తప్పు పట్టాడు. హోమ్‌ టీమ్‌కు క్యురేటర్లు ‘అధ్వాన్నమైన’ పిచ్‌ను అందించారని అతను వ్యాఖ్యానించాడు. ఏమాత్రం బౌన్స్‌ లేకుండా మరీ మందకొడిగా కనిపించిన పిచ్‌పై ఢిల్లీ 129 పరుగులకే పరిమితం కాగా... బెయిర్‌స్టో జోరుతో హైదరాబాద్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ‘నిజాయితీగా చెప్పాలంటే పిచ్‌ ప్రవర్తించిన తీరుపై మేమంతా ఆశ్చర్యపోయాం. మ్యాచ్‌కు ముందు గ్రౌండ్స్‌మన్‌తో మాట్లాడిన సమయంలో ఇది బెస్ట్‌ పిచ్‌ అవుతుందని భావిస్తే చివరకు చెత్త పిచ్‌గా తేలింది. ఇది మాకంటే ప్రత్యర్థికే ఎక్కువగా అనుకూలించింది. ఆ జట్టులో ఒక అత్యుత్తమ స్పిన్నర్‌తో పాటు పేసర్లందరూ స్లో బంతులు విసిరేవారే.

పిచ్‌ రాబోయే రోజుల్లోనూ ఇలాగే ఉంటే మా తుది జట్టుపై ఆలోచించాల్సి ఉంటుంది’ అని పాంటింగ్‌ అన్నాడు. అయితే పాంటింగ్‌ ఆరోపణలను ఢిల్లీ క్రికెట్‌ సంఘం కొట్టిపారేసింది. పిచ్‌ ఎలా ఉండబోతోందనే విషయంపై తమ క్యురేటర్లు ఎవరూ పాంటింగ్‌తో మాట్లాడలేదని అసోసియేషన్‌ అధికారి ఒకరు జవాబిచ్చారు. ‘నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఢిల్లీ జట్టుకు సొంతంగా ఒక పిచ్‌ క్యురేటర్‌ ఉన్నాడు. అతడితోనే వారు మాట్లాడుతున్నారు. అతనికి నిజానికి పిచ్‌లపై ఎలాంటి అవగాహన లేదు. క్యురేటర్‌గా చెప్పుకునే అర్హతే లేదు. అతనే వారిని తప్పుదోవ పట్టించాడు. అయినా ఈ సీజన్‌లో ఫిరోజ్‌షా కోట్లాలో పెద్ద సంఖ్యలో దేశవాళీ మ్యాచ్‌లు జరిగాయి. కాబట్టి సహజంగానే వికెట్‌ నెమ్మదిగా మారుతుంది’ అని ఆయన చెప్పారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top