అభివృద్ధి ఘనత మాదే

ZPTC ANd MPTC Elections Harish Rao Election Campaign In Medak - Sakshi

శివ్వంపేట(నర్సాపూర్‌): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మెజార్టీ కోసమే జరుగుతున్నాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్యేల్యే హరీశ్‌రావ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి ఆయన శివ్వంపేటలో రోడ్‌ షో నిర్వహించా రు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఉన్నందున అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కాకుండా ఇతర పార్టీలకు ఓట్లు వేస్తే మోరీలో వేసినట్లేనని అన్నారు. పార్టీ బలపడినందున, నాయకుల సంఖ్య పెరిగినందున కొందరికి టికెట్లు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారని వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా కోరారు. శివ్వంపేట మండలంలో ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. గతంలో వ్యవసాయం దండగా అనేవారని, కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం పండగ అన్నట్లుగా మారిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10 వేలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రలు అమలు చేస్తున్నాయన్నారు. కొండ పోచమ్మ ప్రాజెక్టు ద్వారా నర్సాపూర్‌ నియోజకవర్గానికి త్వరలో సాగునీరు అందనుందని వెల్లడించారు.

రైతులు భూములు అమ్ముకోవద్దని హరీశ్‌రావు సూచించారు. వచ్చే నెల నుంచి రూ.2 వేల పింఛన్‌ అందివ్వడం జరుగుతుందన్నారు. శివ్వంపేట జెడ్పీటీసీ అభ్యర్థి పబ్బ మహేశ్‌గుప్తా, ఎంపీటీసీ అభ్యర్థి కల్లూరి హరికృష్ణ యువకులు అయినందున ఆదరిస్తే మరింత ఉత్సహంగా ప్రజా సంక్షేమం కోసం పని చేస్తారని చెప్పారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆదరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ఏర్పాటులో భాగస్వామి కావాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి పనులతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రగౌడ్,  నర్సాపూర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మాధవరెడ్డి, నాయకులు మన్సూర్, కల్లూరి హన్మంతరావు, నర్సింహారెడ్డి రమణగౌడ్, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top