సాక్షి, హైదరాబాద్: విభజన వల్ల అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తాము చేస్తున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. హోదా అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సమాయత్తమైంది. విద్యార్థులను చైతన్య పరిచే విధంగా ఈ నెల 27 వరకూ రచ్చబండ చేపట్టాలని పార్టీ సర్క్యులర్ జారీ చేసింది.
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రముఖ కళాశాలల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించింది. ‘ప్రత్యేక హోదా మన హక్కు– ప్యాకేజీతో మోసపోవద్దు’అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సర్క్యులర్‌లో సూచించారు. టీడీపీ స్వార్థం కోసం హోదాకు బదులుగా ప్యాకేజీని స్వాగతించిన విషయాన్ని ప్రజలకు వివరిస్తారు. మార్చి 1న అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల దిగ్బంధనానికి పార్టీ పిలుపునిచ్చింది. 2014 మార్చి 1న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై నాటి రాష్ట్రపతి సంతకం చేసిన నేపథ్యంలో అదే రోజు నిర్వహిస్తున్న కలెక్టరేట్‌ల దిగ్బంధనానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని వైఎస్సార్ సీపీ కోరింది.
హోదా పోరుపై విపక్షం కార్యాచరణ
Feb 25 2018 1:03 AM | Updated on Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement