‘టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడారు?’

YS Jagan Speech At Narasannapeta Public Meeting - Sakshi

సాక్షి, నరసన్నపేట: రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లమ్మకు వైఎస్సార్ చేయూత ద్వారా సాయం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 45 ఏళ్లు దాటిన ప్రతి అక్కకు వైఎస్సార్‌ చేయూత అందుబాటులో ఉంటుందని అన్నారు. 45 నుంచి 60 ఏళ్ల నడుమ ఉన్న ప్రతి అక్కకు నాలుగు దఫాల్లో 75వేల రూపాయల సాయం ఉచితంగా అందజేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక హోదా వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు వెంపర్లాడారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మురికి కాలువలో మునిగితే.. దానినే గంగా నది అంటారని ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 322వ రోజు ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో జననేత అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగన్నరేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన వైఎస్‌ జగన్‌.. ప్రజలు అవినీతి పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారు?
బహిరంగ సభలో వైఎస్‌ జగన్ మాట్లాడుతూ.. ‘వంశధార విషయంలో ఒడిశాతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. శ్రీకాకుళం రైతుల గురించి ఆలోచించి.. వంశాధర ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి యుద్ద ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి 930 కోట్ల రూపాయలు కేటాయించి.. తను బతికి ఉండగానే 700 కోట్ల రూపాయల విలువైన పనులను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం 175 కోట్లు కేటాయించింది. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం మిగిలిన 55 కోట్ల రూపాయల విలువైన పనుల అంచనాను 476 కోట్లకు పెంచేశారు. ఆ పనులను తన బినామీ సీఎం రమేశ్‌కు అప్పగించారు. అయిన నత్తనడకన పనులు జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో కరకట్టల నిర్మాణానికి దివంగత నేత 2007-08లోనే 33 కోట్లు మంజూరు చేస్తే.. ఇప్పటికి కరకట్ట పనులు పూర్తికాలేదంటే శ్రీకాకుళం జిల్లా పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.

మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వంశాధర ప్రాజెక్టు పెండింగ్‌ పనులు, నేరేడ బ్యారేజ్‌ పనులు దగ్గర నుంచి చేయిస్తాను. నరసన్న పేట నియోజకవర్గంలో ఎత్తున ఉన్న పంట పొలాలకు నీరు అందించడానికి వైఎస్సార్‌ వంశధార ఎడమ కాలువ మీద 8 లిఫ్టులు పెడితే.. అవి నేడు పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి. సారంకోట మండలంలో ఏర్పాటు చేసిన లిప్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు చెందిన  పైపులు, మోటార్లు మూలన పడ్డాయి. నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌ 38వేల ఇళ్లను నిర్మిస్తే.. చంద్రబాబు ఊరికి మూడు, నాలుగు ఇళ్లు కూడా నిర్మించలేదు. హామీలు ఇచ్చి.. పనులు మొదలైనట్టు ఫొటోలకు ఫోజులివ్వడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు. నరసన్న పేటలో మంచి నీటి సమస్యను పరిష్కారిస్తానన్న చంద్రబాబు కనీసం నాలుగైదు కాలనీలకైనా నీరు ఇచ్చారా?


 
రైతుల మద్దరు ధరను అచ్చెన్నాయుడు మింగేశారు..
ఇక్కడి నుంచి వందల లారీల ఇసుక రోజుకు విశాఖపట్నం పోతుంది. కానీ ఇక్కడ ప్రజలకు ఇసుక దొరకదు. ఇక్కడ నుంచి వెళ్లిన ఇసుకను మాత్రం 40వేల రూపాయలకు విశాఖలో విక్రయిస్తున్నారు. ఇసుక లంచాలు ఎమ్మెల్యే స్థాయి నుంచి చినబాబు, పెద్దబాబు దాకా వెళ్తున్నాయి. ఇసుక ఫ్రీగా ఇస్తానని చెబతున్న చంద్రబాబుకు, చినబాబుకు మాత్రం అది ఫ్రీగా దొరుకుంతుంది. మినుమ రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధరను మంత్రి అచ్చెన్నాయుడు మింగేశారు. మంత్రులే దళారుల రూపం ఎత్తుతున్నారు. రైతుల ధర్నా చేస్తే మంత్రుల అన్యాయం, అక్రమాలు బయటకు వచ్చాయి. అయిన మంత్రిపై, మంత్రి అనుచరులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మన పిల్లలకు మంచి చదువు అందించాల్సిన సీఎం.. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 36 స్కూళ్లను ముయించేశారు. స్కూళ్లతో పాటు 3 హాస్టళ్లను ముయించేశారు.

తిత్లీ బాధితులకు కనీసం 500 కోట్లు పంపిణీ చేయలేదు..
తిత్లీ తుపాన్‌ వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురుచూసిన జిల్లా ప్రజలకు చివరకు నిరాశే మిగిలింది. 3435 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు.. ప్రజలకు ఎంత ఇచ్చారు?. అంత నష్టం వాటిల్లిందని చెప్పిన చంద్రబాబు.. కనీసం 500 కోట్లు కూడా పంపిణీ చేయలేదు. బాధితులు చంద్రబాబు ఎదుట నిరసన తెలిపితే.. వెనుకాల నుంచి ఫొటోలు తిసీ.. ప్రచారం కోసం వాడుతున్నారు. ఆర్టీసీ బస్సులకు అంటించి ఊరురా తిప్పుతున్నారు. తిత్లీ వచ్చి రెండు నెలలు గడిచిన వ్యవసాయ మోటార్లకు కరెంట్‌ రిస్టోర్‌ చేయలేదు. చంద్రబాబు తీరు శవాలపై చిల్లర ఏరుకునేలా ఉంది.  రాష్ట్రంలో పరిపాలనపై ఆలోచన చేయండి. 

రాష్ట్రంలో దళారీల పాలన సాగుతుంది..
కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు చంద్రబాబు వెళ్లరు. కరువు ప్రాంతాల్లోని రైతులకు 2 వేల కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వడు. వరికి మద్దతు ధర 1750 రూపాయలు అని చెబితే.. కనీసం 1100 రూపాయలకు కొనే నాధుడే లేడు. ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేదు. రైతులకు తోడుగా ఉండాల్సిన ప్రభుత్వం దళారీ రూపం ఎత్తింది. రైతుల నుంచి తక్కువ ధరలకు ఉత్పత్తులను కొని ప్యాక్‌ చేసి తన హెరిటేజ్‌ షాపులో మూడు, నాలుగు రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారు. దళారీలకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు పాలన నేడు రాష్ట్రంలో సాగుతుంది. 

నిరుద్యోగులకు నరకం చూపిస్తున్నారు..
జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. జాబు రాకుంటే రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. ఆ లెక్కన చంద్రబాబు ప్రతి కుటుంబానికి లక్ష పది వేల రూపాయలు బాకీపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయ్యరు. 23వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే.. ఏడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో సిలబస్‌ మార్చి, షెడ్యూల్‌ను మారుస్తూ నిరుద్యోగులకు నరకం చూపిస్తున్నారు. జాబు సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు ఉడుతున్నాయి. పోస్టింగ్‌లు లేవుగానీ, ఉస్టింగ్‌లు మాత్రం కనిపిస్తున్నాయి. 

ఇళ్లు పూర్తికాకుండానే.. భోజనాలు పెట్టినట్టు..
రాష్ట్రానికి జీవరేఖ అయిన పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలడం లేదు. అవినీతిమయంగా మారిన పోలవరంలో రెట్లు విపరీతంగా పెంచుతున్నారు. సబ్‌ కాంట్రాక్టు పనులను చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకుంటారు. అందులో మంత్రి యనమల వియ్యంకుడు కూడా ఉన్నారు. ఓకాయన ఇళ్లు కట్టడానికి పునాదులు వేసి.. తర్వాత పునాదులు అయిపోయాక ఇంటి చుట్టూ గోడకట్టి గేటు పెట్టాడు. తర్వాత ఇళ్లు పూర్తయినట్టుగా బిల్డప్‌ ఇస్తూ ఊర్లో ఉన్నవారందరినీ భోజనాన్ని పిలిచాడు. చంద్రబాబు కూడా ఇదే సినిమాను పోలవరం విషయంలో చూపిస్తున్నారు. రాజధాని విషయంలో కూడా నాలుగేళ్లుగా ఇలాంటి గ్రాఫిక్స్‌ సినిమాను చూపిస్తున్నారు. ఇప్పటివరకు శాశ్వత రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడలేదు. అన్ని తాత్కాలిక నిర్మాణలే. కరెంట్‌ చార్జీలపై, ఆర్టీసీ చార్జీల, స్కూలు ఫీజులపై బాదుడే బాదుడు.

గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం 50వేలు ఖర్చు చేస్తున్నారు..
4 ఇస్ర్తీ పెట్టెలు,  కత్తెర్లు ఇస్తే బీసీలపై ప్రేమ ఉన్నట్టా?. బీసీలపై నిజమైన ప్రేమ చూపించిన వ్యక్తి వైఎస్సార్‌. దివంగత నేత ప్రవేశపెట్టిన ఫీజు రియింబర్స్‌మెంట్‌ను బాబు తుంగలో తొక్కారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం 50 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 108కు ఫొన్‌ చేస్తే అది వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌ హయంలో మాదిరి రేషన్‌ షాపుల్లో వస్తువులు దొరకడం లేదు. లంచం లేనిదే రాష్ట్రంలో ఏ పని జరగడం లేదు. రాష్ట్రంలో జన్మభూమి కమిటీల మాఫియా నడుస్తుంది. ప్రజలు ఓటు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే.. చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష రాజకీయాలు అంటున్నారు.

టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడారు?
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఊసరవెళ్లి కన్నా వేగంగా రంగులు మార్చారు. తెలంగాణ కాంగ్రెస్‌తో పొత్తుకు ముందు ఓ మాట.. తర్వాత ఓ మాట మాట్లాడారు. హరికృష్ణ అంత్యక్రియలు సాగుతుంటే.. అక్కడ చంద్రబాబు కేటీఆర్‌తో పొత్తుల గురించి చర్చించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. పొత్తుకు కేటీఆర్‌ ఒప్పుకోకపోతే.. సిగ్గులేకుండా ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు. చంద్రబాబు అంత అవినీతిపరుడు ఎవరు లేరన్న కాంగ్రెస్‌.. అవినీతి సొమ్ములో భాగం ఇవ్వడంతోనే చంద్రబాబుతో జతకట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అనైతిక పొత్తులు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగిన ఇరు పార్టీలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు చెందిన అవినీతి సొమ్ము భారీగా పట్టుబడిందని టీఆర్‌ఎస్‌ చెబుతుంది. తను తొలుత పొత్తు పెట్టుకుంటానన్న టీఆర్‌ఎస్  ఏపీలోకి వస్తామంటే.. ఆ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదాకు నిరాకరించిందని చంద్రబాబు అంటారు. టీఆర్‌ఎస్‌ ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తుందని చెబుతున్న చంద్రబాబు.. ఆ పార్టీతో పొత్తు కోసం తొలుత ఎందుకు ప్రయత్నించారు?. బీజేపీతో కలిస్తే అది మంచిది.. కాంగ్రెస్‌తో కలిస్తే అది మంచిదని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు తను మురికి కాలువలో మునిగితే.. అది గంగా నది అంటారు. రాజకీయ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారు.

వైఎస్సార్‌ చేయూత..
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవరత్నాలను అమలు చేస్తాం. కార్పొరేన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. వాటిని పారదర్శకంగా నిర్వహిస్తూ.. ప్రతి ఒక్కరికి చేయూత అందిస్తాం. 45 నుంచి 60 ఏళ్ల నడుమ ఉన్న ప్రతి అక్కకు నాలుగు దఫాల్లో 75వేల రూపాయలు ఉచితంగా అందజేస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ తీసుకొస్తాం. అందులో ఆ ఊరికి చెందిన 10 మందికి ఉద్యోగాలిస్తాం. దాని ద్వారా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తాం. పెన్షన్లు, బియ్యం, ఇళ్లు కావాలన్న నేరుగా ఇంటికే వచ్చేట్టు చేస్తాం. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్లను నియమిస్తాం. వారికి నెలకు 5వేల రూపాయలు అందజేస్తాం. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేయిస్తామ’ని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top