
తిరుపతి రూరల్/చంద్రగిరి రూరల్: అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టాలను అతిక్రమించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్న వారిపై గవర్నర్‌కు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం లండన్ నుంచి హైదరాబాదుకు చేరుకున్న ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు. కార్యకర్తలకు అండగా ఉందాం...ఆరో గ్యం జాగ్రత్తని సూచించారని చెవిరెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఓట్ల తొలగింపునకు జరుగుతున్న కుట్రలను వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫోన్‌లో వివరించారు.
పెద్దిరెడ్డి మాటతో దీక్ష విరమణ
అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం అర్ధరాత్రి నుంచి మంచి నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అధికార పార్టీ కోసం చట్టాలను అతిక్రమిస్తున్న ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించా రు. దీంతో మంగళవారం ఉదయం దీక్ష విరమించిన చెవిరెడ్డి, పోలీసు స్టేషన్ నుంచి నేరుగా చిత్తూరు, పీలేరు సబ్‌జైలుకు వెళ్లి అక్కడున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించారు.
చట్టాలను అతిక్రమించిన పోలీసులపై చర్యలు తీసుకుంటా: డీఐజీ రాణా
చట్టాలను అతిక్రమించి, దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ క్రాంతిరాణా ఠాటా అన్నారు. ఆమేరకు సోమవారం రాత్రి ఎమ్మెల్యే చెవిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.