మాది రైతు పక్షపాత ప్రభుత్వం

YS Jagan Mohan Reddy Speech In Andhra Pradesh Assembly - Sakshi

గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలిస్తాం 

రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం వైఎస్‌ జగన్‌

గత ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్రమైన కరువు కాటకాలు 

కేంద్రమిచ్చిన పెట్టుబడి రాయితీ ఎన్నికల పథకాలకు మళ్లించారు 

కానీ మేం అలా కాదు.. అన్నదాతల కోసం రూ.2 వేల కోట్లతో విపత్తు నిధి

ఏ సీజన్‌లో పంట నష్టం వాటిల్లినా మరుసటి సీజన్‌కే సాయం

వైఎస్సార్‌ జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం 

60 శాతం వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల విద్యుత్‌

మిగిలిన 40 శాతం పంపుసెట్లకు వచ్చే ఏడాది నుంచి అమలు

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి

మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి ఎమ్మెల్యే చేతిలో రూ.కోటి పెడుతున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఆ రూ.కోటి ఇస్తాం. ఈ నిధులు నేరుగా సీఎం డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచే ఇస్తున్నాం. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, రాజకీయాలు, పార్టీలు చూడం.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. గత ప్రభుత్వం రైతు సమస్యలను గాలికొదిలేసిందని, బకాయిలు విడుదల చేయకుండా పక్కాదారి పట్టించడం వల్లే ఖరీఫ్‌లో విత్తన సమస్య ఏర్పడిందని ఎండగట్టారు. అయిదేళ్లుగా వరుస కరువుల వల్ల దారుణంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాల్సిందిపోయి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శాసనసభలో మాట్లాడారు.

రాష్ట్రంలో సాగు నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గత ప్రభుత్వం అయిదేళ్లలో అనుసరించిన తీరు, రైతుల పక్షపాత ప్రభుత్వంగా ప్రస్తుతం ఏమి చేయబోతున్నామనే విషయాలు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో మొదటి రోజు సభ ముందు ఉంచుతున్నామంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 62 శాతం మంది రైతులే ఉన్నారని, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నొక్కి చెప్పారు. నైరుతి రుతు పవనాల సీజన్‌లో ఇప్పటి (జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ) వరకు 135.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 48.3 శాతం లోటుతో 70.1 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసిందని సీఎం పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సగటున 42 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా జూన్‌ 1 నుంచి జూలై 10 నాటికి సగటున 9.15 లక్షల హెక్టార్లలో విత్తనాలు, నాట్లు పడాల్సి ఉండగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 3.82 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..  రైతుల జీవితాలతో ఆడుకున్నారు ‘వర్షాలు ఆలస్యమయ్యాయి. ఒక వైపు గ్రామాల్లో తాగునీటి కొరత పెరుగుతుండగా, మరో వైపు జూలై రెండో వారం వచ్చినా విత్తనాలు వేయని పరిస్థితి ఉంది.

వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇదే సమయంలో మరికొన్ని నిజాలను కూడా సభ ముందు ఉంచుతున్నా. మేం అధికారంలోకి వచ్చి కేవలం 40 రోజులు మాత్రమే అయినప్పటికీ ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. 2013 – 2014లో ఒక వైపు తీవ్రమైన కరువు, మరోవైపు వరుస తుపాన్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. ఆదుకుంటామని నమ్మించి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం రూ.2,300 కోట్ల పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టింది. గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా రైతులకు గత ప్రభుత్వం రూ.960 కోట్లు  బకాయిలు పెట్టింది. అక్షరాలా రూ.384 కోట్లు విత్తన బకాయిలు ఉన్నాయని, కనీసం అవైనా చెల్లించాలని అడిగితే గత సర్కారు ఇవ్వలేదు. రైతుల జీవితాలతో ఆడుకున్నారని అధికారులు సైతం చెబుతుంటే నిజంగా ఇది ఎంత మానవత్వం లేని ప్రభుత్వం అని బాధనిపించింది. కరువు సంవత్సరాల్లో కనీసం వడ్డీ మాఫీ కూడా చేయలేదు. కరువు సంభవించినప్పుడు ఏ రైతు అయినా కనీసం వడ్డీ మాఫీ చేసి రుణాలు రీషెడ్యూలు చేయాలని కోరుకుంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో తీవ్ర కరువులు సంభవించినా రుణాల రీషెడ్యూలు చేయలేదు. వడ్డీ మాఫీ మాటే లేదు. అలాంటి ఆలోచనలుగానీ, ప్రతిపాదనలు గానీ ఏ రోజూ గత ప్రభుత్వం నుంచి రాలేదు.

పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌కు శ్రీకారం
దారుణమైన పరిస్థితుల్లో ఉన్న రైతుల సంక్షేమం కోసం మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వారికి తోడుగా ఉండేందుకు ఏమేం చేశామన్నది గర్వంగా చెబుతాం. వైఎస్సార్‌ సున్నా వడ్డీ రుణాల పథకానికి శ్రీకారం చుట్టాము. ఇచ్చిన మాట ప్రకారం 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. మిగిలిన 40 శాతం ఫీడర్ల ద్వారా 9 గంటలు పగటి పూట విద్యుత్‌ సరఫరా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,700 కోట్లు అవసరమని అధికారులు చెప్పగానే నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే జూన్‌ నాటికి ఈ 40 శాతం ఫీడర్లలో కూడా రైతులకు 9 గంటలు పగటిపూటే విద్యుత్‌ సరఫరా చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇస్తున్నాం. దీనివల్ల అక్షరాలా రూ.720 కోట్ల మేరకు ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగనుంది.

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా
వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా 55 లక్షల మంది రైతుల తరఫున 1.38 కోట్ల ఎకరాలకు అక్షరాలా రూ.2,164 కోట్ల బీమా ప్రీమయం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధరల కల్పన కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాం. నష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున రూ.330 కోట్లు విడుదల చేశాం. ఈ మొత్తాన్ని ఇప్పటికే పంపిణీ చేస్తున్నాం. మొన్న జమ్మలమడుగులో చెక్కుల పంపిణీ కూడా ప్రారంభించాం. మన సరిహద్దులో ఉన్న తెలంగాణలో ఆయిల్‌ఫామ్‌ ధర మన రాష్ట్రంలో కంటే రూ.1,000 ఎక్కువగా ఉంది. రైతులు ఎంత అడిగినా గత సర్కారులో పట్టించుకున్న నాథుడే లేరు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయిల్‌ఫామ్‌ రైతులకు అదనపు మద్దతు ధర కల్పిస్తూ రూ.80 కోట్లు విడుదల చేశాం. దీనివల్ల 1.10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. పొగాకు ధరలు పడిపోతున్న తరుణంలో వెంటనే స్పందించాం. గతంలో జగన్‌ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి ధర్నా చేస్తే తప్ప రైతులకు మేలు జరగలేదు. ఈసారి పరిస్థితి మారింది. పొగాకు ధరలు పడిపోకుండా మంత్రి వెళ్లారు. లోగ్రేడ్‌ పొగాకుకు కూడా మంచి ధర వచ్చేలా చేశారు. కొనుగోలు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. 

మార్కెట్‌ కమిటీల గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలు
ప్రతి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో వివిధ పంటల ధరలు ఎలా ఉండాలో తెలుసుకునేందుకు, ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు మార్కెట్‌ కమిటీలకు ఇకపై ఎమ్మెల్యేను గౌరవ చైర్మన్లుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నా. మార్కెట్‌ కమిటీలకు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్లు ఎలాగూ ఉంటారు. ఎమ్మెల్యేలు కూడా మార్కెట్‌ కమిటీల సమావేశాలకు హాజరవుతూ ఎప్పటి కప్పుడు ధరలు తెలుసుకుంటూ అక్కడ పండే పంటలకు గిట్టుబాటు ధరను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధులతో రైతులకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం విత్తన బకాయిలు విడుదల చేయకుండా రైతులను గాలికొదిలేస్తే మా ప్రభుత్వం రూ.384 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ధాన్యం సేకరణకు రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. ఆ మొత్తం కూడా విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగా రూ.360 కోట్లు విడుదల చేశామని గర్వంగా చెబుతున్నాను. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ బకాయిలు కూడా రూ.2 వేల కోట్లు మా ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నాను. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేశాం. వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశాం. ప్రతి నెల ఈ మిషన్‌ సమావేశం నిర్వహించి, క్షేత్ర స్థాయిలో విషయాలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ నెల రోజుల్లోనే చేశాం. 

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా
ప్రమాదవశాత్తు రైతులు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా గతంలో ఎవరూ పట్టించుకునే వారు కాదు. 2014 – 2018 వరకూ డిస్ట్రిక్ట్స్‌ క్రైమ్‌ బ్యూరో లెక్కల ప్రకారం 1,513 మంది ఆత్మహత్య చేసుకుంటే వారిలో 391 మందికి మాత్రమే అంతో ఇంతో సహాయం అందజేశారు. మేము అధికారంలోకి రావడంతోనే ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించాం. గత ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా ఈ సాయం అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించాం. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలివీ. ఇక ఏడాదిలో ఏమి చేస్తామో చెబుతాను. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మరో పథకం తెస్తున్నాను. తుపాన్లు, కరువులు వస్తే గత ప్రభుత్వంలాగా బాధిత రైతులను గాలికి వదిలేయకుండా తక్షణమే ఆదుకునేందుకు రూ.2,000 కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తున్నాం.
 

గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు, ల్యాబ్‌ల ఏర్పాటు
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్ర జనాభాలో 62 శాతం రైతులే ఉన్నారు. 62 శాతం జనాభా కష్టాల్లో ఉంటే రాష్ట్రం ఎలా బాగుంటుందని నేను ఆలోచించాను. మేము ప్రకటించిన నవరత్నాలు కూడా రైతులు, పేదలకు మేలు చేసే విధంగా రూపొందించాం. అందులో ఒకటి వైఎస్సార్‌ రైతు భరోసా. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కింద అక్షరాలా రూ.12,500 ఈ అక్టోబర్‌ 15వ తేదీ నుంచే అందించనున్నామని సగర్వంగా చెబుతున్నాను. మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఏడు నెలల ముందు నుంచే ఈ పథకం అమలు చేస్తున్నాం. రాష్ట్ర రైతుల్లో 50 శాతం మందికిపైగా 1.25 ఎకరాల లోపు భూమి మాత్రమే ఉంది. 2.5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. ఇలాంటి రైతులకు ఈ సహాయం చాలా ఉపయోగపడుతుంది. తొలి ఏడాదే సహకార రంగాన్ని పునరుద్ధరించబోతున్నాం. మూతపడిన సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలను తిరిగి తెరిపిస్తాం. ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు అవసరం మేరకు ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుడతాం. వచ్చే అయిదేళ్ల కాలంలో మండల స్థాయిలో కూడా అందుబాటులోకి తెస్తామని సగర్వంగా చెబుతున్నాను. రైతులు కొంటున్న విత్తనాలు, పురుగు మందుల నాణ్యతను పరిశీలించేందుకు ప్రతి నియోజకవర్గంలో ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు నేరుగా గ్రామ స్థాయిలో విక్రయించేలా చర్యలు తీసుకోబోతున్నాం. ఎక్కడా కల్తీలకు ఆస్కారం లేకుండా చట్టాలను ఇంకా గొప్పగా తీర్చిదిద్దబోతున్నాం. కొబ్బరికి కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోబోతున్నాం.

రబీకి విత్తనాల సేకరణకు ఆదేశించాం
ఎక్కడా నీటి కొరత రాకుండా ఉండేందుకు ఎంత డబ్బు ఖర్చైనా పరవాలేదని కలెక్టర్లకు చెప్పాం. ఇంతకు ముందు పాలకులకు ఆ మనసు లేదు. నీటి విలువ, ప్రజల కష్టాలు తెలిసిన మనసున్న ప్రభుత్వంగా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఎమ్మెల్యేకు కోటి రూపాయలు కేటాయిస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే వారి నియోజకవర్గాల్లో పర్యటించి నీటి ఎద్దడి నివారణకు ఈ డబ్బులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. గత ప్రభుత్వానికి భిన్నంగా నిధులు కేటాయిస్తాం. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా కోటి రూపాయలు కేటాయిస్తున్నాం. ప్రజలకు మంచి చేయండని కోరుతున్నాం. పశువులకు కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. వచ్చే రబీని దృష్టిలో పెట్టుకుని విత్తనాల సేకరణకు అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. రాయలసీమ జిల్లాల్లో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఒక్కో ట్యాంకరుకు రూ.500 ఉన్న మొత్తాన్ని రూ.600కు పెంచాం. ఈ బడ్జెట్‌లోనే రూ.2 వేల కోట్ల ప్రకృతి వైపరీత్యాల నిధి పెడతాం. ఏ సీజన్‌లో అయినా విపత్తుల వల్ల పంట నష్టపోతే మరుసటి సీజన్‌లో పంటల సాగుకు అనుకూలంగా పెట్టుబడి రాయితీ ఇస్తాం. కరువే వస్తే.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రుణాల వడ్డీని మాఫీ చేస్తాం. ప్రభుత్వమే దీనిని భరిస్తుంది. రుణాల రీషెడ్యూలు కూడా చేస్తాం. గత అయిదేళ్లలో ఇలాంటివి మనం అసలు చూడలేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చబోతున్నాం’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు.  

ప్రాజెక్టుల నుంచి నీరు పారిస్తాం
గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలించేందుకు గొప్ప కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది ఒక చరిత్ర. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడమే కాకుండా 200 రిగ్గులు కొనుగోలు చేసి అడిగిన ప్రతి ఒక్కరికి బోర్లు వేస్తామని ప్రకటిస్తున్నా. వైఎస్సార్‌ జలయజ్ఞం ద్వారా సకాలంలో చెరువుల పునరుద్ధరణ చేయబోతున్నాం. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అన్నీ కూడా అవినీతిమయం అయ్యాయి. ఈ వ్యవస్థలో మార్పులు తెస్తాం. అవినీతి జరిగిన ప్రతి చోట రివర్స్‌ టెండరింగ్‌ పిలుస్తాం. ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎలా ప్రవహింపజేయాలో చేసి చూపిస్తాం. (ఈ సందర్భంగా టీడీపీ వారు పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తగా సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. గత అయిదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు చేసిందే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ చేస్తున్నారని తప్పుబట్టారు. వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. సభా నాయకుడు మాట్లాడేప్పుడు సంయమనం పాటించాలి. ఇది కూడా తెలుసుకోకపోతే ఎలా? అని సీఎం హితవు చెప్పారు.) సహకార రంగంలోని డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ.4 బోనస్‌ ఇస్తాం. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్‌ వ్యవస్థ ప్రతి రైతుకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. నీటి ఎద్దడి, కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీవ్రమైన కరువు చూశాం. గత ఏడాది (2018 –19) ఒక్క ఖరీఫ్‌లోనే కరువును ఎదుర్కొనేందుకు అక్షరాలా రూ.1,838 కోట్లు అవసరమని గత ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఈ మేరకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అవసరమని తేల్చింది. ఇందులో రూ.900 కోట్లు కేంద్రం నుంచి మనకు వచ్చింది. అయినా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదా సహాయం రూపంలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు.రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.8,750 కోట్లు సహాయం చేయబోతున్నాం. దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా సహాయం అందించబోతున్నాం. ఒకే విడతలో ఇంత మంది రైతులకు సహాయం చేయనుండటం దేశంలోనే రికార్డు అవుతుంది. ఈ సొమ్మును బ్యాంకులు ఇతర రుణాల కింద జమ చేసుకోకుండా నిబంధన కూడా తీసుకొస్తున్నాం. భూ యాజమాన్య హక్కులు పూర్తిగా కాపాడుతూ కౌలు రైతు చట్టంలో మార్పులు చేస్తాం. అభద్రతా భావం తొలగించేలా ఇదే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం. కరువు కాలంలో ఉపాధి కల్పనకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కోరాం. ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వారు కూడా ఎలాంటి మంచి సూచనలు, సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం.  

చంద్రబాబు నాడు – నేడు 
ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతులకు ఏమి చెప్పారో, ఎన్నికల తర్వాత రుణమాఫీ విషయంలో ఏమి చేశారనే విషయంపై ముఖ్యమంత్రి ఆధారాలతో సహా అసెంబ్లీలో చూపించారు. చంద్రబాబు నాడు – నేడు.. అంటూ రుణమాఫీపై మాట మార్చిన తీరును స్పీకర్‌ అనుమతితో టీవీ స్క్రీన్లపై ప్రదర్శిస్తూ వివరించారు. ‘వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం. రుణాల చెల్లింపు బాధ్యత నా భుజస్కంధాలపై వేసుకుంటా.. మీరు పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు..’ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు  ప్రసంగం వీడియో క్లిప్పులను చూపించారు. ‘మొన్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) మీటింగ్‌లో అధికారులు చెప్పిన అంశాలు చాలా బాధ కలిగించాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి (31–3–2014) ముందున్న బ్యాంకు రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు. అదే తేదీ నాటికి 184వ ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం వ్యవసాయ రుణాల మొత్తం రూ. 87,612 కోట్లు. ఇవన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. తర్వాత అధికారంలోకి రాగానే మాట మార్చి గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా వాటిని రకరకాల షరతులతో రూ.24 వేల కోట్లకు కుదించారు. ఇందులో కూడా చెల్లించింది కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే. రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీ సొమ్మును కూడా కట్టకుండా ఆ పథకాన్నే రద్దు చేసింది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నేడు రైతుల రుణాలు రూ.1,49,240 కోట్లకు ఎగబాకాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top