ఓటమికి సాకులు వెతకడంలో కులమీడియా జోరు

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓటమికి కుంటి సాకులు వెతకడంలో కులమీడియా జోరు ప్రదర్శిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు ఆయన అనుచరగణంపై వరుస ట్వీట్లతో విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ‘నలబై సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు యాంటెన్నాకు పోలింగ్ రోజే సిగ్నల్స్ అందాయి. అయినా 130,150 అని బడాయికి పోతున్నాడు. ఈవీఎంలపై దేశ వ్యాప్త ఉద్యమం బెడిసికొట్టిందో ఏమో? వైఎస్సార్ కాంగ్రెస్ హెలికాప్టర్లతో డబ్బులు వెదజల్లిందన్నట్టు కొత్త రాగం అందుకున్నాడు.’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు బతిమాలి మరీ ఆహ్వానాలు తెప్పించుకుంటున్నారని, టీడీపీ మాజీ రాజ్యసభ్యడొకరు డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ నాయకులతో ఫోన్లలో అదేపనిగా సంప్రదిస్తున్నారని తెలిపారు. గతంలో తమ అధినేత నిధులు సమకూర్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారని, ఇమేజి పెంచే కసరత్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘ఓటమికి కుంటి సాకులు వెతకడంలో తుప్పు కంటే కుల మీడియా జోరు ప్రదర్శిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ డబ్బు పంపిణీలో సక్సెస్ అయిందని చెత్త రాతలు మొదలు పెట్టింది. డబ్బు పంచలేక బాబు ఓడిపోతున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం. అసలు డబ్బులు వెదజెల్లే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే మీ జాతి రత్నం.’ కదా అని విజయసాయిరెడ్డి చురకలంటించారు.

చంద్రబాబు, ఆయన పార్టీ పెద్దల వ్యవహారం గుంటనక్కలు ఇకపై శాకాహారమే తింటామని శపథం చేసినట్టే ఉందని, ఎన్నికల వ్యవస్థను నాశనం పట్టించిన వ్యక్తులు ఓటర్లు తెలివిమీరారని దుయ్యబడుతున్నారని మండిపడుతున్నారు. మద్యం ఏరులై పారించింది మీరే కదా? అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి 2 వేల నోట్లు మాయం చేసింది ఎవరని నిలదీశారు. ఇక బంజారాహిల్స్ రోడ్ నెం.7 లో నివసించకుండానే అద్దె కింద నెలకు రూ.లక్ష ప్రజాధనాన్ని బొక్కిన కోడెల ఆడబ్బును తిరిగి చెల్లించాలని, గవర్నర్ జోక్యం చేసుకుని తక్షణం విచారణకు ఆదేశించాలి విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. స్పీకర్ పదవిని ఇంతగా దిగజార్చిన వ్యక్తి దేశంలో ఇంకెక్కడా కనిపించరన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top