ఏడడుగులు...ఎలక్షన్‌ వాచ్‌

The verdict Book Release on Lok Sabha Election - Sakshi

ఎన్నికల వేడి దేశవ్యాప్తంగా రాజుకుంటోంది. మళ్లీ కమలం వికసిస్తుందా?. హస్తం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా?. మూడో కూటమే చక్రం తిప్పుతుందా?.. ఇప్పడు అందరిలోనూ ఇదే ఆసక్తి. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ప్రణయ్‌రాయ్, దొరాబ్‌ ఆర్‌ సుపారివాలా సంయుక్తంగా రాసిన ది వెర్డిక్ట్‌ అనే పుస్తకం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ పుస్తకంలో 2019 ఎన్నికల్లో కొత్త పోకడలు ఎలా ఉన్నాయి? ఓటర్ల ప్రాథమ్యాలు ఎలా మారుతున్నాయి? అనే అంశాలను ద వర్డిక్ట్‌ పుస్తకంలో విశ్లేషించారు. ఆ బుక్‌లో ఏముందంటే..

యువ ఓటర్లు– వృద్ధ నేతలు
2019 ఎన్నికల్లో నేతలకీ, ఓటర్లకీ మధ్య వయసు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఓటర్లలో 18–40 ఏళ్ల మధ్య వయసున్న వారు 59 శాతం ఉంటే, ఎంపీలలో 25–40 ఏళ్ల మధ్య వయసు వారు 15 శాతం ఉన్నారు. అంటే 85 శాతం మంది నేతలకు, ఓటర్లకు మధ్య జనరేషన్‌ గ్యాప్‌ కనిపిస్తోంది. ఇది ఈసారి ఎన్నికల్లో నయా ట్రెండ్‌.

 ఫలితాల్లో ఉత్కంఠ
ఓట్ల లెక్కింపు రోజు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. క్షణక్షణానికి, రౌండ్‌ రౌండ్‌కి లీడ్స్‌లో వచ్చే మార్పులు అభ్యర్థులను, ప్రజలను కుర్చీ చివరకు చేరుస్తాయి. సాధారణంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొదటి గంట కౌంటింగ్‌లో లీడింగ్‌లో ఉన్న పార్టీయే గద్దెనెక్కే అవకాశాలెక్కువ. మొదట్లో లీడింగ్‌లో ఉన్న పార్టీ చివరికి వచ్చేసరికి అంతకంటే 40 నుంచి 45 సీట్లు ఎక్కువగా గెలుచుకునే అవకాశాలుంటాయి. ఇదే ఇంకో రకంగా చెప్పాలంటే వెనుకబడిన పార్టీలు చివరికి వచ్చేసరికి 40–45 సీట్లను కోల్పోవచ్చన్న మాట. ఈసారి ఎన్నికల్లోనూ ఇది కనిపించనుంది.  

ఫిఫ్టీ.. ఫిఫ్టీ చాన్స్‌
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపై ఓటర్లలో వ్యతిరేకత ఉంటుందని ఎక్కువ మంది విశ్వాసం. 1977–2002 మధ్య కాలంలో వివిధ రాష్టాల్లో 70 శాతం ప్రభుత్వాలకి ఓటర్ల అసంతృప్తి సెగ తాకి పాలకులు గద్దె దిగాల్సి వచ్చింది. కానీ గత 20 ఏళ్లలో ఓటర్లు పరిణతి చెందారు. సమర్థంగా పనిచేసే ప్రభుత్వానికి మరో చాన్స్‌ ఇవ్వడానికి సందేహించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేకత యుగం భారత్‌లో ముగిసినట్టే!. భారత్‌ నెమ్మది నెమ్మదిగా 50:50 యుగం వైపు వెళ్తోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకైనా ఫిఫ్టీ–ఫిఫ్టీ ఛాన్సెస్‌ ఉంటాయని ప్రణయ్‌రాయ్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

స్వతంత్రులేరీ?
ఈ మధ్య కాలంలో ఓటరు మనోగతంలో వచ్చిన మరో ప్రధాన మార్పు స్వతంత్ర అభ్యర్థుల్ని వారు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు 13 శాతం మంది ఓటర్లు స్వతంత్రులకు ఓటు వేసే పరిస్థితి ఉంటే ఇప్పుడు కేవలం 4శాతం మంది మాత్రమే ఓటు వేస్తున్నారు.

ప్రాంతీయ పార్టీల హవా
దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతోంది. తొలి తరం ఎన్నికల్లో 35 సీట్లకే మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఇప్పుడు ఏకంగా 162 సీట్లకి చేరింది. ప్రాంతీయ పార్టీ సీట్లే కాదు ఓట్ల శాతమూ గణనీయంగా పెరుగుతోంది. తొలినాళ్లలో 4 శాతం ఓట్లు సాధించిన ప్రాంతీయ పార్టీల ఓట్లు ప్రస్తుతం 34 శాతంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్ని కేవలం మోదీ వర్సస్‌ రాహుల్‌గా చూడలేని పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో అక్కడున్న బలమైన నేతల ప్రభావం కచ్చితంగా ఉండనుంది.

మహిళ చేతిలోనే తీర్పు!
మహిళల్లో ఓటరు చైతన్యం వెల్లివిరుస్తోం ది. కానీ వాళ్లు ఎవరికి ఓటేస్తారన్నది మిలియన్‌ డాలర్‌ ప్రశ్నే. సంప్రదాయంగా బీజేపీ వైపు పురుషుల కంటే మహిళలే మొగ్గు ఎక్కువ చూపిస్తూ వచ్చారు. ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ మోదీ ఇమేజ్‌ను పెంచింది. ఈసారి  దేశవ్యాప్తంగా ఓట్ల గల్లంతు కూడా కీలకాంశమే. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో దాదాపు 2.1 కోట్ల మంది మహిళల పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతయ్యాయి. అంటే ఒక్కో సెగ్మెంట్‌ నుంచి సగటున 39 వేల మంది మహిళా ఓటర్లు ఓటుహక్కును కోల్పోయారన్నమాట.

విపక్షాల ఐక్యతతో గెలిచినవెన్ని..
ఎన్నికల్లో విజయానికి అర్థాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు, కూటములు అంతగా లేవు. జనంలో ఆదరణ ఉన్న పార్టీనే అందలం ఎక్కించేవారు. 1952–2002 మధ్య గణాంకాలు పరిశీలిస్తే అధికార పార్టీకి రెండింట మూడో వంతు సీట్లు జనాదరణతో పడితే, మరో మూడింట ఒకటో వంతు ఓట్లు విపక్షాల్లో చీలికల వల్ల వచ్చేవి. జాతీయ పార్టీలను అడ్డుకోవడానికి ఇటీవల వివిధ పార్టీలు చేతులు కలుపుతున్నాయి. విపక్షల ఐక్యత కారణంగా లోక్‌సభలో వారి సీట్ల శాతం పెరుగుతోంది. గత మూడు ఎన్నికల ఫలితాల్ని పరిశీలిస్తే 45 శాతం సీట్లు విపక్షాల ఐక్యతతోనే పెరిగాయి. ఈసారీ పొత్తులే జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయబోతున్నాయి.
-ప్రణయ్‌రాయ్, ఎన్నికలవిశ్లేషకులు
-దొరాబ్‌ ఆర్‌ సుపారివాలా, ఎన్నికల విశ్లేషకులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top