కేసీఆర్‌కు మైనార్టీలు బుద్ధి చెప్పాలి  | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు మైనార్టీలు బుద్ధి చెప్పాలి 

Published Wed, Oct 10 2018 2:33 AM

Uttamkumar Reddy fires on KCR and Muslim reservation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బూటకపు మాటలు, అబద్ధపు హామీలు, మోసపు చేష్టలతో మైనార్టీలను దగా చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలోని ముస్లింలందరూ సత్తా చాటి కాంగ్రెస్‌కు ఘన విజయం సాధించి పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కు చెందిన టీఆర్‌ఎస్‌ మాజీనేత ఇబ్రహీం తన అను చరులతో కలసి మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉత్తమ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పి ఇబ్రహీంను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెద్దఎత్తున తరలివచ్చిన ఇబ్రహీం అనుచరులనుద్దేశించి ఉత్తమ్‌ మాట్లాడారు. కేసీఆర్‌ ముస్లింలను తీవ్రంగా మోసం చేశారని, అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తానని చెప్పి నాలుగేళ్లు అయినా పట్టించుకోలేదని ఆరోపించారు.

ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి చేతు లు దులుపుకున్న కేసీఆర్‌ ఆ తర్వాత కేంద్రం వద్ద బిల్లు పాస్‌ చేయించలేకపోయారని విమర్శించారు. ప్రధాని మోదీకి ప్రతి విషయంలో ఏజెంటుగా పనిచేస్తున్న కేసీఆర్‌ ముస్లింల రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు వచ్చిందే ముస్లింలను మరోసారి మోసం చేయడానికని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి వస్తే బీజేపీతో కలసి పనిచేసే అవకాశం రా దని భావించారని, అందుకే ఇప్పుడు ఒంటరిగా పోటీచేసి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలన్న ఆలోచనతో ఉన్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనన్న విషయాన్ని ముస్లిం సోదరులు గమనించాలని కోరారు. తెలంగా ణలో ముస్లింలకు భద్రతలేకుండా పోయిందన్నారు.

అమాయక ముస్లింలను ఎన్‌కౌంటర్‌ చేశారు.. 
తెలంగాణ వస్తే ఎన్‌కౌంటర్లు ఉండవని చెప్పిన కేసీఆర్‌ వికారుద్దీన్‌ కేసులో అమాయకులైన ఐదుగురు ముస్లిం యువకులను ఆలేరు వద్ద చేతులకు బేడీలు ఉండగానే బస్‌లో ఎన్‌కౌంటర్‌ చేసి క్రూరత్వాన్ని ప్రదర్శించారని ఉత్తమ్‌ ఆరోపించారు. ఆ ఎన్‌కౌంటర్‌పై వేసిన కమిషన్‌ నివేదికకు ఇప్పటివరకు అతీగతీ లేదన్నారు. మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చిందని, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలోని ముస్లింలు, ఇతర మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదని, జనాభాలో 15 శాతమున్న మైనార్టీలకు 0.1 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

ముస్లిం, మైనార్టీల సంక్షేమం కేవలం కాంగ్రెస్‌ హయాంలోనే సాధ్యమవుతుందని ఉత్తమ్‌ చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరూ అడగకుండానే 4 శాతం రిజర్వేషన్లను అమలు చేసి వేలాది మంది ముస్లిం యువతకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అన్ని రంగాల్లో ముస్లింలకు ప్రాధాన్యమిచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని ముస్లింలంతా కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో మండలిలో విపక్షనేత షబ్బీర్‌ అలీ, మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ మైనార్టీ సెల్‌ చైర్మన్‌ ఫక్రుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement