కమలదళంలో ఉత్సాహం | Telangana ZPTC MPTC BJP Leaders Happy | Sakshi
Sakshi News home page

కమలదళంలో ఉత్సాహం

May 6 2019 11:42 AM | Updated on May 6 2019 11:42 AM

Telangana ZPTC MPTC BJP Leaders Happy - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: కమల దళంలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న అభ్యర్థులను చూసి ఆ పార్టీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గత ప్రాదేశిక ఎన్నికల్లో ఈ పార్టీ నామమాత్రంగా బరిలో ఉండేది. తద్వారా పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేసేవారు. అయితే మారిన పరిస్థితుల్లో కాషాయం పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ముందుకురావడంతో ఆ పార్టీలో నూతనోత్తేజం కనిపిస్తోంది. అదే సమయంలో కొన్ని స్థానాల్లో పోటీ ఎక్కువ కావడంతో అభ్యర్థి ఎంపికలో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఆ పార్టీ నాయకత్వం ఎదుర్కొంటుందంటే పరిస్థితి ఏంటో అర్థమవుతోంది.
 
లోక్‌సభ ఎన్నికల తర్వాత..
గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. బోథ్‌ నియోజకవర్గంలో నామమాత్రం ప్రభావం చూపింది. అయితే లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రధానంగా ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా సోయం బాపురావు బరిలోకి దిగడంతో ఆదిలాబాద్, బోథ్‌తోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో బీజేపీకి గట్టి పట్టు దొరికినట్టయింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో సోయం బాపురావు జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించడంతో అన్నిచోట్ల కేడర్‌ ఏర్పడింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోయం బాపురావు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయనకు ముందు నుంచి అనుచరగణం ఉండడంతో లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే విధంగా నిలిచారు

అదే ధీమా..
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్‌ శాతం పెరిగిందన్న అంచనాలతో ఆ పార్టీ ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలో ప్రాదేశిక ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల్లో అన్నిచోట్ల బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్, బేల మండలాల్లో పార్టీ పరంగా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేలా  అభ్యర్థులను బరిలోకి దించారు. బోథ్‌ నియోజకవర్గంతోపాటు ఏజెన్సీ మండలాల్లో సోయం అనుచరగణం ప్రాదేశిక ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. తాంసి, భీంపూర్, గుడిహత్నూర్, బోథ్, నేరడిగొండలో జెడ్పీటీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. బజార్‌హత్నూర్‌లో ఏకంగా బీజేపీ నుంచి 14 మంది నామినేషన్లు వేయడంతో బీ–ఫాం విషయంలో పోటీ నెలకొంది. మూడో విడతలో ఎన్నికలు జరగనున్న నార్నూర్, గాదిగూడ, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిరికొండలో కూడా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

ఓటు ఎవరికో..
గత ప్రాదేశిక ఎన్నికల పరంగా పరిశీలిస్తే.. అప్పుడు జిల్లాలో 13 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 12 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. బేలలో కాంగ్రెస్‌ గెలుపొందింది. ఇక 13 ఎంపీపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌కు ప్రధానంగా కాంగ్రెస్‌తోనే పోటీ ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితిలో అన్ని మండలాల్లో త్రిముఖ పోరు కనిపిస్తోంది. అనూహ్యంగా బీజేపీ బలపడడంతో ఆ పార్టీ నాయకత్వంలో హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 18 మండలాలు ఉండగా, ఆదిలాబాద్‌అర్బన్‌ మండలం మినహాయించి 17 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇందులో పదమూడు పాత మండలాలు కాగా, నాలుగు మావల, భీంపూర్, సిరికొండ, గాదిగూడ కొత్త మండలాలు ఉన్నాయి. ఈ కొత్త మండలాల్లోనూ బీజేపీ బరిలోకి దిగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ బరిలో ఉండడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం మే 27న ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రెండు ఫలితాల్లో ఏదైనా అనూహ్యం చోటుచేసుకుంటే బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం నిండనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement