ఒక్కసారి అవకాశం ఇవ్వండి : లక్ష్మణ్‌

Telangana BJP President Laxman Press Meet  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశంలో ఇచ్చి చూడండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రజలను కోరారు. ఇప్పటికే అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని.. ఈ సారి తమకు అవకాశం ఇస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌ చేస్తామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురి కోసమే తెలంగాణ అన్నట్లుగా రాష్ట్రాన్ని మార్చేశారని ఎద్దేవా చేశారు. ఏప పక్ష పాలన, నియంతృత్వ పాలనపై ప్రజలు ఆలోచించాలని కోరారు.

తెలంగాణ సమాజం అంటే కేసీఆర్‌ ప్రభుత్వానికి చులకనయిందన్నారు. కేవలం బర్రెలు, గొర్రెలు ఇస్తూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. సీట్ల పంపిణీలో సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టోని విడుదల చేస్తామని తెలిపారు. తమ మేనిఫెస్టోని కేవలం ఎన్నికల కోసమే కాకుండా 20 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తుకు విజనల్‌ డాక్యుమెంటరీలా తయారు చేశామన్నారు. టీఆర్‌ఎస్‌ తో బీజేపీ లోపాయికారీ ఒప్పందం అనేది ఒక మైండ్‌గేమ్‌ అన్నారు. ప్రభుత్వాన్ని నిర్భయంగా ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. లాలూచీ పడాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. దమ్ముంటే ఎంఐఎం అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.

మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌ తెలంగాణను అమరావతికి తాకట్టు పెట్టాలని చూస్తోందన్నారు. అనేక కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యామని.. ​అదే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు లేని త్రిపుర, మణిపూర్‌, అస్సాం రాష్ట్రాలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. అలాంటిది తెలంగాణలో సాధ్యం కాదని తాము అనుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం​ ఏర్పాటుకు అవసరమయ్యే స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top