
సాక్షి, గన్నవరం : నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు అబద్ధాలతో మోసపోయిన ప్రజానీకం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నేతలు సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకటరావు అన్నారు. గురువారం పార్టీ నేతలు సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకటరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ప్రజాసంకల్పయాత్రకు కృష్ణాజిల్లాలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని వారు వ్యాఖ్యానించారు. జననేత రాక కోసం గ్రామాల్లోని రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు, అంగన్‌వాడీ ఉద్యోగులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని అన్నారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన పదిరోజుల్లోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ చెప్పడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే టీడీపీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత తెలుస్తోందని అన్నారు.