నయా 'రాజ'రికం  | Royal family Mark Clearly visible in Rajasthan Politics | Sakshi
Sakshi News home page

నయా 'రాజ'రికం 

Nov 17 2018 2:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

Royal family Mark Clearly visible in Rajasthan Politics - Sakshi

రాచరికం అంతమైపోయినా, రాజ్యాలు మాయమైనా.. వాళ్ల రక్తంలో మిళితమైన అధికార ఆరాటం తగ్గలేదు. మారిన సామాజిక పరిస్థితుల్లో నాటి రాజ్యాధికారానికి సమానమైన వేదిక రాజకీయమేనని వాళ్లకు అర్ధమైంది. ఇదే రాజకుటుంబాలను పాలిటిక్స్‌వైపు నడిపించింది. 

రాజుల గడ్డ రాజస్తాన్‌లో అధికార పీఠంపై రాజ కుటుంబీకుల ముద్ర స్పష్టంగా కనబడుతోంది. వీరు అధికారంలో ఉండటమో.. లేక వీరి మనుషులు ప్రభుత్వాలను శాసించడమో పరిపాటిగా మారింది. రాజా హనుమంత్‌ సింగ్, రాణీ గాయత్రీ దేవి మొదలుకుని నేటి వసుంధరా రాజే వరకు రాజకుటుంబాలకు రాజకీయాలపై ఆసక్తి చాలా ఉంది. దాదాపు అన్ని రాజ కుటుంబాలు స్వాంతంత్య్రానంతరం తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఒక దశలో ఎంఎల్‌ఏ, ఎంపీ సీట్ల వరకు పరిమితమైన రాజకుటుంబీకులు క్రమంగా రాష్ట్రం మొత్తం ప్రాభవాన్ని విస్తరించుకొని చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా చేజిక్కించుకున్నారు. అయితే దీన్నుంచి ఒక్క రాజ కుటంబానికి మినహాయింపు ఇవ్వాల్సిందే. రాజస్తాన్‌లోని ‘టాంక్‌’రాజవంశీయులు ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. 

భారీ వరాలతో విలీనం 
స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో 500కు పైగా చిన్నా చితకా సంస్థానాలుండేవి. పటేల్‌ వ్యూహంతో ఇవన్నీ ఇండియన్‌ యూనియన్‌లో కలిసిపోయాయి. అయితే ఈ విలీనాలకు అంగీకరించేందుకు రాజకుటుంబాలకు భారీ వరాలు ఇవ్వాల్సివచ్చింది. తర్వాత కాలంలో ఇందిరాగాంధీ ఈ రాజభరణాలను రద్దు చేసింది. అప్పటికే రాజకుటుంబాలకు ప్రాముఖ్యత మెల్లిగా తగ్గుతూ వస్తోంది. అయితే.. తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు రాజకీయాలే సరైన మార్గమని నాటి మహారాజులు భావించారు. దీంతో ప్రజాజీవితాలతో సంబంధం లేని పలు రాజకుటుంబాలు.. తమ వంశం పేరు ఆధారంగా రాజకీయ నాయకులుగా మారిపోయారు. రాజస్తాన్‌లో ఈ తరహా మార్పు ఎక్కువగా కనిపించింది. 1950–70 దశకాల్లో రాజ కుటుంబీకులు ఎక్కువమంది  రాజకీయాల్లోకి ప్రవేశించారు.

చక్రం తిప్పిన విజయ, వసుంధర 
రాజస్తాన్‌ రాజకీయాల్లోకి రాజకుటుంబీకుల రాక ఆకస్మికంగా జరగలేదు. తగ్గుతున్న ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నమే వారిని రాజకీయాలవైపు నడిపించింది. వీరంతా మొదట్లో స్వతంత్ర సభ్యులుగానే పోటీ చేశారు. దీంతో వీరికి గెలిచిన ప్రాంతాలపై మాత్రమే వీరికి పట్టుండేది. ఈ సమయంలో జోధ్‌పూర్‌కు చెందిన రాజా హనుమంత్‌ సింగ్‌ రాజస్తాన్‌లోని మాజీ మహారాజులు అందరినీ ఏకం చేసి ‘రామరాజ్య పరిషత్‌’అనే ఓ గ్రూపును ఏర్పాటుచేశారు. అయితే 1952లో ఆయన అనూహ్య మరణంతో ఈ సమాఖ్య చెల్లాచెదురైంది. తర్వాత కాలంలో బికనేర్‌ మహారాజా కర్నిసింగ్‌ ఈ నియోజకవర్గంలో వరుసగా ఐదు సార్లు గెలిచారు. ఆ తర్వాత మహారాణి గాయిత్రీ దేవి స్వతంత్రపార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యానికి ఎదురు నిలిచారు.  తొలిసారి ఎంపీగా ఎన్నికై అందరినీ ఆకర్శించారు.  గ్వాలియర్‌ మహారాణి విజయరాజే సింధియా, ధోలపూర్‌ రాణి వసుంధర రాజే రాజకీయాల్లో ఎదిగారు. వసుంధర రాజే రాజ కుటుంబం నుంచి తొలి సీఎంగా నిలిచారు. 

మైభీ రాజా హూ! 
రాజస్తాన్‌లో సంస్థానాలు, రాజకుటుంబాలు ఎక్కువ. ఈ కుటుంబాల్లోని ప్రముఖులు క్రమంగా ఆయా పార్టీల తరుఫున తమకు పట్టున్న ప్రాంతాల్లో పోటీ చేశారు. పేదల గుడిసెల్లో రొట్టెలు చేయడం, రోడ్లు శుభ్రపరచడం వంటి పనులతో ప్రజలతో బంధం ఏర్పరుచుకున్నారు. దీంతో కాస్త పేరున్న వారు కూడా తామూ రాజకుటుంబీకులమని చెప్పుకున్నారు. ఈ విపరీత ధోరణులను నిరసిస్తూ 1962 ఎన్నికల్లో రామ్‌ మనోహర్‌ లోహియా ఒక రాజ ప్రముఖుడికి వ్యతిరేకంగా పేద దళిత మహిళను నిలబెట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నేతలు ఎక్కువగా తమను తాము రాజకుటంబీకులుగా చెప్పుకుంటుంటారు.  

‘టోంక్‌’ల రూటే సెపరేటు!
రాజకీయాలకు ఈ నవాబులు దూరం
రాజస్తాన్‌ రాజవంశీకులందరూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటే.. టోంక్‌ సంస్థానం మాత్రం ఈ వాసనకు దూరంగా ఉంది. టోంక్‌ స్టేట్‌ ఖాందాన్‌ నిబంధనలు–1944 కింద ఈ వంశానికి చెందిన దాదాపు 615 మంది నెలకు వెయ్యిరూపాయల పింఛను అందుకుంటున్నారు. జైపూర్, అల్వార్, భరత్‌పూర్, జోధ్‌పూర్, బికనీర్, జైసల్మేర్, పాలి తదితర సంస్థానాధీశులంతా నేతలవుతున్నా టోంక్‌ నవాబులు మాత్రం ఆసక్తి చూపలేదు. 19వ శతాబ్దిలో ఈ రాజవంశం బలమైన మిలటరీ శక్తిగా పేరొందింది. బ్రిటీషర్లకు, అఫ్గాన్లకు కుదిరిన ఒప్పందం కింద 1808లో టోంక్‌ సంస్థానం ఆవిర్భవించింది. అయితే ఇందిర అధికారంలోకి వచ్చి రాజభరణాల రద్దు, లాండ్‌ సీలింగ్‌ తెచ్చాక పరిస్థితులు మారిపోయాయి. నవాబు వంశ మూల ఆర్థిక వనరులపై ఈ రెండు అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ మార్పు తర్వాత ప్రధాన పార్టీల తరఫు అభ్యర్ధులకు మద్దతు ఇవ్వడానికే నవాబులు పరిమితం అయ్యారు. బైరాన్‌సింగ్‌ షెకావత్‌కు వీరి మద్దతు ఉండేది. ప్రస్తుత నవాబు ఢిల్లీలో నివసిస్తుండగా, కుటుంబంలోని వారంతా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement