‘మినీ భారత్‌’మహాన్‌   

Non Telugu states electoral votes are crucial in this election - Sakshi

తెలుగేతర రాష్ట్రాల వారి ఓట్లే ఈ ఎన్నికల్లో కీలకం

‘గ్రేటర్‌’లోని నాలుగు నియోజకవర్గాల్లో గెలుపోటముల నిర్ణేతలు వారే

నగరంలో పెద్దసంఖ్యలో రాజస్తాన్, గుజరాత్, ఎంపీ, యూపీ ఇతర దక్షిణాది రాష్ట్రాల వాసులు

భిన్న సంస్కృతులు, భాషలు, మతాలకు నిలయమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగేతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు (సెటిలర్స్‌)కీలక భూమిక పోషించనున్నారు. ఐటీ, బీపీఓ, కేపీఓ, నిర్మాణరంగంతోపాటు హార్డ్‌వేర్, ఫార్మా, బల్క్‌డ్రగ్స్, మాన్యుఫాక్చరింగ్‌ రంగాలకు హబ్‌గా మారిన గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో తెలుగేతర భాషలు మాట్లాడే వారి ఓట్లే అభ్యర్థుల గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా దశాబ్దాల క్రితమే నగరానికి వచ్చి స్థిరపడిన వీరంతా ఇక్కడి వ్యాపార, వాణిజ్య, సేవా రంగాలతో పాటు రాజకీయ, సామాజిక రంగాల్లోనూ తమదైన పాత్రపోషిస్తున్నారు.

ప్రస్తుతం ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందిన సెటిలర్స్‌ ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా కర్ణాటక, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌కు చెందినవారు నగరంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. గోషామహల్, అంబర్‌పేట, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో తెలుగేతర భాషలు మాట్లాడే సెటిలర్స్‌ జనాభా, ఓట్లు అధికంగా ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో మొత్తం ఓటర్లు 76 లక్షల మంది కాగా.. ఇందులో సెటిలర్స్‌ ఓట్లు 13 శాతం.. అంటే పది లక్షల మేర ఉన్నట్లు అంచనా. వీరిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

గోషామహల్‌: ‘ఉత్తరాది’ హల్‌చల్‌
నగరంలో వ్యాపార, వాణిజ్యాలకు ప్రసిద్ధి చెందిన బేగంబజార్, సుల్తాన్‌బజార్, గోషామహల్‌ ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోనివే. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల వారు ఇక్కడ పెద్దసంఖ్యలో స్థిరపడ్డారు. ఇక ధూల్‌పేట్, మంగళ్‌హాట్, గన్‌ఫౌండ్రీ, గౌలిగూడ ప్రాంతాల్లో పంజాబీలు, కన్నడిగులు, మహారాష్ట్రీయులు అత్యధికంగా నివసిస్తున్నారు. నియోజకవర్గంలో 2.29 లక్షల ఓట్లుండగా.. 30 వేల మంది ఇతర రాష్ట్రాల మూలాలున్న వారే. నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఈ నియోజకవర్గం ఏర్పడింది.

2009 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. 2009లో కాంగ్రెస్‌ నుంచి ముఖేశ్‌గౌడ్‌ గెలవగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ నేత రాజాసింగ్‌ లోథ్‌ ఎన్నికయ్యారు. రాజాసింగ్‌ లోథ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ మూలాలున్న వ్యక్తి. ఆ ఎన్నికల్లో ఆయనతో తలపడిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధూత్‌ కొన్నేళ్ల కిందట మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందినవారే. స్వతంత్రుడిగా బరిలో దిగిన మరో అభ్యర్థి నందకిశోర్‌ వ్యాస్‌ కూడా రాజస్తాన్‌ నుంచి సుదీర్ఘకాలం కిందట వచ్చి స్థిరపడిన వారే. నియోజకవర్గాల పునర్విభజనకు ముందున్న మహరాజ్‌గంజ్‌ నియోజకవర్గం కూడా రాష్ట్రేతరులను ఆదరించింది. రాజస్థాన్‌ నుంచి వచ్చి స్థిరపడిన ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ 1999లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి గెలుపొందారు.

అంబర్‌పేట: అందరి కోట
అంబర్‌పేట నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అంతకుముందు ఉన్న హిమాయత్‌నగర్‌ నియోజకవర్గంలోని అత్యధిక ప్రాంతాలు దీని పరిధిలోకి వచ్చాయి. నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి, బర్కత్‌పుర, నింబోలీ అడ్డా, మోతీ మార్కెట్, నల్లకుంట, కాచిగూడ, పుత్లిగూడ, విద్యానగర్‌ ప్రాంతాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల వారున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2.35 లక్షల మంది కాగా, ఇందులో సెటిలర్స్‌ ఓట్లు 20 వేల వరకు ఉన్నాయి. 1978 నుంచి 2004 వరకు హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కానీ, 2004, 2014ల్లో అంబర్‌పేట నుంచి కానీ రాష్ట్రేతరులెవరూ ఎన్నిక కాలేదు. కానీ ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో మాత్రం వీరి ఓట్లున్నాయి.  

కంటోన్మెంట్‌: ‘దక్షిణాది’ ఎఫెక్ట్‌
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ సైనిక స్థావరాలు ఏర్పాటైన ప్రాంతమిది. దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఈ నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్నా.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ జనాభా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. వీరితో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలవారూ ఉన్నారు. తిరుమలగిరి, లాల్‌బజార్, కార్ఖానా, బొల్లారం, బోయినపల్లి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినవారున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తంగా 2.35 లక్షల మంది ఓటర్లుండగా, 30 వేల మంది వరకు సెటిలర్స్‌ ఉన్నారు. 
మల్కాజ్‌గిరి: తమిళనాడు ప్రాబల్యం

మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో 4 లక్షల మంది ఓటర్లుండగా.. నేరేడ్‌మెట్, యాప్రాల్, అల్వాల్‌ ప్రాంతాల్లో తమిళనాడుకి చెందిన వారి ప్రాబల్యం ఎక్కువ. వీరి ఓట్లు 20 వేల వరకు ఉన్నట్లు అంచనా. గతేడాది ఈ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతల కనకారెడ్డి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలోనూ విజేతను నిర్ణయించడంలో సెటిలర్స్‌ ఓట్లే కీలకం కానున్నాయి.
-ఏసిరెడ్డి రంగారెడ్డి

పోలింగ్‌ సరంజామా
సాధారణంగా పోలింగ్‌ కేంద్రానికి ఓటు వెయ్యడానికి వెళ్లినపుడు ఈవీఎం, సిరా.. మరికొంత సామగ్రి మాత్రమే మనకు కనిపిస్తాయి. కానీ, పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణలో అవసరమైన సామగ్రి.. మనకు కనిపించనిది, తెలియనిదీ చాలా ఉంటుంది. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఏయే రకాల సామగ్రి ఎంతెంత ఉండాలో, ఏ పరిమాణంలో ఎంత మేరకు ఉండాలో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఓటరు స్లిప్, ఓటురు కార్డు, బ్యాలెట్, ఈవీఎం.. ఇవి అందరికీ తెలిసున్నవే. ఇవికాక.. ఓటరు జాబితా, వర్కింగ్‌ కాపీస్‌ ఆఫ్‌ ఎలక్టోరల్‌ రోల్స్, సర్వీస్‌ ఓటర్ల సీఎస్‌వీ జాబితా, టెండర్‌ ఓట్ల కోసం 20 బ్యాలెట్‌ పేపర్లు, రెండు ఇండెలిబుల్‌ ఇంక్‌ బాటిల్స్, ఐదు సీయూ, అడ్రస్‌ ట్యాగులు, నాలుగు బీయూ అడ్రస్‌ ట్యాగులు,  మూడు స్పెషల్‌ ట్యాగులు, ఈవీఎం కోసం నాలుగు గ్రీన్‌ సీల్స్, ఔటర్‌ పేపర్‌ కోసం మూడు సీల్స్, రబ్బర్‌ స్టాంపు, క్రాస్‌ మార్క్‌ స్టాంప్, ఒకటి వంకాయ రంగు స్టాంపు ప్యాడ్, ప్రిసైడింగ్‌ అధికారి వాడటానికి మెటల్‌ సీల్, ప్రిసైడింగ్‌ అధికారి డైరీ, మార్కు రబ్బరు స్టాంపు, పోలింగ్‌ సామగ్రి పెట్టడానికి స్టాట్యుటరీ, నాన్‌ స్టాట్యుటరీ కవర్లు.. ఇవన్నీ ఉండాలి. పోలింగ్‌ జరగడానికి ముందే.. ఆ పోలింగ్‌ కేంద్రానికి కేటాయించిన ఎన్నికల సిబ్బంది పైన పేర్కొన్న సామగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. 

అమ్మో.. నామినేషన్‌!
ఆదిలాబాద్‌ డెస్క్‌: ఎన్నికల సమయంలో సమస్యలను ఎలుగెత్తడానికి కొందరు వినూత్న మార్గాన్ని ఎంచుకుంటారు. అత్యధిక మంది పోటీకి నిలవడం ద్వారా ప్రధాన పార్టీల అభ్యర్థులను హడలెత్తి్తస్తుంటారు. 1996 ఎన్నికల్లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌.. ప్రస్తుత తెలంగాణలోని నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ల వర్షం కురిసింది. ఆ లోక్‌సభ ఎన్నికల్లో 480 మంది నామినేషన్లు వేసి పోటీకి నిలిచారు. ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి వీరంతా పోటీకి దిగారు. వీరిలో 477 మంది డిపాజిట్‌ కోల్పోయారు. రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికల సంఘాన్ని ఆలోచింపజేసింది.

వీరందరి కోసం ప్రత్యేక బ్యాలెట్‌ రూపొందించడానికి నాడు నానా తంటాలు పడాల్సి వచ్చింది. తరువాత కాలంలో ‘అత్యధిక నామినేషన్ల’ పర్వాన్ని నిలువరించేందుకు పలు చర్యలు తీసుకుంది. 1996 ఎన్నికల తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్‌ను అమాంతం పెంచేసింది. 1996 ఎన్నికలకు ముందు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు రూ.500 డిపాజిట్, అసెంబ్లీ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పార్లమెంటుకు పోటీ చేస్తే రూ.250, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రూ.125 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉండేది. 1996 ఎన్నికల తర్వాత.. పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులకు రూ.25,000, ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500, అసెంబ్లీకి పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులకు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.5,000 చొప్పున డిపాజిట్‌ మొత్తాన్ని పెంచింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top