ముకుల్‌ రాయ్‌తో మోదీకి ఒరిగేదేమిటీ?

mukul rai to join bjP

సాక్షి, కోల్‌కతా : దుర్గా మాతా ఉత్సవాలు శనివారం నాడు ముగియగానే తాను తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ముకుల్‌ రాయ్‌ ప్రకటించగానే ఆయనపై పార్టీ అధిష్టానం చర్య తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆయన్ని ఆరేళ్ల పాటు బహిష్కరించింది. ఇవన్నీ కూడా ముందుగానే ఊహించిన పరిణామాలే. గత కొంతకాలంగా బీజేపీ అధినాయత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్న ముకుల్‌ రాయ్‌ త్వరలోనే ఆ పార్టీలో చేరుతారన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. 

శారదా చిట్‌ఫండ్‌ కంపెనీ స్కామ్‌లో ఇరుక్కుని సీబీఐ చేతిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముకుల్‌ రాయ్‌కి గాలంవేస్తే ఇట్టే పడిపోతారన్న విషయాన్ని గ్రహించిన బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ వస్తోంది. బెంగాల్‌ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలను మోసం చేసిన చిట్‌ఫండ్‌ కేసులో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ముకుల్‌ రాయ్, అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు బీజేపీ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీ వెన్నంటి ఉన్న ఆయన ఎప్పటికప్పుడు తణమూల్‌ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని బీజేపీకి చేరవేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే తాను రాజ్యసభకు రాజీనామా చేయబోతున్నానని ప్రకటించారు. ఎలాగు ఆయన బీజేపీలో చేరేందుకే పార్టీ వీడుతున్నారన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన తణమూల్‌ ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయన నిర్వహిస్తున్న పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఈ నెల 20వ తేదీనే తెలివిగా రద్దు చేసింది. 

1998లో తణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ముకుల్‌ రాయ్‌ మమతా బెనర్జీతోనే ఉన్నారు. 2007లో సింగూరు, నందిగ్రామ్‌ పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం రైతుల భూములను స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా పార్టీ ఆందోళనను నడిపించడంలో మమతతోపాటు ముందున్నారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల వామపక్షాల ప్రభుత్వాన్ని కూలదోయడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బలంగా వీచిన పవనాలను అడ్డుకొని 42 సీట్లకుగాను 34 పార్లమెంట్‌ సీట్లను పార్టీ కైవసం చేసుకోవడంలో కీలక భూమికను పోషించారు. 2006లో ఎగువ సభకు ఎన్నికైన ఆయన మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో షిప్పింగ్, రైల్వే శాఖల్లో సహాయ మంత్రిగా పనిచేశారు. 2016లో జరిగిన ఎన్నికల్లో కూడా ముకుల్‌ రాయ్‌ పార్టీ విజయానికి తీవ్రంగా కషి చేశారు. అదే ఎన్నికల్లో మున్నెన్నడు లేనివిధంగా బీజేపీకి కూడా 10.2 శాతం ఓట్లు రావడంతో ఆ పార్టీకి కూడా కొత్త ఆశలు చిగురించాయి. ముకుల్‌ రాయ్‌ లాంటి నాయకులను పార్టీలోకి లాక్కుంటే పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని భావించిన బీజేపీ అందుకు అనుగుణంగా పార్టీలోకి తణమూల్‌ నేతలకు ఆహ్వానం పలికింది. అయితే ఎవరూ ముందుకు రాలేదు. కేసులో ఇరుక్కోవడం వల్ల ముకుల్‌ రాయ్‌ ముందుకు వచ్చారు. 

మమత వెన్నంటి ఉండి పార్టీని విజయపథాన నడిపించడంలో ఎంత కీలక పాత్ర వహించినప్పటికీ ప్రజల్లో మమతా బెనర్జీకున్న పలుకుబడి ముకుల్‌ రాయ్‌కు లేదు. పైగా ఆయన మాస్‌ లీడర్‌ కారు. పైగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ముకుల్‌ రాయ్‌ బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండదు. బీజేపీ ఇలాంటి నేతలపై ఆధారపడడం కన్నా పార్టీని పునాదుల స్థాయి నుంచి బలోపేతం చేయడం పట్ల దష్టిని కేంద్రీకరించడం మంచిది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top