కమలానిదే కర్ణాటక

Kerala and Tamil Nadu refuse to be swept up by Modi wave - Sakshi

తమిళనాడు, కేరళలో కనిపించని మోదీ మ్యాజిక్‌

యావత్‌ భారతం హర హర మోదీ నినాదంతో ఊగిపోతే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, కొంతవరకు తెలంగాణలో మినహా ఇంకెక్కడా మోదీ మ్యాజిక్‌ కనిపించలేదు. దక్షిణ కోటలో పాగా వేయడానికి కోటగుమ్మంగా భావించే కన్నడనాట మాత్రం కాషాయ జెండా రెపరెపలాడింది. ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ... సంవత్సరం తిరిగేసరికల్లా పడిలేచిన కడలితరంగంలా ఉవ్వెత్తున ఎగసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది.

ఏపీలో అతడే ఒక సైన్యంలా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి దూసుకుపోతే తెలంగాణలో కారు జోరుకి కమలదళం కొంత వరకూ బ్రేకులు వేసింది. ఎవరి అంచనాలకూ అందని విధంగా బీజేపీ నాలుగు సీట్లను కొల్లగొట్టడంతో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత బీజేపీ క్షేత్రస్థాయిలో చొచ్చుకుపోవడానికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వ్యక్తంచేస్తున్నారు. ఇక తమిళనాడులో డీఎంకే , కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ తమ సత్తాని చాటి రాష్ట్రాలను క్లీన్‌స్వీప్‌ చేశాయి. అండమాన్‌ నికోబర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కులదీప్‌ శర్మ, సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి విశాల్‌ జాలీపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


 కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌–జేడీ(ఎస్‌) అధికారంలోకి వచ్చి ఏడాదయింది. ఇంతలోనే ఫలితాలు తారుమారయ్యాయి. గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కానీ ఏడాదిలోనే ఆ పార్టీ తిరిగి రాష్ట్రంపై పట్టు బిగించింది. రాష్ట్రాన్ని క్లీన్‌ స్వీప్‌ చేసింది. కాంగ్రెస్, జేడీ(ఎస్‌) దిగ్గజ నేతలు  కమలం ధాటికి కుదేలయ్యారు. కాంగ్రెస్‌–జేడీ(ఎస్‌) కూటమిలో లుకలుకలు ఒక్కొక్కటీ బయటపడి కుమారస్వామి తన పరిస్థితి గరళం మింగిన శివుడిలా మారిందంటూ కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశమయింది. కూటమి ఎమ్మెల్యేలపై బీజేపీ ఆపరేషన్‌ కమలను ప్రయోగిస్తుందన్న ప్రచారంతో కాంగ్రెస్‌–జేడీ(ఎస్‌) కూటమి బలహీనపడసాగింది.

వారి బలహీనతే బీజేపీకి బలంగా మారింది. 22 ఎంపీ స్థానాలను గెలిస్తే, కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వమే మారిపోతుందని ఇటీవల బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు బీజేపీ భారీ విజయంతో కాంగ్రెస్‌–జేడీ(ఎస్‌) సర్కార్‌ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కమలం ధాటికి కాంగ్రెస్, జేడీ (ఎస్‌) దిగ్గజ నేతలు ఓటమి పాలయ్యారు. తుమకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ప్రధానమంత్రి, జేడీ(ఎస్‌) వ్యవస్థాపక అ«ధ్యక్షుడు  హెచ్‌డీ దేవెగౌడ ఓటమి పాలయ్యారు.  బీజేపీ అ«భ్యర్థి బసవరాజ్‌ చేతిలో ఓడిపోయారు. ఇప్పటివరకు దేవెగౌడ ప్రాతినిధ్యం వహించిన హసన్‌ నుంచి ఆయన మనవడు ప్రజ్వల రేవణ్ణ మాత్రమే విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్‌ అభ్యర్థి వీరప్పమొయిలీ చిక్‌బళ్లాపూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి బచ్చే గౌడ చేతిలో ఓడిపోతే, మరో కేంద్ర మాజీ మంత్రి మల్లిఖార్జున్‌ ఖర్గే గుల్బర్గా నియోజకవర్గం నుంచి పోటీకి దిగి బీజేపీ అభ్యర్థి ఉమేశ్‌ యాదవ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.  

ప్రకాశించని రాజ్‌.. సుమలత రికార్డు
బీజేపీ పాలనను ఎండగొడుతూ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ చేసిన ప్రచారం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. బెంగళూరు సెంట్రల్‌నుంచి పోటీ చేసిన ప్రకాశ్‌ రాజ్‌ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ప్రముఖ నటి, దివంగత నటుడు అంబరీష్‌ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. మండ్య నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ సుమలత ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ సీటు జేడీ(ఎస్‌)కి వెళ్లిపోయింది. అక్కడి నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్‌ గౌడను దింపారు. దీంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకుండా సుమలతకు మద్దతు పలికింది. చివరికి సెంటిమెంటే గెలిచింది. కర్ణాటకలో 52 ఏళ్ల తర్వాత ఒక మహిళా అభ్యర్థి పార్లమెంటులోకి అడుగుపెడుతోంది.  

తమిళనాడులో స్టాలిన్‌ సత్తా
తమిళనాడులో మొత్తం 39 నియోజకవర్గాలకు గాను 38 నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరిగాయి. వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో «నోట్ల కట్టలు భారీగా పట్టుబడడంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ను వాయిదా వేసింది. ద్రవిడ రాజకీయాల్లో చరిత్ర సృష్టించి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు అగ్ర నేతలు కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన తొలి ఎన్నికలివి. మొదట్నుంచి ఉత్తరాది ప్రభావాన్ని అంగీకరించకుండా జాతీయ పార్టీలను దూరంగా ఉంచే తమిళ తంబీలు ఈసారి కూడా అదే బాటలో నడిచారు.

కరుణానిధి వారసుడు స్టాలిన్‌కే పట్టం కట్టారు. సంక్షోభంలో కూరుకుపోయిన తమిళ రైతులు ఢిల్లీ వీధుల్లో రోజుల తరబడి ఆందోళనలు చేసినా ఎన్డీయే సర్కార్‌ కరుణించకపోవడం, నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం, కరువు కోరల్లో చిక్కుకున్న పలు ప్రాంతాలు వంటివి కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేపైనా ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకత డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి విజయానికి బాటలు వేసింది. గత ఎన్నికల్లో ఒక్క కన్యాకుమారిలో మాత్రం గెలిచిన బీజేపీ... ఈసారి ఒక్కస్థానంలోనూ నెగ్గలేక చతికిలపడింది. తండ్రి ఉన్నన్నాళ్లూ ఆయన నీడలా ఉన్న స్టాలిన్‌ ఈ ఎన్నికల్లో కరుణానిధికి అసలు సిసలు వారసుడిగా ఎదిగి తన సత్తా చాటారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన డీఎంకేను ఈ సారి ఎన్నికల్లో పరుగులు పెట్టించారు.   

తమిళనాడులో డీఎంకే జయకేతనం
తమిళనాడులో డీఎంకే జయకేతనం ఎగరవేసింది. లోక్‌సభ, ఉప ఎన్నికల్లోనూ డీఎంకే తన ఆధిక్యాన్ని చాటు కుని అన్నాడీఎంకేను కంగుతినిపిం చింది. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు 38 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వేలూరు లోక్‌సభ స్థానంలో ఈసీ ఎన్నికలను రద్దు చేసింది. మొత్తం 38 లోక్‌సభ స్థానాల్లో 37 సీట్లు, 22 ఉప ఎన్నికల్లో 13 స్థానాలను డీఎంకే సొంతం చేసుకుంది.  అన్నాడీఎంకే 2 లోక్‌సభ స్థానాల్లో, 9 ఉప ఎన్నికల స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ముందంజలో ఉంది.

అమ్మలేని లోటు
జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేకి అమ్మలేని లోటు స్పష్టంగా తెలిసింది. జయలలిత మేనల్లుడు దినకరన్‌ పార్టీని చీల్చడం, అక్రమాస్తుల కేసులో జయలలిత నెచ్చెలి శశికళ జైలుకి వెళ్లడం, పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాలు విభేదించి మళ్లీ చేతులు కలపడం, జయలలితకు తగిన వారసులెవరూ లేకపోవడం వంటి పరిణామాలు పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీశాయి. గత ఎన్నికల్లో జయలలిత ఆధ్వర్యంలో అన్నాడీఎంకే ఒంటరిగా బరిలో దిగి 39 స్థానాలకు గాను 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ముందు ప్రధాని నరేంద్ర మోదీ హవా పనిచేయలేదు. ఈసారి ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే  చేతులు కలిపి మెగా కూటమిని ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.

జయలలిత మృతి చెందాక రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఎన్నో ప్రజాందోళనలు చెలరేగాయి. రైతు సంక్షోభం, నీట్‌ పరీక్షలు, స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని తొలగించాలన్న ఆందోళనలు, 8 రహదారుల సలేం హైవే, అమ్మాయిల అశ్లీల వీడియోల పొల్లాచి సెక్స్‌ స్కాండల్‌లో అన్నాడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తల పాత్రపై ఆరోపణలు వంటివన్నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న  అన్నాడీఎంకే పార్టీపై తీవ్ర వ్యతిరేక ప్రభావాన్నే చూపించాయి.  డీఎంకే పార్టీతో జత కట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఈ విజయం కాస్త ఊపిరినిచ్చిందనే చెప్పాలి. శివగంగ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, తూతుకూడి నుంచి స్టాలిన్‌ సోదరి కనిమొళి విజయం సాధించారు.  

కేరళలో కాంగ్రెస్‌ కూటమి క్లీన్‌ స్వీప్‌  
వామపక్షాల పట్టున్న ఏకైక రాష్ట్రం కేరళలో శబరిమల ఆలయ వివాదమే ఈ సారి ఎన్నికల్ని నడిపించింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతినివ్వడంతో జరిగిన రగడ అ«ధికార లెఫ్ట్‌ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ సారి ఎన్నికల్లో దాని ప్రభావం గట్టిగానే కనిపించింది. అదే సమయంలో బీజేపీ కూడా ఈ ఆలయ వివాదంతో ఏ మాత్రం లాభపడలేదు. కేరళలో ఖాతా తెరవాలన్న ఆ  పార్టీ ఆశలపై కాంగ్రెస్‌ నీళ్లు పోసింది. శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొని, ఆలయ సంప్రదాయాలను కాపాడతామంటూ బీజేపీతో పాటు కాంగ్రెస్‌ శ్రేణులూ పోరాటానికి దిగాయి. అది కాంగ్రెస్‌కే లాభం చేకూర్చింది. అంతేకాక అమేథీలో గెలుపు అవకాశాలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మొదట్నుంచి అనుమానాలు ఉండడంతో కేరళలో వయనాడ్‌ నుంచి కూడా బరిలోకి దిగారు. సీపీఐ అభ్యర్థి ఆర్‌పీ సునీర్‌పై 4 లక్షల 30వేల పై చిలుకు మెజార్టీతో రాహుల్‌ నెగ్గారు.

ఇక్కడ రాహుల్‌ పోటీ చేసిన ప్రభావం యూడీఎఫ్‌ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి దోహదపడింది. యూడీఎఫ్‌ ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేయడం సీపీఎం నేతృత్వంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఓటమి పినరయి విజయన్‌ సర్కార్‌కు నష్టం కలిగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ‘జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌నే కేరళ ప్రజలు ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. అదే యూడీఎఫ్‌కి కలిసొచ్చింది‘ అని కేరళ ఎన్నికల పరిశీలకుడు డా. సాజద్‌ ఇబ్రహీం అభిప్రాయపడ్డారు. తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ విజయం సాధిస్తే, భారతీయ జనతాపార్టీ అభ్యర్థి, కేరళ బీజేపీ మాజీ చీఫ్‌ కె.రాజశేఖరన్‌ రెండోస్థానంలో నిలిచారు. మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ మూడో స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇక పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వైద్యలింగం, ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నారాయణస్వామి కేశవన్‌ను ఓడించింది. లక్షదీవులు  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి మహమ్మద్‌ ఫైజల్‌ ఘన విజయం సాధించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top