ఇక చకచకా..

EC Awareness on EVMs And VV Pats - Sakshi

ఎన్నికల ప్రక్రియలో విప్లవం

ఈవీఎం,వీవీప్యాట్‌లతో పెనుమార్పులు

పనితీరుపై ఆరోపణలే తప్ప నిరూపణ లేదు  

బ్యాలెట్‌ పేపర్‌ తయారీకే 15 రోజులు, పగలు, రాత్రి యుద్ధ ప్రాతిపదికన ప్రింటింగ్‌ ప్రెస్‌ల హడావుడి, పెద్ద బ్యాలెట్‌ పేపరులో గుర్తులను వెదికి ఓటు ముద్ర వేసి మడతపెట్టి పెట్టెలో వేయడం, మళ్లీ అవన్నీ తెరిచి గంటల తరబడి/ కొన్నిసార్లు తెల్లవారే వరకు లెక్కించడం... ఈ సుదీర్ఘ క్రతువుకు స్వస్తి పలుకుతూ అందుబాటులోకి వచ్చినవే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లు. వీటిపై మన అపోహలు, అనుమానాలను తీర్చేందుకు సరికొత్తగా ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌) పుట్టుకొచ్చింది. ఓటు మనం కోరుకున్న పార్టీకే పడిందా, లేదా? అన్నది సెకన్లలో చూసుకుని, కచ్చితంగా ధ్రువీకరించుకునే వీలుండటం వీవీ ప్యాట్‌ల ప్రత్యేకత. పోలింగ్‌ ప్రక్రియలో వీటి ప్రవేశంతో అంతా సులభతరమైంది.

నూతన అధ్యాయం: అవకతవకలకు తావు లేకుండా భారత ఎన్నికల సంఘం 1982లో కేరళలోని పారూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టింది. ఈసీఐఎల్, బెల్‌ సహకారంతో వీటిని తయారు చేయించింది. కొందరు కోర్టుకెళ్లడంతో కేంద్రం 1988లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసి ఈవీఎంల వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. ఉమ్మడి ఏపీలో 1989లో తొలిసారిగా షాద్‌నగర్‌ (ఇపుడు తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వీటిని వినియోగించారు. 1998 పార్లమెంటు ఎన్నికలు, మధ్యలో పలు అసెంబ్లీల ఎన్నికల్లో వినియోగించారు. 2004 నుంచి దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.
పారదర్శకతతో వీవీప్యాట్‌లు: మన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా, లేదా అని కాగితం స్లిప్‌లో చూసుకునే అవకాశం ఉంది.  దీన్ని మొదటిసారిగా 2013లో నాగాలాండ్‌లోని నాక్‌సెన్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రవేశపెట్టారు. డిసెంబరులో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు.

ఇలా పనిచేస్తాయి...
ముందుగా కంట్రోల్‌ యూనిట్‌కు బ్యాలెట్‌ యూనిట్, వీవీప్యాట్‌ను అనుసంధానం చేస్తారు. కంట్రోల్‌ యూనిట్‌ పోలింగ్‌ బూత్‌ అధికారి నియంత్రణలో ఉంటుంది. తర్వాత బ్యాలెట్‌ యూనిట్‌ను, వీవీప్యాట్‌ యంత్రాలను ఆన్‌ చేస్తారు. ఈ ప్రక్రియ పోలింగ్‌ ఏజెంట్ల ఎదుటే జరుగుతుంది. శాంపిల్‌గా 50 ఓట్లు వేస్తారు. నమూనా పోలింగ్‌లో అన్నీ సవ్యంగా ఉన్నాయనిపార్టీల ఏజెంట్లు సంతృప్తి చెందాకే ఓటింగ్‌  ప్రారంభమవుతుంది.

ఓటేసేదిలా...
పోలింగ్‌ సిబ్బంది తనిఖీ పూర్తయ్యాక ఓటరు వేలిపై సిరా గుర్తు పెట్టి బ్యాలెట్‌ యూనిట్‌ వద్దకు పంపుతారు. కంట్రోల్‌ యూనిట్‌ ద్వారా ఎన్నికల అధికారి బ్యాలెట్‌ యూనిట్‌ను సిద్ధం చేసిన వెంటనే దానిపై గ్రీన్‌ లైట్‌ వెలుగుతుంది. అభ్యర్థి పేరుతో పాటు, గుర్తు, సీరియల్‌ నంబరు ఉంటుంది. ఓటరు తనకు నచ్చిన గుర్తు ఎదురుగా ఉన్న నీలం రంగు బటన్‌ నొక్కాలి. వెంటనే ఓటరు ఏ అభ్యర్థికి ఓటు వేశాడో పక్కనున్న వీవీప్యాట్‌లో 7 సెకన్లపాటు కనిపిస్తుంది.

అపోహలకు తావులేకుండా...
ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు మరింత పారదర్శకంగా నిర్వహించడానికి ఈసీ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. డిసెంబరులో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బ్యాలెట్‌ యూనిట్‌లో అభ్యర్థుల ఫొటోలు సైతం కనిపించే ఏర్పాట్లు చేశారు. దీంట్లో గుర్తులతో పాటు అదనంగా నోటా బటన్‌ కూడా ఉంటుంది. 2004 ఎన్నికల నుంచి ఇది ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో బ్యాలెట్‌ యూనిట్‌ను ప్రవేశపెట్టారు.

పోటీలోఎంతమంది ఉన్నా..
డిసెంబరులో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఎం–3 కంట్రోల్‌ యూనిట్లను వాడారు. వీటికి 24 బ్యాలెట్‌ యూనిట్లను అనుసంధానం చేయవచ్చు. దీనివల్ల పోటీలో ఎంతమంది ఉన్నా ఇబ్బంది ఉండదు.

అపోహలు...ఆరోపణలు
ఈవీఎంల వినియోగంపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు సందేహాలు వెలిబుచ్చాయి. ఏ పార్టీకి ఓటు వేసినా.. ఒక పార్టీకే పడుతున్నాయంటున్నారు. మళ్లీ పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని తీసుకురావాలని కొన్ని పార్టీలు, ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఓటమి నెపాన్ని ఈవీఎంలపై నెడుతున్నారని కొన్ని పార్టీల నాయకులు, అధికారులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో నెగ్గిన చంద్రబాబు అప్పుడు ఏ ఆరోపణలు చేయలేదు. తెలంగాణలో ఓటమి తర్వాత  ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ బ్యాలెట్‌ పేపరు కావాలంటున్నారు. ఆరోపణలు చేస్తున్న వారెవరూ ఎలక్షన్‌ కమిషన్‌ ముందు నిరూపించ లేకపోవడం విశేషం.సాక్షి, ఎలక్షన్‌ డెస్క్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top