ఉత్తమ్ వద్ద డబ్బు లేకున్నా అప్పు తెచ్చి..!

Congress MLA Jaggareddy Interesting Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల విషయమై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే అయిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందిన నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. హుజూర్ నగర్‌లో కాంగ్రెస్‌ తరఫున ఉత్తమ్  కుటుంబ అభ్యర్థి ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని, ఉత్తమ్ వద్ద డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి పోటీచేసి గెలిపించుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట మనుషులు కనుక.. వారికి అప్పు పుడుతుందని తెలిపారు. రాజకీయంగా వరుస ఎన్నికల్లో పోరాడటం వల్ల ఆర్థికంగా బలహీనపడ్డామని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో చిట్‌చాట్‌ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా బలహీనంగా ఉన్నా.. కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. రేపటి ఎంపీటీసి , జెట్పీటీసీ ఫలితాలు పోటాపోటీగా ఉంటాయని అంచనా వేశారు. అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. శాసనమండలిలో ఉన్న 35మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు  ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సరిపోతారని, శాసనమండలిలో టీఆరెస్ ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలను లేవనెత్తలేరని, మండలిలో ప్రజల సమస్యల గురించి ప్రశ్నించే ఏకైక వ్యక్తి జీవన్ రెడ్డి మాత్రమేనని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ అని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో డబ్బులు లేకనే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని, అధికార పార్టీ దగ్గర డబ్బులు ఉన్నందున గెలిచారని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top