హస్తం పార్టీలో ఆన్‌లైన్‌ ‘పరీక్ష’!

Congress launches 'Shakti App' - Sakshi

అభ్యర్థుల ఎంపికకు శక్తి యాప్‌

సూత్రప్రాయంగా నిర్ణయం

ఆశావహుల ప్రొఫైల్, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణనలోకి

సెప్టెంబర్‌ రెండో వారంలో తొలిజాబితా!

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలంటే ఆన్‌లైన్‌ ‘పరీక్ష’ఎదుర్కోవాలా? అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. పార్టీ టికెట్‌ ఆశించే నేతల ప్రొఫైల్‌తో పాటు ఆన్‌లైన్‌ ద్వారా తీసుకునే ఆ నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాకే అభ్యర్థిత్వాన్ని నిర్ధారించాలని ఏఐసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు ‘శక్తి’ యాప్‌ను ఉపయోగించుకోనుంది.

ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చెప్పడం గమనార్హం. దీని ప్రకారం శక్తి యాప్‌లో నమోదు చేసుకున్న మెజార్టీ కార్యకర్తలు పలానా అభ్యర్థి ఓకే అంటేనే వారికి టికెట్‌ కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేని 40–50 నియోజకవర్గాల్లో ఈ అభిప్రాయసేకరణ ఉండే అవకాశం లేదని, నేతల మధ్య పోటీ ఉన్న చోట్ల మాత్రమే కార్యకర్తలను అడిగి టికెట్లు కేటాయించనున్నట్లు గాంధీ భవన్‌ వర్గాలంటున్నాయి.

అయితే గతంలో ఢిల్లీలో లాబీయింగ్‌ చేసి టికెట్లు తెచ్చుకునే పరిస్థితిలో మార్పు రావాలన్న ఆలోచనతోనే రాహుల్‌గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని, దీంతో గెలుపు గుర్రాలకే టికెట్లు వస్తాయనే చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో కొంతమంది అభ్యర్థుల జాబితా సెప్టెంబర్‌లోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేని అభ్యర్థులతో కూడిన సెప్టెంబర్‌ రెండో వారంలో తొలి జాబితా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.  

‘శక్తి’తక్కువదేం కాదు!
శక్తి యాప్‌.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌. ఈ యాప్‌ ద్వారానే కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తారని పీసీసీ అధ్యక్షుడే చెప్పడంతో ఇప్పుడు ఈ యాప్‌కు ఎంతో ప్రాధాన్యం వచ్చింది. కార్యకర్తల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకుని ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను, అభిప్రాయాలను, ఏఐసీసీ అధ్యక్షుడు మొదలు జిల్లా అధ్యక్షుల వరకు నేతల సందేశాలను ఏకకాలంలో పంపేందుకు కాంగ్రెస్‌ ఈ యాప్‌ను రూపొందించింది.

దీని ద్వారా దేశంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను నమోదు చేసే కార్యక్రమాన్ని స్వయంగా రాహుల్‌గాంధీ పర్యవేక్షిస్తున్నారు. పార్టీ ముఖ్యులైన చిదంబరం లాంటి నేతలను కూడా రాష్ట్రానికి పంపి కార్యక్రమాన్ని సమీక్షించడం గమనార్హం. ఇటీవల రెండు రోజుల పాటు ఢిల్లీలో సమీక్ష నిర్వహించి శక్తియాప్‌ రాష్ట్ర కోఆర్డినేటర్, ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌తో పాటు రాష్ట్రానికి చెందిన నేతలను కూడా సన్మానించారు.  

వచ్చే రాజీవ్‌ జయంతి కాంగ్రెస్‌ పాలనలోనే: ఉత్తమ్‌
సాక్షి, హైదరాబాద్‌: కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలని, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వచ్చే ఏడాది కాంగ్రెస్‌ పాలనలోనే జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాజీవ్‌ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆయన విగ్రహం వద్ద, గాంధీభవన్‌లో జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. సోమాజిగూడ నుంచి మాజీ ఎంపీ వి.హనుమంతరావు నేతృత్వంలో ‘సద్భావన రన్‌’నిర్వహించారు.

గాంధీభవన్‌లో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఉత్తమ్‌ మాట్లాడారు. రాజీవ్‌ చేపట్టిన సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాయని, భావితరాలకు ఆయన స్ఫూర్తిదాతగా నిలిచారని కొనియాడారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ అని, మత సామరస్యాన్ని కాపాడి దేశాన్ని ఐక్యం చేయడంలో రాజీవ్‌ సేవలను మరువలేమని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, నాయకులు కోదండరెడ్డి, నేరెళ్ల శారద, బండా కార్తీకరెడ్డి, నిరంజన్, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒకరికే పింఛన్‌ నిబంధనను తొలగిస్తాం
కుటుంబంలో ఒకరికే సామాజిక పింఛన్‌ ఇవ్వాలన్న నిబంధనను తాము అధికారం లోకి వస్తే తొలగిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అర్హులైన భార్యాభర్తలిద్దరికీ పింఛన్‌ ఇస్తామని, అలాగే పింఛన్‌ అవసరమైన ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకూ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌ నుంచి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన వెల్లడించారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, నిరుపేదలకు అండగా ఉండే అన్ని కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు. గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులనూ చెల్లిస్తామని అన్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలంతా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రతి కార్యకర్త తమ పేరు ఓటరు జాబితాలో ఉందో.. లేదో చూసుకోవాలని కోరారు. కేసీఆర్‌ పాలనలో ప్రచారం తప్ప అభివృద్ధి లేదని, నాలుగున్నరేళ్లలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యం ఉంటుందని, కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎంపిక కూడా ఉంటుందని చెప్పారు. శక్తి యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదైన కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలనే యోచనలో పార్టీ హైకమాండ్‌ ఉన్నట్టు వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top