అసంతృప్తి..ఆవిర్భావం

Conflicts Between Tdp Leaders - Sakshi

ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి వ్యతిరేకంగామాజీ ఎంపీ సైఫుల్లా వర్గీయుల సమావేశం

9మంది కార్పొరేటర్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు హాజరు

పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను ఎమ్మెల్యే విస్మరిస్తున్నారని ధ్వజం

టీడీపీ నేతలను హత్య చేసిన వారికి పదవులు కట్టబెట్టారని విమర్శలు

ఎమ్మెల్యే వైఖరితో మరో 20 ఏళ్లు టీడీపీ గెలవదని ఆవేదన

పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుందామన్న జకీవుల్లా

అవసరమైతే తన వర్గీయులతో జకీవుల్లా పార్టీ వీడే ఆలోచన

జిల్లా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైన అసంతృప్తుల సమావేశం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: నేతల మధ్య విభేదాలతో టీడీపీ పరువు బజారున పడుతోంది. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో నిత్యం అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉంది. జిల్లా కేంద్రం అనంతపురంలో మరింత భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్‌ చౌదరికి టిక్కెట్టు ఇస్తే ఆ సీటుపై ఆశలు వదులుకోవాల్సిందేనని దివాకర్‌రెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. జేసీ వర్గీయులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జయరాం నాయుడు ఎమ్మెల్యే పతనమే తమ లక్ష్యమని బాహాటం గానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూపల మధ్య కూడా విభేదాలు నడుస్తున్నాయి. అవసరమైనప్పుడు కలిసే ఉన్నట్లు నటించడం మినహా ఇద్దరి మధ్య సరైన వాతావరణం లేదు. ఈ రెండు వర్గాలకు తోడు ఇప్పుడు మూడో వర్గం చౌదరిపై తిరుగుబాటు బావుటా ఎగరేసింది. మాజీ ఎంపీ సైఫుల్లా వర్గం ప్రభాకర్‌ చౌదరికి వ్యతిరేకంగా గళం విప్పి ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. గురువారం తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో సైఫుల్లా తనయుడు జకీవుల్లా, జయరాంనాయుడుతో పాటు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నేరుగా సైఫుల్లా ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ కార్యకర్తల సమావేశానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఎమ్మెల్యే లక్ష్యంగా విమర్శలు
సమావేశానికి పార్టీ నేతలు జయరాంనాయుడు, లక్ష్మీపతి, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైపుద్దీన్, వైశ్య సంఘం ఉపాధ్యక్షుడు నాగేంద్రతో పాటు కార్పొరేటర్లు ఉమామహేశ్వర్, లాలెప్ప.. పలువురు కార్పొరేటర్లకు సంబంధించి భర్తలు, కుమారులు కలిసి మొత్తం 9మంది దాకా హాజరయ్యారు. వీరితో పాటు కోఆప్షన్‌ సభ్యులు మున్వర్, కృష్ణకుమార్‌ మరో పది మంది వార్డు కన్వీనర్లు పాల్గొన్నారు. వీరంతా ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపిన మేరకు.. పదేళ్లపాటు ప్రతిపక్షంలో శ్రమించిన కార్యకర్తలకు నాలుగేళ్ల అధికారంలో ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ‘పార్టీ కోసం శ్రమించిన వారిని పార్టీ చూసుకుంటుందని, తన కోసం పాటు పడిన వారిని తాను చూసుకుంటా’నని వ్యాఖ్యానిస్తున్నారని, దీన్నిబట్టి చూస్తే కార్యకర్తల సంక్షేమంపై ఎమ్మెల్యేకు ఏమేరకు చిత్తశుద్ధి ఉందో ఇట్టే తెలుస్తోందని జయరాంనాయుడు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను హత్య చేసిన వారికి పదవులు కట్టబెట్టారని టౌన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జేఎల్‌ మురళీని ఉద్దేశించి మాట్లాడారు. ఏ రోజూ టీడీపీ జెండా మోయని గంపన్నకు డిప్యూటీ మేయర్‌ పదవి కట్టబెట్టారన్నారు. ఒక్కొక్కరికీ 3–4 పదువులు కట్టబెట్టారని మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఆదినారాయణను ప్రస్తావన తీసుకొచ్చారు. ఎమ్మెల్యే తీరుతో మరో 20 ఏళ్లు పార్టీ గెలిచే పరిస్థితి లేదని అంతా ముక్తకంఠంతో స్పష్టం చేశారు.

సీఎం దృష్టికి తీసుకెళ్దాం
పార్టీని బతికించుకోవాలని, దానికి ఏం చేయాలో తెలపాలని జకీవుల్లాను నాయకులు కోరా>రు. విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లి, వారి నిర్ణయం తర్వాత భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిద్దామని జకీవుల్లా తెలిపినట్లు తెలిసింది. ఇటీవల వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవిని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు కట్టబెట్టడంపై వక్ఫ్‌బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సమావేశం నిర్వహించడం, ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చూస్తే అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జకీవుల్లాకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. విషయాన్ని జకీవుల్లా పూర్తిగా వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీ అనంతపురం వాట్సాప్‌ గ్రూపులో ఈ సమావేశాన్ని ఉద్దేశించి ‘స్క్రాబ్‌’ సమావేశాలను పట్టించుకోవద్దని, వారి కథ చూద్దామని ఎమ్మెల్యే పోస్టు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై మరింతగా సైఫుల్లా వర్గం మండిపడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద అనంతపురంలో టీడీపీ పరిస్థితి చూస్తే నేతల మధ్య విభేదాలతో పూర్తి పతానవస్థకు చేరినట్లు స్పష్టమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top