
సాక్షి, అమరావతి: అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ చేపట్టే అవకాశముందని.. ఇందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారం ఆయన టీడీపీ ఎంపీలు, ముఖ్య నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎంపీలంతా మంగళవారం లోక్‌సభకు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. టీడీపీతో పాటు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఎం కూడా నోటీసులిచ్చాయని.. ఈ నేపథ్యంలో లాటరీ ద్వారా అవిశ్వాసంపై చర్చ చేపట్టే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో తొలుత నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసాన్ని చర్చకు చేపట్టవచ్చని.. ఏదేమైనా అవిశ్వాసంపై చర్చ జరిగితే సద్వినియోగం చేసుకోవాలన్నారు.
టీడీపీ ఎంపీలంతా పసుపు చొక్కాలు, కండువాలతో సభకు హాజరుకావాలని ఆదేశించారు. టీఆర్‌ఎస్ కూడా టీడీపీకి సహకరించేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. చర్చకు కావాల్సిన సమాచారం మొత్తం ఎంపీలకు అందుబాటులో ఉంచుతామని.. ఇందుకోసం రెండు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో ఒక బృందం, అమరావతి నుంచి మరో బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. యూసీలు(వినియోగపత్రాలు) ఇవ్వనందునే నిధులు విడుదల చేయలేదనే బీజేపీ ఆరోపణల్లో వాస్తవం లేదనే వాదనను గట్టిగా వినిపించాలని ఆదేశించారు.
అన్ని యూసీలు ఇచ్చినందునే కేంద్రం మలి విడత నిధులిచ్చిందంటూ బీజేపీ ఆరోపణలను ఖండించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అంశాలను ప్రచారం చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో బీజేపీ దుష్ప్రచారాన్ని అధికం చేసిందని.. దీనిపై ఎవరూ అధైర్యపడవద్దన్నారు. జాతీయ మీడియాను సమన్వయం చేసుకోవాలని, మన వద్దనున్న సమాచారం ఎప్పటికప్పుడు మీడియాకు ఇవ్వాలని సూచించారు.