పొత్తు అనివార్యం: బాబు 

Chandrababu Naidu Wants To Form Alliance In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తమకు పొత్తులు అనివార్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. పొత్తులు తప్పనిసరిగా ఉంటాయని, అయితే ఎవరితో ఉంటుందనే విషయాన్ని సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. ఈ మేరకు ఇటీవల తెలంగాణ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ కేడర్‌ ఇప్పటికీ ఉందని, అయితే కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో నేతలు వెనుకబడుతున్నారని చంద్రబాబు అన్నారు.

‘‘పార్టీని ఎవరో వచ్చి కాపాడుతారనే ఆలోచన పెట్టుకోవద్దు. సొంతంగా ఎదిగే కార్యాచరణ తెలంగాణ నాయకత్వమే రూపొందించుకోవాలి’’అని అన్నట్టు సమాచారం. మరోవైపు ఎవరైనా పొత్తు కోసం వచ్చేందుకైనా ఎదగాలని పదేపదే చెబుతున్న బాబు.. ఎలాంటి ప్రయత్నాలు చేయాలో మాత్రం చెప్పడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇటీవల పుట్టుకొచ్చిన టీజేఎస్‌ వంటి పార్టీలు కూడా ఎంతో కొంత ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నా టీడీపీ పక్షాన ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణే లేకుండా పోయిందని టీటీడీపీకి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. ఏదో అలల మీద నడిచే పడవలాగా తమ ప్రయాణం సాగుతోందని, తీరమెక్కడో అంతుపట్టడం లేదని ఆయన అన్నారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top