తక్షణమే ఆపేయండి

Central Election Commission Orders about Voters registration date - Sakshi

     2019 జనవరి 1 గడువు 

    ‘ఓటరు సవరణ’ నిలిపేయండి  

     ‘ముందస్తు’నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు 

     2018 జనవరి 1 నాటికి అర్హత సాధిస్తేనే ఓటు హక్కు 

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల నమోదు అర్హత తేదీ 2019 జనవరి 1 గడువుతో రాష్ట్రంలో నిర్వహిస్తున్న ‘ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2019’ను రాష్ట్ర శానససభ రద్దయిన నేపథ్యంలో తక్షణమే నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులు, అభ్యంతరాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలు కీలక సూచనలు చేసింది. ఓటరుగా నమోదుకు 2018 జనవరి 1, 2019 జనవరి 1 తేదీల నాటికి అర్హత సాధించే వ్యక్తుల దరఖాస్తులు, అభ్యంతరాలను రెండుగా విభజించాలని ఆదేశించింది. 2018 జనవరి 1 నాటికి అర్హత సాధించే వ్యక్తుల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు.. ముందస్తు ఎన్నికల కోసం నిర్వహిస్తున్న ‘రెండో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2018’కింద ఓటు హక్కు కల్పించాలని కోరింది.

ముందస్తు ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా 2019 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిలుపుదల చేసి, 2018 జన వరి 1 అర్హత తేదీగా తక్షణమే ‘రెండో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2018’ను ప్రారంభించాలని ఆదేశిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి అర్హత సాధించిన వ్యక్తులు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం–2019 కింద దరఖాస్తు చేసుకొని ఉంటే మళ్లీ తాజాగా నిర్వహిస్తున్న 2018కి సంబంధించిన రెండో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉత్పన్నం కావద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల అనంతరం పునరుద్ధరించనున్న 2019 సంబంధించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కింద 2019 జనవరి 1 నాటికి అర్హత సాధించే వ్యక్తులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలని కోరింది.  

తొలగింపు జర భద్రం! 
- ముందస్తు ఎన్నికల కోసం నిర్వహిస్తున్న 2018కి సంబంధించిన రెండో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కింద ఓటర్ల తొలగింపులో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతే చనిపోయిన, చిరునామా మారిన, డూప్లికేట్‌ ఓటర్లను తొలగించాలని కోరింది.  
- ఒకటికి మించిన ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్‌ కార్డు) కలిగిన వ్యక్తుల ఓట్లను తొలగించినప్పుడు ఆయా వ్యక్తుల నుంచి అదనంగా ఉన్న ఎపిక్‌ కార్డులను వెనక్కి తీసుకుని వాటి రికార్డులను భద్రపరచాలి.  
- ఓటరు జాబితా డేటాబేస్‌లో ఆధారంగా తొలగించిన ఓటర్లకు పోస్టు/ఈ–మెయిల్‌/సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారమివ్వాలి.  
- ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్న ఓటర్ల పేర్లతో జాబితాను రూపొందించి వారం ముందు ఓటరు నమోదు అధికారి తన కార్యాలయం గోడలపై అతికించాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెబ్‌సైట్‌పై మీద ఈ జాబితాలను ప్రదర్శనకు ఉంచి అభ్యంతరాలు స్వీకరించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సైతం ఈ జాబితాలను అందించాలి.  
- తొలగింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత తొలగించిన తుది ఓటర్ల జాబితాలను సైతం రాజకీయ పార్టీలకు ఇవ్వాలి.  
- ఓటర్ల తొలగింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.  

ఈ కేసుల్లో ప్రత్యేక పరిశీలన..  
- మరణం మినహా ఇతర ఏ కారణాలతోనైనా ఒకే పోలింగ్‌స్టేషన్‌ పరిధిలో 2 శాతానికి పైగా ఓటర్లను తొలగిస్తే ప్రతి కేసును తహశీల్దార్, ఆపై స్థాయి అధికారి ప్రత్యేక పరిశీలించాలి.  
- ఒకే వ్యక్తి ఐదుకి మించిన కేసుల్లో అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రత్యేక పరిశీలన నిర్వహించాలి.  
- 2 శాతం కేసులను ఉప జిల్లా ఓటరు నమోదు అధికారి క్రాస్‌ చెక్‌ చేయాలి.  1 శాతం కేసులను జిల్లా ఎన్నికల అధికారి, 0.5% కేసులను ఎన్నికల పర్యవేక్షణాధికారి క్రాస్‌ చెక్‌ చేయాలి.

ప్రముఖుల ఓట్లు ప్రత్యేకం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కళలు, జర్నలిజం, క్రీడలు, న్యాయాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ వ్యక్తుల ఓట్లను తొలగించడానికి వీల్లేకుండా ఓటర్ల జాబితా డేటాబేస్‌లో ప్రత్యేక గుర్తింపు కల్పించాలని ఎన్నికల సంఘం సూచించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top