
సాక్షి, అమరావతి: ఢిల్లీలో బీజేపీ నేతలతో గురువారం తాను సమావేశమైనట్లు వస్తున్న వార్తలను పీఏసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. బీజేపీ నేతలతో ఎలాంటి సమావేశాలు జరగలేదని తేల్చిచెప్పారు. అనైతిక రాజకీయాలు, జర్నలిజంతో తెలుగుజాతి పరువు తీస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత పనులపై తాను ఢిల్లీ వెళితే, దానిచుట్టూ ఒక కట్టు కథ అల్లి అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయడం అధికార తెలుగుదేశం పార్టీ అభద్రతా భావానికి నిదర్శనమని చెప్పారు.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు ఉంటారని, అలాగే అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ విప్ కూన రవికుమార్‌లను కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. కూన రవికుమార్ తనను ఆలింగనం కూడా చేసుకున్నాడని, అంటే అతను వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నట్లా అని బుగ్గన ప్రశ్నించారు. కూన రవికుమార్ తన క్లాస్‌మెట్ కాబట్టి ఆలింగనం చేసుకున్నారని, కానీ బాబు అనుకూల మీడియా దీన్ని చూపించకుండా దిగజారుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.