‘విదేశాల్లోనూ పరువు తీస్తున్న చంద్రబాబు’

Botsa Satyanarayana fire on chandrababu foreign tour expenses - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చిన ఘనత ఆయనదే

విదేశీ పర్యటనలు, పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి

టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఏపీ సీఎం లోపాయికారీ ఒప్పందాలు

రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఏపీ టీడీపీ క్లారిటీ ఇవ్వాలి

వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ

సాక్షి, విజయవాడ : విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంపెనీల ప్రతినిధులను కలవకుండా కేవలం తెలుగువారినే కలుస్తూ అక్కడ కూడా రాష్ట్ర పరువు తీస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తన దుబారా ఖర్చులతో ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘విదేశాలలో చంద్రబాబు ఏం చేస్తున్నారో టీవీల్లో చూస్తున్నాం. కంపెనీల ప్రతినిధులతో చర్చలు మానేసి తెలుగువారిని కలవడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్న చంద్రబాబు విదేశీ పర్యటనలతో పాటు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని’ బొత్స డిమాండ్ చేశారు.

‘రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి రూ. 2వేల కోట్ల కాంట్రాక్టులు, మరో మంత్రి పరిటాల సునీతకు మద్యం లైసెన్స్ ఇప్పించారని టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇకనైనా చౌకబారు విమర్శలు మానుకొని, రేవంత్ బయటపెట్టిన విషయాలపై ఏపీ టీడీపీ స్పందించి క్లారిటీ ఇవ్వాలి. నవ్యాంధ్ర కోసం విజయవాడ వచ్చానని ప్రజలకు చంద్రబాబు నంగనాచి మాటలు చెబుతున్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. మూడున్నరేళ్లుగా చంద్రబాబు కాలక్షేపణ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని సీఎం తెలుసుకోవాలి.  

నితిన్ గడ్కరీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. పోలవరం వ్యయం పెంపుతో మాకు సంబంధం లేదని కేంద్రమంత్రి గడ్కరీ కుంబబద్ధలు కొట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నుంచి రాష్ట్రానికి బదలాయింపు చేయడమే తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంపై విమర్శలు మాని.. పోలవరం పూర్తి చేయడంపై శ్రద్ధపెట్టాలని చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top