జనచైతన్య యాత్రకు బీజేపీ సిద్ధం  

BJP Prepared For Jana Chaitanya Yatra - Sakshi

నేడు యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి సన్నిధి నుంచి ప్రారంభం

హాజరుకానున్న కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌

సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరించేందుకు బీజేపీ రాష్ట్ర కమిటీ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన జన చైతన్యయాత్ర ప్రారంభ సభకు జిల్లా నాయకులు సర్వం సిద్ధం చేశారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జన చైతన్యయాత్ర ప్రారంభోత్సవ సభ జిల్లా కేంద్రమైన భువనగిరిలో నిర్వహించనున్నారు.

ఇందుకోసం జిల్లా కార్యవర్గం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం 2.30గంటలకు బీజేపీ నేతలు యాదగిరిగుట్టకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం 3గంటలకు భువనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందులో భాగంగా స్థానిక ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారు.

అంబేద్కర్‌ చౌరస్తాలో కోలాటం, లంబాడీ నృత్యాలతో ర్యాలీగా కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. వివేకానందుడి విగ్రహం వద్ద హారతి, బోనాలు, బతుకమ్మలతో నేతలందరికీ స్వాగతం పలుకుతారు. తొలి బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. 8వేల నుంచి 10వేల వరకు జనం వస్తారని ఇందుకోసం  అన్ని ఏర్పాట్లు చేశారు. 

కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ రాక

జనచైతన్యయాత్ర ప్రారంభోత్సవ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హైదరాబాద్‌ వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా బహిరంగ సభలో పాల్గొనవచ్చని బీజేపీ నాయకులు అంటున్నప్పటికీ ఇంకా ఖరారు కాలేదు.

అలాగే రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ, శాసనసభాపక్ష బీజేపీ నేత కిషన్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ వంటి పలువురు నేతలు సమావేశానికి హాజరవుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌రావు తెలిపారు. 

ఏర్పాట్ల పరిశీలన

జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించే బీజేపీ జన చైతన్యయాత్ర సభాస్థలిని జిల్లా కార్యవర్గం శుక్రవారం పరిశీలించింది. జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు ఆధ్వర్యంలో సభా వేదికతో పాటు సభకు హాజరయ్యే జనానికి అవసరమయ్యే ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.

ఈకార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి వేముల నరేందర్‌రావు, నాయకులు వేముల అశోక్, నర్ల నర్సింగరావు, పడమటి జగన్మోహన్‌రెడ్డి, కోళ్ల భిక్షపతి, కురాం పరమేశ్, సూరకంటి రంగారెడ్డి, పంచెద్దుల బలరాం, రత్నపురం బలరాంలు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top