
సమావేశంలో మాట్లాడుతున్న సురేష్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అటువంటి వ్యక్తితో చంద్రబాబు సయోధ్య కుదుర్చుకున్నారని, అందులో ఆంతర్యమేమిటని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కుటుంబ పరిపాలన కొనసాగిస్తూ తెలంగాణాలో ఫిరాయింపులు తీసుకొచ్చిన కేసీఆర్ గుణాత్మకమైన రాజకీయాలు గురించి ఎలా మాట్లాడుతారన్నారు. ఇటువంటి వ్యక్తితో చంద్రబాబు చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు గ్లోబెల్స్ ప్రచారం జరుగుతుందనేది నేడు రుజువైందన్నారు. ఈ ప్రచారమంతా కొద్ది రోజులు మాత్రమేనన్నారు.
మోదీని అప్రదిష్టపాలు చేయాలని టీడీపీ ఎప్పుడో స్క్రిప్ట్ రెడీ చేసుకుందని, ఓ పథకం ప్రకారంగానే వ్యవహరిస్తూ నిన్నటి రోజున ఈ పథక రచన బయటపెట్టారన్నారు. అంతేకాకుండా టీడీపీ, కాంగ్రెస్‌లు దోబూచులాడుతున్నాయని ఇదంతా కేవలం ప్రధాని మోదీ చరిష్మాను దెబ్బతీసేందుకేనని చెప్పారు. తమ పార్టీనీ, నాయకుడిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే చేస్తూ ఊరుకోబోమని, తాము కూడా టీడీపీ అక్రమాలను ఎండకట్టేందుకు గ్రామగ్రామాన తిరిగి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్, నాయకులు కరణం భాస్కర్, మొద్దు శ్రీను, మారుతికుమార్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సురేష్‌నాయుడు పాల్గొన్నారు.