
సాక్షి, హైదరాబాద్: లక్షన్నర కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసా యానికి రూ.10 వేల కోట్లు కేటాయించలేని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రణాళికలు చేస్తున్న బీజేపీ ప్రభుతాన్ని కాంగ్రెస్‌తో పోల్చడం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అవివేకానికి పరాకాష్ట అని ఆయన గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధికోసం రాష్ట్ర మంత్రులు ఎవరు వెళ్లినా కేంద్ర మంత్రులు రూ.వేల కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న కపట రాజకీయాలతో ఇప్పుడు వారు విస్తుపోతున్నారని ఆరోపించారు. వ్యవసాయం పేరిట కేంద్రంపై బురదజల్లే విధంగా మురికి రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ నిజస్వరూపాన్ని చూసి రైతులు వాస్తవాలు గ్రహిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని దిగజార్చుకునే విధంగా మాట్లాడవద్దని దత్తాత్రేయ హితవు పలికారు.