కేసీఆర్‌.. ఇళ్లు రాకుండా చేసిన ఘనుడు 

Bandaru Dattatreya comments on KCR - Sakshi

కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ 

సాక్షి, హైదరాబాద్‌: నాలుగున్నరేళ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ 120 హామీలిచ్చారని, వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. కేసీఆర్‌ హామీల సీఎం తప్ప అమలు చేసే సీఎం కాదని, ప్రగతిభవన్‌లో సమీక్షలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. గురువారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం 2.42 లక్షల మంది చేసుకున్న దరఖాస్తులను తొక్కి పెట్టి ఇళ్లు రాకుండా చేసిన ఘనుడు కేసీఆర్‌ అని ఆరోపించారు. లక్ష కుటుంబాలకు ఇళ్లు ఇస్తానని చెప్పినా, అందులో 10 వేల ఇళ్లు కూడా కట్టలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందన్న అక్కసుతోనే కేంద్ర పథకాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారని దత్తాత్రేయ అన్నారు.  

ఇంటింటికీ తాగునీరిస్తామని, అవి ఇచ్చేవరకు ఓట్లు అడగనన్న సీఎం కేసీఆర్, అది చేయలేక ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నీళ్లు తెస్తామని చెప్పి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నారని, ఆ తరువాత మళ్లీ పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రధాని ఆవాస్‌ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తామని, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రెడ్డి, బ్రాహ్మణ, వైశ్యుల్లో వెనుకబడిన వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, ఆర్థిక చేయూతను అందిస్తామన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కుమ్రంభీం పేరు పెడుతామన్నారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top