చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారు? | Ambati Rambabu Slams Chandrababu In Hyderabad | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారు?

Oct 7 2018 1:11 PM | Updated on Oct 7 2018 1:47 PM

Ambati Rambabu Slams Chandrababu In Hyderabad - Sakshi

వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు

ఇదే ఈడీ సంస్థ గత ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంస్థల్లో దాడులు నిర్వహించినపుడు ఎల్లో పత్రికలు ఈడీ దాడులను బేష్‌ అన్నట్లు రాశాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, సీనియర్‌ నేత అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని చంద్రబాబు అనడాన్ని తప్పుబట్టారు. ఒకవైపు ఐటీ అధికారులకి సెక్యూరిటీ ఉపసంహరించుకున్నట్లు చంద్రబాబు స్టేట్‌మెంట్లు ఇవ్వడం..మరో వైపు చంద్రబాబు అనుకూల మీడియా విష ప్రచారం సాగించడం దేనికి సంకేతమన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు విపత్కరంగా మారాయి..ఐటీ దాడులు జరిగితే ప్రజలకు నష్టమా  లేక టీడీపీ నాయకుల నష్టమా స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. దర్యాప్తు సంస్థలంటే చంద్రబాబు  ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. అసలు దర్యాప్తు సంస్థలు దాడులే చేయవద్దు అన్నట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఖర్చులు ఎలా ఉన్నాయో లెక్క తీయాలని ఐటీ సంస్థలను కోరారు. 

ఇంకా మాట్లాడుతూ..‘అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎన్నికల ఖర్చు అధికం. దీనికి కారణం చంద్రబాబు నాయుడే. ఏపీలో ఉన్న వ్యాపారవేత్తలందరినీ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చి విపరీతంగా ఖర్చు పెట్టిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ మీ పాత మిత్రుడు పవన్‌ కల్యాణే చెప్పారు. ప్రతీ నియోజకవర్గానికి రూ.20 కోట్లు సిద్ధంగా ఉంచామని లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌తో అన్నారని చెప్పలేదా?. నారాయణ, సీఎం రమేష్‌, సుజానా చౌదరీ రాజకీయ నాయకులా?. ఆర్థిక నేరస్తులందరినీ పార్టీలోకి తీసుకుని చంద్రబాబు డబ్బులు వెదజల్లుతున్నారు. బినామీలను పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నార’ని తీవ్రంగా విమర్శించారు.

‘నిప్పులాంటి మనిషినని చెప్పుకునే వ్యక్తి ఎందుకు వణికిపోతున్నారు. కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నారు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది. కట్టల కట్టల డబ్బు చంద్రబాబు బినామీల దగ్గర ఉంది. అదంతా బయటికి తీయాలని ఐటీ డిపార్ట్‌మెంట్‌ అధికారులను కోరుతున్నాను. ధర్మాబాబ్‌ కోర్టు బాబ్లీ కేసు విషయంలో చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చింది. నోటీసులు వచ్చినప్పుడు కోర్టుకు వెళ్లి నిరూపించుకోవాలి. చట్టం అంటే అసలు గౌరవం లేని ఆర్థిక ఉగ్రవాది నారా చంద్రబాబు నాయుడ’ని అంబటి వ్యాఖ్యానించారు.

అంబులెన్స్‌ వ్యాన్‌ సౌండ్‌కు కూడా భయపడుతున్నారు

చంద్రబాబు నాయుడు అంబులెన్స్‌ వ్యాన్‌ సౌండ్‌ విని కూడా పోలీస్‌ వ్యాన్‌ అనుకుని భయంతో గజగజా వణికిపోతున్నారని అంబటి ఎద్దేవా చేశారు.ఇదే ఈడీ సంస్థ గత ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంస్థల్లో దాడులు నిర్వహించినపుడు ఎల్లో పత్రికలు ఈడీ దాడులను బేష్‌ అన్నట్లు రాశాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలపై ఈడీ దాడులు చేస్తే అవే ఎల్లో పత్రికలు ఎలా రాస్తున్నాయో ప్రజలు గమనించాలన్నారు.

ఈడీ పంజా, మోదీ చెబితే దాడి అంటా బ్యానర్‌ హెడ్డింగ్‌లు పెట్టి ఇలా దర్యాప్తు సంస్థల పేరును భ్రష్టు పట్టించేలా రాస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతాడని అన్నారు..మరి చంద్రబాబు బయటకొచ్చి కేసీఆర్‌కి ఎందుకు సవాల్‌ చేయటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అంటే చంద్రబాబుకి ఎందుకు భయమన్నారు. టీడీపీ అయినా, చంద్రబాబు అయినా చట్టాలకు లోబడే ఉంటాయని, చట్టాలకు చంద్రబాబు అతీతుడేమీ కాదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement