88వ రోజు పాదయాత్ర డైరీ | 88th day padayatra diary | Sakshi
Sakshi News home page

88వ రోజు పాదయాత్ర డైరీ

Feb 16 2018 3:11 AM | Updated on Jul 25 2018 5:29 PM

88th day padayatra diary - Sakshi

15–02–2018, గురువారం
తూర్పుపాలెం క్రాస్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
‘టెట్‌’ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు?
ఈ రోజు ఉదయం ఆదిమూర్తిపురం దాటాక మహిళా కూలీలు కలిశారు. వాళ్లల్లో మస్తాన్‌బీ అనే కూలీ.. గుండె గొంతుకలోంచి తన్నుకొస్తున్న బాధను నా ముందుంచింది. భర్త చనిపోయి మూడేళ్లయిందట. ముగ్గురు పిల్లలను తన రెక్కల కష్టంతో పోషిస్తోందట. పొద్దంతా కష్టపడితే వచ్చే కూలి రూ.150 యేనట. ఎలా బతకాలయ్యా.. అంటూ బావురుమంది. పింఛన్‌ అయినా ఇస్తారేమోనని అధికారులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయానని చెప్పింది.

ఇలాంటి కన్నీటి గాథనే బీబీజాన్‌ అనే మరో అక్కా చెప్పింది. ఆమె భర్త కూడా చనిపోయాడట. తాగుడుకు బానిసైన ఆమె ఇద్దరు కొడుకులూ భార్యలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వరట. ‘ఏంటీ పాపం’ అని అడిగితే.. ఎముకలిరిగే వరకూ కొడుతున్నారని నిస్సహాయంగా చెప్పుకొంది. మా జీవితాల్లో ఈ మద్యం చిచ్చు రేపుతోందని పుట్టెడు దుఃఖంతో చెప్పింది. ఊరూరా అక్కచెల్లెమ్మల కన్నీరు ఏరులై పారుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం నిజంగా విచారకరం. తమ ఈతిబాధలకు మనందరి ప్రభుత్వంలో తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం అక్కచెల్లెమ్మల్లో కనిపిస్తోంది.

కొండాపురం గ్రామంలో పద్మజ అనే చెల్లెమ్మ కలిసింది. ఆమె టెట్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతోందట. ‘సార్‌.. ఈ పరీక్ష విధానమే బాగాలేదు. ఆన్‌లైన్‌ పద్ధతిలో ఎగ్జామ్‌ అన్నారు. పల్లెటూరి వాళ్లం.. దానికెలా ప్రిపేర్‌ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. పరీక్ష నిర్వహణ ఓ ప్రయివేటు సంస్థకి ఇచ్చారట. నాకిప్పుడు ఎగ్జామ్‌ సెంటర్‌ ఈ జిల్లాలో కాకుండా ఎక్కడో తిరువూరులో వేశారు. అదెక్కడుందో కూడా నాకు తెలీదు. ఈ పరీక్ష ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా గందరగోళమే. మాలో చాలామందికి ఆన్‌లైన్‌ విధానం అలవాటు లేదు. అందరికీ ఒకే ప్రశ్నాపత్రం కాదట.. కొందరికి సులభమైన, మరికొందరికి కష్టతరమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మార్కుల్ని డీఎస్సీలో 20 శాతం కలుపుతారట. భయంగా ఉంది.. అంటూ టెట్‌ కష్టాల్ని ఏకరవుపెట్టింది.

ప్రతి జిల్లా నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరాల తరబడి టెట్‌ ఎగ్జామ్‌ పెట్టింది లేదు. తీరా ఇప్పుడు పెడుతున్నారనుకుంటే.. అది పూర్తి గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. అడ్డగోలు నిర్ణయాల వల్ల అభాసుపాలవుతోంది. పరీక్ష నిర్వహణ కాంట్రాక్టు ఇచ్చిన ప్రయివేటు సంస్థకు ఆ సామర్థ్యం, అనుభవం ఉన్నాయా.. లేదా.. అని ఆలోచించాల్సిన అవసరం లేదా? కావాల్సినవాళ్లకో, కాసులకు కక్కుర్తిపడో ఎవరికి పడితే వారికి కాంట్రాక్టు ఇచ్చేస్తే.. ఇన్ని లక్షల మంది పడే ఇబ్బందికి ఏమని సమాధానం చెబుతారు? అసలు ప్రయివేటు వాళ్లకు కాంట్రాక్టు ఇవ్వడం సమంజసమేనా?

లక్షల మంది రాసే పరీక్షలో ఆన్‌లైన్‌ వంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి కావాల్సిన ముందస్తు కసరత్తు చేయాలి కదా? అభ్యర్థులకు విస్తృతమైన అవగాహన కల్పించి వారిలోని అపోహలను, భయాందోళనలను తొలగించాల్సిన అవసరం లేదా? అందరికీ ఒకే ప్రశ్నాపత్రం ఇవ్వకపోతే.. సమన్యాయం జరుగుతుందని ఆశించగలమా? నాలుగున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్న పరీక్ష నిర్వహణలో పకడ్బందీ ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? ఏ జిల్లా వారికి ఆ జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించకుండా, ఆ మూల నుంచి ఈ మూలకు విసిరేసినట్లుగా వందల మైళ్ల దూరంలో సెంటర్లు కేటాయించారట. పొరుగు రాష్ట్రాల్లో సైతం సెంటర్లు వేశారట.

పరీక్ష రాసేవారికి.. ముఖ్యంగా మహిళలకు, దివ్యాంగులకు ఎంత ఇబ్బందో కనీస ఆలోచనన్నా చేయరా? ఈ పరీక్ష కోసం కోట్లాది రూపాయలు ఫీజులుగా వసూలు చేసి, పరీక్ష నిర్వహణలో సరైన ఏర్పాట్లు చేయకుండా గందరగోళం సృష్టించడం సిగ్గుచేటైన విషయం కాదా? కొన్ని లక్షల మంది జీవితాలకు సంబంధించిన పరీక్ష ఇంత లోపభూయిష్టంగా జరపబూనుకోవడం రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కాదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement