తెలుగు లో సైన్సు ఫిక్షన్ రచనలు

తెలుగు లో సైన్సు ఫిక్షన్ రచనలు


అభిప్రాయం

 

శాస్త్రాన్ని సామాన్య ప్రజలకి అందించటానికి స్థూలంగా రెండు మార్గాలు ఉన్నాయి. శాస్త్రాన్ని దంతపు మేడల బురుజుల్లోంచి నేలమట్టానికి దింపి, తేలిక భాషలో చెప్పడం ఒక పద్ధతి. దీనినే జనరంజక విజ్ఞానం అంటారు. సైన్స్‌ని ప్రాతిపదికగా తీసుకుని కథలు రాయటం రెండవ పద్ధతి. దీనిని వైజ్ఞానిక కల్పన సాహిత్యం అంటారు. కథలలో శాస్త్రాన్ని జొప్పించి రాయటంలో రెండు మార్గాలు ఉన్నాయి. శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని, శాస్త్రం కుంటుపడకుండా కథ రాయటం. ఉదాహరణకి పరీక్ష నాళికలో పిండోత్పత్తి చేసి, అ సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలు లేనివారికి పిల్లలు పుట్టేలా చేయటమే తీసుకుందాం. దీని వల్ల కొత్త సమస్యలు ఎదురయే అవకాశం ఉంది కదా.  ఉదాహరణకి గర్భాన్ని అద్దెకు ఇవ్వటం. దీని పర్యవసానంగా పుట్టిన  పిల్ల ఎవరిది అనే ప్రశ్న ఉదయించటం. ఈ రకంగా కథ అల్లుకుపోవచ్చు. ఇక్కడ కథలో సంఘటనలు కల్పితాలు కావచ్చు.  కాని, కథలో కనిపించే సైన్స్ కల్పితం కాదు.



సైన్స్ కథలలో మరో రకం ఉన్నాయి. వీటిల్లో శాస్త్రపు పునాదుల లోతు తక్కువ, ఊహలతో విహరించే ఎత్తు ఎక్కువ. ఈ కథాసంపుటంలో అనిల్ రాసిన కథలన్నీ ఈ కోవకి చెందుతాయి. కవిత్వంలో కవి సమయాలలా సైన్సుని సాగదీసి కథ అల్లుతాం. ఈ రకం కథలలో అల్లికకి, కల్పనకి అవధులు లేవు. ఈనాడు కల్పితం అని కొట్టిపారేసినవి రేపు నిజం కావచ్చు. జురాసిక్ పార్కు కథ ఈ కోవకి చెందుతుంది. కానీ, భూతంలోకీ, భవిష్యత్తులోకీ ప్రయాణం చేసినట్లు రాసిన కథలు మూడొంతుల ముప్పాతిక అసంభవం.



పైన ఉదహరించిన ధోరణిలో తెలుగులో కథలు రాసేవాళ్లు బహు తక్కువ- అని చాలా రోజులు అనుకునేవాడిని. పదహారో శతాబ్దంలో పింగళి సూరన్న రాసిన కళాపూర్ణోదయం(తెలుగులో మొదటి నవల! )లో కలభాషిణి ఉయ్యాల ఊగుతూ ఉంటే నలకూబరుడు విమానంలోంచి చూసి కిందకి దిగి వస్తాడు. ఈ కథలో విమానం కనిపించినంత మాత్రాన దీనిని వైజ్ఞానిక కల్పన అనగలమా? విమానాలున్నంత మాత్రాన కథ ‘సైన్సు ఫిక్షన్’ అనుకుంటే రామాయణం కూడ సైన్సు ఫిక్షనే. రామాయణంలో ఒక్క పుష్పక విమానం ఉండటమే కాదు, మరో అసక్తికరమైన వైజ్ఞానిక కల్పన ఉంది. రావణుడి రక్తం నేల మీద పడితే ప్రతి బొట్టు మరొక రావణుడిగా అవతరిస్తాడని విభీషణుడు రాముడిని హెచ్చరిస్తాడు. జురాసిక్ పార్కు సంభవం అయిన రోజున రావణుడి రక్తపుబొట్టు నుండి మరొక రావణుడు పుట్టటం కూడా సంభవం ఎందుకు కాకూడదు?



మహాభారతంలో కౌరవులంతా నాళికా శిశువులే కదా. కనుక భారతం కూడా వైజ్ఞానిక కల్పన- లేదా వై-కల్పన కోవలోకే వస్తుంది. మన పురాణాలలో దేవుడు ప్రత్యక్షం అవటం అనే సన్నివేశానికీ, స్టార్‌ట్రెక్‌లో ‘బీం మి అప్ స్కాటీ’ సన్నివేశానికీ పోలికలు లేవూ? కనుక ఒక విధంగా మన పురాణ గాథలలో వైకల్పనలు లేకపోలేదు. మూడు కళ్లు, నాలుగు తలకాయలు, ఆరు చేతులు ఉన్న వ్యక్తులు కల్పన కాక మరేమిటి? మరో లోకం నుండి వచ్చిన మేనకని విశ్వామిత్రుడు పెళ్లి చేసుకోకపోతే మనం అంతా ఇక్కడ ఉండే వాళ్లమా?  మనం అంతా భూలోకులకీ, మరో లోకులకీ పుట్టిన సంకర సంతానమే కదా.



ఇరవయ్యవ శతాబ్దంలో, కొత్త పోకడలతో తెలుగులో వైకల్పనలు రాసిన వాళ్లు లేకపోలేదు: టేకుమళ్ల రాజగోపాలరావు ‘విహంగయానం’ నవలలో నాయిక ఒక జలాంతర్గామిలో ప్రయాణం చేస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘హాహాహూహూ’లో ఒక గంధర్వుడు దివి నుండి భువికి దిగివచ్చి లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లో తారసపడతాడు. ఇదొక రకం కాలయానం. రావూరి భరద్వాజ  ‘చంద్రమండల యాత్ర’ రోదసి యానం  చిరుత ప్రాయంలో ఉన్నపుడు రాసిన నవల. చంద్రమండలానికి రోజూ పొద్దున్నే లండన్‌కి వెళ్లొచ్చినట్లు వెళ్లొస్తున్నాం కనుక ఈ కథని వై- కల్పన కోవలోంచి తీసెయ్యవచ్చు. బొల్లిముంత నాగేశ్వరరావు ‘గ్రహాంతర యాత్రికులు’లో మరో లోకం నుండి పర్యాటకులు భూలోకం వచ్చి ఇక్కడ మన వారిలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలు  చూసి చాలా అసహజంగా ఉందే అని ఆశ్చర్యపోతారు. ఇది కచ్చితంగా వై- కల్పనే. కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన ‘ఒకే రక్తం, ఒకే మనుష్యులు’ దిట్టంగా ఉన్న సైన్స్‌ని ప్రాతిపదికగా తీసుకుని రాసిన నవలే అయినప్పటికీ అక్కడక్కడ వై- కల్పన ఛాయలు కనిపిస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు ఈ కోవకి చెందిన కథ ఒకే ఒకటి రాసేరని ఆయన కుమారుడు రోహిణీ ప్రసాద్ నాతో చెప్పేరు. ఆ కథ - గ్రహశకలం - నిజానికి సైన్సు ఫిక్షన్ కాదనిన్నీ, అది కేవలం ‘పొలిటికల్ ఎలిగొరీ’ అనీ రోహిణీప్రసాద్ అభిప్రాయపడ్డారు. యండమూరి వీరేంద్రనాథ్ ‘యుగాంతం’లో ఒక గ్రహశకలం వచ్చి భూమిని గుద్దుకుంటుంది. మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘నత్తలొస్తున్నాయి, జాగ్రత్త!’ పేలవమైన వై-కల్పనకి ఒక ఉదాహరణ. వీరేంద్రనాథ్, వేంకటకృష్ణమూర్తి జనాదరణ పొందిన నవలలు ఎన్నో రాసేరు కాని వీరికి పేరు తెచ్చిపెట్టినది వీరి సైన్సు ఫిక్షన్ రచనలు కావు.



రెంటాల నాగేశ్వరరావు ‘స్త్రీ లోకం’ కథలో తల్లి తండ్రిగా మారిపోతుంది (మారిపోతాడు అనాలా?). చిత్తర్వు మధు ఈ మధ్య ప్రచురించిన కుజుడి కోసం, ఎపిడమిక్ అనేవి పేరుని బట్టి వైకల్పనలలాగే ఉన్నాయి. పదిహేనేళ్ల క్రితం రమేష్‌చంద్ర మహర్షి రాసిన ‘పేరడైజ్’ స్వాతి మాసపత్రికలో వచ్చిందిట. ఇది కూడ వై-కల్పన కథే అని అంటున్నారు. మన్నె సత్యనారాయణ రాసిన ‘కాలంలో ప్రయాణం’ రాష్ట్ర స్థాయి నవలల పోటీలో 20,000 రూపాయలు గెలుచుకొందిట. ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహినిగా ప్రచురించబడింది కూడా!

 ఈ మధ్య వైకల్పన కథల వినీలాకాశంలో ఒక కొత్త తార  వెలుగొందుతోంది. ఇంతవరకు పైన పేర్కొన్న వారంతా వైకల్పన బాణీలో ఒక కథో, ఒక నవలో రాసి ఊరుకున్నారు కాని అనిల్ రాయల్ ఈ క్షేత్రాన్ని ఒక కృషీవలుడిలా దున్నడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సాహిత్యరంగం మీద వైకల్పనలకి ఒక స్థానం లభించాలంటే ఇలా ఈ రంగంలో నాలుగు కోణాల నుండి రకరకాల కథలు రాసేవారు ఇంకా రావాలి. (‘నాగరికథ’ కథాసంకలనానికి రాసిన ముందుమాట నుంచి...)

 

రామాయణంలో ఒక్క పుష్పక విమానం ఉండటమే కాదు, మరో అసక్తికరమైన వైజ్ఞానిక కల్పన ఉంది. రావణుడి రక్తం నేల మీద పడితే ప్రతి బొట్టు మరొక రావణుడిగా అవతరిస్తాడని విభీషణుడు రాముడిని హెచ్చరిస్తాడు. జురాసిక్ పార్కు సంభవం అయిన రోజున రావణుడి రక్తపుబొట్టు నుండి మరొక రావణుడు పుట్టటం కూడా సంభవం ఎందుకు కాకూడదు?

 

వేమూరి వేంకటేశ్వరరావు

rvemuri@ucdavis.edu

 

 

 

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top