
నగరంలో ట్రెండ్స్ వేగంగా మారిపోతున్నాయి. ప్రజల జీవనశైలితో పాటు ఆలోచనా విధానం, సమాచారాన్ని స్వీకరించే పద్ధతుల్లో సైతం కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. రీల్స్ మాదిరిగా వార్తలు కూడా వినోదంగా మారుతున్నాయి. తాజా ఉదాహరణగా కొన్ని వినూత్న తెలుగు వెబ్ అప్లికేషన్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
ఇది సాధారణ న్యూస్ పోర్టల్‌లా కాకుండా పూర్తిగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత తెలుగు వెబ్‌సైట్, వార్తలను కథలుగా మార్చే విశేష వేదికలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా వార్తలు మనకు పాఠ్యరూపంలో, ఫొటోలు లేదా వీడియోలతో వస్తాయి. కానీ ఈ కొత్త అప్లికేషన్‌లో రీల్స్ (వీటినే కొందరు ట్రీల్స్ అని అంటున్నారు) రూపంలో అందుతాయి. నిజమైన సంఘటనలు, నిజంగా ఆ బాధను అనుభవించినవారి స్వరంలోనే, చిన్న భావోద్వేగ కథలుగా అందిస్తున్నారు. ఇవి ఒకవైపు సినిమా ట్రైలర్స్‌ని తలపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫారమ్, సోషల్ మీడియా స్క్రోల్ అనుభూతినీ అందిస్తున్నాయి.
భావాలను పంచేలా..
ఒక రీల్‌లో ఒక ప్రభుత్వ అధికారి తానే కథానాయకుడవుతాడు. ఎప్పుడో అనుమతి లభించిన ప్రాజెక్ట్ కాగితం మీదే మిగిలిపోతుంది. అలా ఎందుకు జరిగిందో తన అనుభవాన్ని మనముందు ప్రదర్శిస్తాడు. మరో రీల్‌లో మహిళ తన బాధను మాటల్లో కాకుండా ముఖ కవళికలతో తన నిస్సహాయను తెలియజేస్తుంది.
అనేక అనేక రంగాలు, అనేక సంఘటనలను రీల్స్, వార్తలు, సమాచారం, కథల రూపంలో ఏఐ ద్వారా తెలియజెప్పడం ప్రస్తుతం ట్రెండ్. ఇవన్నీ 24 గంటల్లోపే ఏఐ సాయంతో సిద్ధం చేయడం ఇందులోని ప్రత్యేకత. రీల్స్, షార్ట్స్, పాడ్‌కాస్ట్ వంటివి కొత్త అలవాట్లుగా మారాయి. ఇలాంటి సమయంలో ఈ కొత్త ఫార్మాట్ స్థానిక భాషలో ప్రజలకు చేరుతోంది.
తెలుగులోనూ వినూత్నంగా..
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వివిధ రకాల వేదికలు రూపుదాల్చుతున్నాయి. ఇలాంటి వేదికలు నగరంలో వేళ్లూనుకుంటున్నాయి. ప్రపంచంలో తొలి పూర్తిస్థాయి యాంత్రిక మేధస్సుతో (కృత్రిమ మేధస్సు) పనిచేసే తెలుగు వెబ్ అప్లికేషన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో టైమ్ కృష్ణ అనే వెబ్‌సైట్లో కొత్త వేదిక మెల్లిగా వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ చానళ్లలో చక్కర్లు కొడుతోంది.
ఇది వార్తలా కాకుండా సినిమాను తలపిస్తుంది. మొబైల్‌లో స్క్రోల్ చేసే సామాజిక మాధ్యమాల అనుభూతి ఇస్తుంది. సాధారణ వార్తా సైట్‌లా కాకుండా భావోద్వేగాలతో నిండిన చిట్టి కథలుగా ‘సత్య రీల్స్’గా మారుతున్నాయి. ఇలాంటి తెలుగు వేదికలు దేశమంతటా ప్రజలే స్వయంగా తమ కథలను పది భారతీయ భాషల్లో రూపొందించుకునే అవకాశం కల్పించబోతోంది.
4 శాతం నుంచి 21 శాతానికి...
టైమ్స్ ట్రెండ్ నివేదిక ప్రకారం.. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారుల్లో 1999 నాటికి 4% నుంచి 2019 వచ్చేసరికి 21% నికి మయోపియా పెరిగింది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే, విద్య, ఏకాగ్రత ఇతర భావోద్వేగ స్థితిగతులను కూడా ప్రభావితం చేసేలా పెరుగుదల ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
రాజ్‌కోట్‌లో, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగం నిర్వహించిన సర్వేలో, 10 ఏళ్లలోపు పిల్లల్లో 81% మంది భోజన సమయంలో క్రమం తప్పకుండా స్క్రీన్‌లను ఉపయోగిస్తున్నారని, ఎక్కువగా కార్టూన్ చూడటానికి ఉపయోగిస్తున్నారని తేలింది. తినడం, నేర్చుకోవడం, నిద్రపోవడం వంటి దినచర్యలో డిజిటల్ పరికరాలు ఎలా చొచ్చుకుపోయాయో ఈ అధ్యయనం వెల్లడిస్తోంది.