కప్పురపు కొప్పరమ్మిది..!
అనిర్వచనీయమైన ప్రతిభా సమున్మేషులై కొప్పరపు కవులు పలికించిన ప్రతి పదమూ, దివ్యసౌగంధ్యాన్ని వెదజల్లుతూ ఆ సుగంధాన్ని పంచిన ‘‘కప్పురపు కొప్పరమ్మిది’’. నాటికీ నేటికీ చెదిరిపోని భావపరీమళాల అబ్బురమ్మిది.
అనిర్వచనీయమైన ప్రతిభా సమున్మేషులై కొప్పరపు కవులు పలికించిన ప్రతి పదమూ, దివ్యసౌగంధ్యాన్ని వెదజల్లుతూ ఆ సుగంధాన్ని పంచిన ‘‘కప్పురపు కొప్పరమ్మిది’’. నాటికీ నేటికీ చెదిరిపోని భావపరీమళాల అబ్బురమ్మిది.
అక్షరాలుగా అచ్చొత్తి, కళ్ల ముందు ప్రత్యక్షంగా ఉన్న పద్యాలనే పఠించలేనంత వేగంగా, అప్పటికప్పుడే పద్యా లల్లి పంచడమెలా సాధ్యం అనుకునే సమస్తలోకాన్ని విస్తు పోయేలా చేసిన ధన్యజీవులు, ధీమాన్య జీవులు కొప్పరపు సోదరులు. గంటకు మూడు వందలా, నాలుగు వందలా, ఐదువందలా.. వాయు వేగంతో ఆశువుగా ప్రభవించే పద్యాల సంఖ్యను, లెక్క గట్టగలిగే యంత్రసామగ్రి కూడా లేనిరోజుల్లో, సాహితీ లోకంలో సంచలనాలు సృష్టించిన జంట కొప్పరపు సోదరకవుల జంట. అవధాన విద్యను ఊరూరా ఊరే గించి తిరుపతి వేంకట కవులు సరస్వతీ సమార్చనం చేస్తే, ఆశు కవితా ఝంఝానిలాన్ని ప్రసరింపజేసి, తెలుగునాట ఊరూవాడలను ఉర్రూతలూగించారు.
జంటకవుల కవిత్వం తెలుగు సాహితికి కొత్తకాకపో యినా, సోదర కవులన్న ఖ్యాతి కొప్పరపు కవులకే దక్కింది. వేంకట రాయలు, సుబ్బమాం బలకు కలిగిన ఆరుగురు సంతానంలో అగ్రజులు వేంకట సుబ్బారాయ శర్మ, వారికి అను జులు వేంకటరమణశర్మ. ఎని మిదేళ్ల ప్రాయానికే ‘హనుమత్ కవచరూప నక్షత్రమాల’గా 27 పద్యాలు చెప్పి, సుబ్బరాయశర్మ ఆనాటి పండిత లోకా నికి ఆశ్చర్యం కలిగించారు.
ఈ జంటకవులు 1905 నుండి 1927 వరకు 22 ఏళ్లపాటు అవధానాలు, ఆశుకవిత్వం దిగ్విజయంగా నడిపించారు. రాజధాని నగరంతో మొదలు పెట్టి పల్లె టూళ్ల వరకూ కవితా జైత్రయాత్రను సాగించారు. కొప్పరపు కవులు ప్రదర్శనలు నెరపిన అసాధారణ కవితా వేదికలపైన దిగ్గజాలవంటి పండితవరులు పాల్గొనేవారు. కావ్యకంఠ గణపతిముని, వావికొలను సుబ్బారావు, శతఘంటము వెంకటరంగాశాస్త్రి, చెన్నా ప్రగడ భానుమూర్తి, ముదిగొండ నాగలింగశాస్త్రి, వేదం వేంకటరాయశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, వసురాయ కవీంద్రుడు, జయంతి రామయ్య పంతులు, కొక్కొండ, కొమర్రాజు లక్ష్మణరావు.. వంటి ధీమాన్యులు కొప్పరపు కవుల అవధానాలలో, ఆశుకవితా ప్రదర్శనలలో ప్రత్య క్షంగా పాల్గొని, ఆ అద్భుతాల్ని కనులారా వీక్షించిన వారే.
ఒకే రోజున రెండు శతావధానాలు నిర్వహించిన ఘనత కొప్పరపు కవులదే. అవధానాలలో కూడా, కొప్పరపు కవుల ప్రతిభ అప్రతిహతమై విరాజిల్లింది. శతావధానమంటే, వంద మంది పృచ్ఛకులతోనే తప్ప, నలభైమందికో, యాభై మందికో ఒకటికి మించి అంశాలిచ్చి సరిపెట్టిన సంద ర్భాలు లేవు. వారిది అసాధారణ ధారణ. 7, 47, 11, 28, 52 ఇలా క్రమం పాటించని పద్ధతిలో పృచ్ఛకులకు పద్యాలు ఒప్పచెప్పి, తరువాత వరుస క్రమంలో పద్యా లన్నింటినీ సంపూర్ణంగా ధారణ చెయ్యడం, ఇటువం టివి, ఈ జంట కవుల అవధానాలలో అనన్య సామాన్య మైన విశేషాలు. వీరు అవధాన వేదికలమీద పద్యాలే తప్ప, వచనంలో మాట్లాడే సందర్భం ఉండేది కాదు. దాని నొక నియమంగా పాటించారు. సమస్యా పూర ణంలోగానీ, దత్తపదిలోగానీ, వర్ణనలోగానీ, ఈ జంట కవుల ధోరణి అనితర సాధ్యం. ప్రతి పద్యం రసోచితం.
ఈ జంటకవుల రచనలనేకం. దైవ సంకల్పం, కుశ-లవ, (సాధ్వీ మహాత్మ్యం), మనుచరిత్ర, శ్రీకృష్ణ కరుణా ప్రభావ ము, అభిమన్యు వధ, కంస వధ, దీక్షిత స్తోత్రము ఇలాంటి రచ నలెన్నో చేశారు. దైవ సంకల్పం ఈ కవుల కల్పిత ప్రబంధం. ఇది వీరి తొలినాళ్ల రచన. కథ అతి సామాన్యం. కొప్పరం నుంచి బయలుదేరి, ఏలూరు వెళ్లి తిరిగి కొప్పరం రావడమే కథ. కానీ ఆయా ప్రాంతాల వర్ణనలతో ఇదొక అపురూప ప్రబంధమైంది.
ఆశుకవిత్వం మనకేమీ కొత్తది కాదు. అయితే, అనిల వేగంతో పద్యాలు చెప్పడం, కొప్పరపు కవులకు ముందుగానీ, తర్వాత గానీ లేదు. ఆ ఘనత వీరికి మాత్రమే దక్కింది. 1916 నాటికే ఈ కవులు నిర్వహించిన కవిత్వ ప్రదర్శనలు 150కి పైబ డ్డాయట. ఇక పుంఖానుపుంఖా లుగా పుట్టిన పద్యాలు లెక్కగట్టగలిగితే మూడు లక్షలకు పైమాటేనని రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహు ద్దూర్ వారు అన్నమాట. ఇంతటి కవితా విస్మృతిని అంచనా కట్టేదెలా?
కొప్పరపు కవుల కళాపీఠం పేరుతో ఒక సంస్థ 2002, సెప్టెంబర్ 9వ తేదీన విశాఖపట్నంలో ఆవిర్భ వించింది. ఆనాటి నుంచీ, కొప్పరపు కవుల రచలల్ని ప్రచురించి, అందుబాటులోకి తెస్తోంది. అలాగే ప్రతి వసంతం ఒక ప్రముఖ వ్యక్తిని ఎంచుకొని, ఆయా రంగాల్లో వారు సాధించిన ఘనతకు గుర్తింపుగా కొప్ప రపు కవుల ప్రతిభా పురస్కారాన్ని అందిస్తున్నారు. గతంలో పీసపాటి నరసింహమూర్తి, వేటూరి సుందర్రా మ్మూర్తి, బేతవోలు రామబ్రహ్మం, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, గరికపాటి నరసింహారావు, కె.విశ్వనాథ్, నేదునూరి కృష్ణమూర్తి, హరిప్రసాద్ చౌరాసియా వంటి దిగ్ధంతులను ఈ జాతీయ పురస్కారంతో సత్కరిం చారు.
(నేడు విశాఖపట్నంలో డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మకు కొప్పరపు కవుల జాతీయ పురస్కారం అందిస్తున్న సందర్భంగా)
డా॥వోలేటి పార్వతీశం
వ్యాసకర్త దూరదర్శన్ మాజీ ప్రయోక్త
మొబైల్ : 9440031213


