కొత్త పుస్తకాలు
నిజామాబాదు జిల్లా కవిత్వం
రచన: డాక్టర్ వి.శంకర్; పేజీలు: 240; వెల: 150; ప్రచురణ: తెలంగాణ రచయితల సంఘం; ప్రతులకు: హిరణ్మయి, 4–15, దేవీవిహార్ కాలనీ, దేవునిపల్లి, కామారెడ్డి. ఫోన్: 9440798954
‘తెలంగాణ మీద అభిమానంతో స్థానికాంశాలపైనే పరిశోధన చేయాలన్న సంకల్పంతో’ రచయిత 2001లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తిచేసిన పీహెచ్‌డీ పరిశోధన ఆధారంగా రూపొందించిన పుస్తకం ఇది. అందంగా ముద్రించిన ఈ పుస్తకం ‘అవటానికి జిల్లా కవిత్వ చరిత్ర అయినప్పటికీ తెలంగాణ అవసరాల రీత్యా ఎంతో ప్రాధాన్యత ఉన్న పుస్తకం’. ‘తెలంగాణ కేంద్రంగా జరుగబోయే సాహిత్య పరిశోధనలకు, రచనలకు ఈ పుస్తకం మార్గదర్శనం చేస్తది’.
కడలి కల్లోలం
నవలారచన: గనారా; పేజీలు: 176; వెల: 125; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27–1–54, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ–2; ఫోన్: 0866–2577533
‘భైరవపల్లెకు, నిగర్‌డెల్టాకు భౌగోళికంగా తప్ప మరి ఏ తేడాలున్నాయి! మనుషులను, మానవ సమూహాలను డిస్పోజ్ చేస్తున్న పెట్టుబడుల భాషకు ఏ తేడాలున్నాయి! ఎక్కడి ప్రజా పోరాటపు భాషలోనైనా తేడాలు మాత్రం ఏముంటాయి? ఈ రచన విభిన్నమైనది. ఎందుకంటే అభివృద్ధి రాజకీయాలను వాటి పర్యవసానాలను వీలయినంత వాస్తవికంగా, జీవితానికి సన్నిహితంగా చిత్రించి చూపింది’.
స్వర్ణపుష్పాలు
రచన: అలపర్తి వెంకట సుబ్బారావు; పేజీలు: 64; వెల: 35; ప్రచురణ: మంచిపుస్తకం, 12–13–439, వీధి నం.1, తార్నాక, సికింద్రాబాద్–17; ఫోన్: 9490746614
‘‘ఏం పాపా! ఏమౌతావు/ ఎంచక్కా పెద్దయ్యాక?/ పంతులమ్మ అవుతావా?/ పాఠాలు నేర్పుతావా?/’’... ‘‘అమ్మను అవుతా,’’ అంది/ ఆ పాప ముచ్చటగా!! ఆ పాప హృదయంలో/ అమ్మబొమ్మ నిలిచింది!/ అందుకనే పాప/ ‘అమ్మను అవుతా’ అంది!!’. ఇలా చిన్న చిన్న పదాల్లో చెప్పిన బాల గేయ కథమాల ఇది. దీనికి బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
లొంగిన ప్రతిసారీ
కవి: పచ్చల కిరణ్‌కుమార్; పేజీలు: 94; వెల: 50; ప్రచురణ: విరసం; ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో.
‘ఇందులో స్థూలంగా మూడు రకాల కవిత్వం ఉన్నది. సహజంగా బతుకును, బతుకు పోరాటాన్నీ ప్రేమించే కవి గనుక అటువంటి బతుకు బతికిన అమరుల మీద, అమరత్వం మీద కవితలున్నాయి. సమస్యల మీద, సంఘటనల మీద తన స్పందనలూ, పరిశీలనలూ ఉన్నాయి. ఇంక మూడో రకం కవిత్వం ఆయన వయసునూ, అనుభవాన్ని మించిన తాత్విక అవగాహనని అందించే పరిశీలనలూ వ్యాఖ్యల రూపంలో ఉన్నాయి’.