మేస్టారూ... మిస్సింగ్ యూ...

మేస్టారూ... మిస్సింగ్ యూ...


ఆత్మీయుడి పలుకు

 

చేకూరి రామారావు... చేరా... మేస్టారు.... తెలుగు సాహితీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా పలికే ఆ పేరు భౌతికంగా వీడ్కోలు తీసుకుంది. తెలుగు మాటకు, వాక్యానికి, కవిత్వానికి ఎనలేని సేవ చేసిన ఆ అవిశ్రాంతమూర్తి విశ్రాంతికి మబ్బుల దొంతరల్లోకి తరలి వెళ్లింది. పాత మార్గానికో బలం, కొత్తదారికో ధైర్యం, యువ గొంతుకకు మద్దతు, నవ భావధారకు తోడ్పాటు... ఇవన్నీ చాలా నిరాడంబరంగా దృఢంగా చేసిన గురుతుల్యులు చేరా. ఆయనను తలచుకోవడం సగర్వంగా జరిగే పనే. కాని మంచి రచన చేయడమే ఆయన పట్ల చూపగల అసలైన కృతజ్ఞత. భాషకు సంబంధించి గట్టి ప్రయత్నం చేయడమే ఆయనకు సమర్పించగల నిజమైన నివాళి.

 

స్మృతి కిణాంకం అంటే? సాహిత్య కిర్మీరం అనగా? సాహిత్య వ్యాస రింఛోళి- ఇది తెలుగా పాళీ భాషా ఫ్రెంచా? అని ఇంటలెక్చువల్ క్యూరియాసిటీతో రగిలిపోడం కాదు. చదువులేక, చదువు రాక అడగడం. అది కూడా ఆ పుస్తకాలకి అట్ట మీద బొమ్మలెయ్యాలి గనక. అయినా చేరా మేస్టారు చీప్‌గా చూసేవాడు కాదు. ఓపిగ్గా అర్థాలు వివరాలు చెప్పేవాడు.



విశాలాంధ్ర ఎడిటర్ రాఘవాచారిగారి జోకొకటుంది. మనిషికి ఒకటే ఆప్షన్. చదవడమో లేక రాయడమో. చదువెలాగూ లేదు గనక రాయక తప్పేదేముంది మరి. ఇది మనలాంటి టాలా టోలీ జర్నోలితరతి వ్యవహారం. కానీ మేస్టారి సంగతి అలా కాదు. ఎంతగానో చదివి అంతగానూ రాశాడు. ఆయనకున్న ఆప్షన్ అదీ.

 

చేరాతలు పుస్తకానికి నండూరి రామ్మోహనరావుగారు ముందుమాట రాశారు. 1980-90ల కాలం తెలుగు వచన కవితకు స్వర్ణయుగమన్నారు. అప్పుడు మాకా విషయం తెలీదు. కాని అప్పుడు మేం అనుభవించింది వేరే స్వర్ణయుగం అని కూడా తెలియదు. ఇప్పుడనిపిస్తోంది. ఆ రోజులూ మనుషులూ... కబుర్లూ... వారితో బాతాఖానీలూ...

 

ఉదయం డైలీ జోరు. సాయంత్రమైతే వరవరరావుగారొచ్చి చౌరాస్తాలో పేవ్‌మెంట్ మీద ఒంటరి టీకొట్టు బయట బండరాయి మీద కూచునేవాడు. పనులు వదిలి పరిగెత్తుకుంటూ వెళ్తే కబుర్లు. సాయంత్రం చేరా. రామ్‌నగర్ మురికి ఫ్లాట్‌లో పిల్ల కవి రూమ్‌లో చేరేవాళ్లం. కిరసనాయిల్ స్టౌ మీద ఖాదర్ బిరియానీ వంట. ప్రిలిమ్స్‌లో పక్కన త్రిపురనేని శ్రీనివాసూ, గుడిహాళం రఘునాథంలాంటి మందంతా జేరి ఉద్రేకపడిపోయీ ఊగిపోయీ ఆ రాతకోతలేంటి ఆ ముష్టి కవిత్వంలో ఏదో ఎక్కడో ఉందంటూ పొగడ్తలేంటీ అంటూ చేరా మీద ముక్కుల్లోంచీ చెవుల్లోంచీ నిప్పులు కురిపించేవారు. ఆడపిల్ల రాసిందంటే అద్భుతమనేడమేనా? వెనకా ముందూ లేదా? కవిత్వమనేదొకటుంటుంది గదా అని ఆయన్ని కైమా కొట్టేవారు. చిన్నగా నవ్వేవాడు. ‘కోపం బెరుంగడు’. తాపీగా తన పాయింట్ చెప్పేవాడు. చాలా రీజనబుల్‌గా ఉండేది. అయినా సరే ‘వుయ్ డిఫర్ విత్ యు’ అని ఠలాయించేవాళ్లు. ‘ఐ బెగ్ యు డిఫర్ విత్ మీ’ అని నవ్వేవాడు. అందరూ ఆయన్ని కమ్యూనిస్టంటారుగాని నిజంగా ఆయన లిబరల్ డెమోక్రాట్ నిజమైన రిపబ్లికన్ అనిపిస్తుంది. లేపోతే మంచి యాంటీ కమ్యూనిస్టులైన నండూరిలాంటి వారు ఆయన్ని అంతగా ప్రేమించరు.http://img.sakshi.net/images/cms/2014-07/41406312328_Unknown.jpg



మళ్లీ ఆ కాలం గురించి. ఆకుచెప్పులేసుకుని, చెరిగిన జుబ్బా, చంకలో వ్యాసాల కట్ట పెట్టుకుని బాలగోపాల్ వచ్చేవాడు. పలకరించడానికి ఎన్ని కితకితలు పెట్టినా అన్నీ మోనో సిలబుల్స్‌లోనే సమాధానాలు. పలుకే బంగారం. సాయంత్రం క్రాస్‌రోడ్స్‌లో రెగ్యులర్ జాయింట్‌కి పతంజలీ, శివాజీ, దేవీప్రియ, నేనూ విఫలమైన కవి సబ్ ఎడిటర్లూ కలిసి వెళ్తే ఒక క్యూబికల్లో బూదరాజు రాధాకృష్ణ, పక్కన జ్యోతి మంత్లీ ఎడిటర్ గోపీతో హరి పురుషోత్తమరావు అప్పుడప్పుడు స్మైల్‌గారు. ఏవో కొంపలు మునిగిపోయినట్టు ‘ఇప్పుడూ భద్రిరాజు కృష్ణమూర్తి చెప్పిందేమిటి? నోమ్ చామ్‌స్కీ రాసిందానికీ దీనికీ తేడాని ఎలా చూడాలోయ్’ అంటూ చర్చ. స్టాలిన్ భాషాశాస్త్రం గురించి రచ్చ కూడా. క్రాస్‌రోడ్స్ నుంచి కాస్త దూరం జరిగితే రాంభట్ల కృష్ణమూర్తి. ‘ఏం ఫ్రెండూ’ అంటూ బ్రాండెడ్ పలకరింపు. బుల్ ఫిన్స్ మైథాలజీలోనే యుడిపస్ కాంప్లెక్స్ ఉంది. దాన్ని ఫ్రాయిడే కనిపెట్టాడనుకోడం రాంగ్. అస్సీరియా మెసపుటోమియా కల్చర్స్  చూస్తే అసలు సంగతి తెలుస్తుందని నాన్ స్టాప్ లెక్చర్స్. కాసేపయితే గజ్జెల మల్లారెడ్డి. తెలుగునాట భక్తిరసం వట్టికే రాయలేదు అని మొదలెట్టి నాన్‌స్టాప్‌గా జోకులేసి నవ్వించడం.  ఈనాడు పేపర్ నుంచి రాచమల్లు రామచంద్రారెడ్డిగారొస్తే ‘సంవేదన’ నుంచి ‘అనువాద సమస్యల’ వరకూ ఎన్ని ప్రశ్నలు కురిపించినా ముక్తసరే మరి.



క్రాస్‌రోడ్స్‌లో ఏ.ఆర్.క్రిష్ణ ఇంటికి పతంజలీ నేనూ వెళ్తే అక్కడ రావిశాస్త్రితో పార్టీ. చేరాతో పాటూ ఎప్పుడూ వీళ్లందర్నీ కలవడం మామూలు వ్యవహారంగా ఉండేది. పెద్ద విశేషంగా ఫీలయ్యే వాళ్లం కాదు.  చేరా అంటే ఎప్పుడూ కలిసే మనిషే కదా అనిపించేది. స్మృతి కిణాంకానికీ రింఛోలీకీ కవర్ బొమ్మలేయడం, వెనక మాటలు రాయడం రోజువారీ పనిలాగా అనిపించేది. ఆయన ఇంటికెళ్లడం, ఆవిడ అన్నం పెడితే తినడంలో ఏదో గొప్ప కనిపించేది కాదు. ఒకసారి మరో పుస్తకం అట్ట బొమ్మ కోసం వచ్చి ఆయన నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. ఎదురుగా ఉన్న కవిని ఇతను కె.రాజేశ్వరరావు అని పరిచయం చేశాను. విష్ చేశాడు. ఈ పుస్తకం ప్రూఫ్ రీడింగ్ తల నెప్పిగా ఉందన్నాడు. కె.రా. బాగా చూడగలడని చెప్పా. ఓ గంట మా కబుర్ల తర్వాత కె.రా కొన్ని పేజీలు చూపించి ఈ పద్యాల్లో గణ విభజన తప్పిందన్నాడు. ఆయన చూసి వెంటనే నిజమేనన్నాడు. మీరు ఇలా చూడకపోతే అచ్చయి బయటికెళ్తే పరువు పోయేదన్నాడు.



 చాలాకాలం తర్వాత మళ్లీ నా స్టుడియోలో మా మీట్. పాబ్లో నెరూడా దీర్ఘకవితకి  కె.రా. అనువాదానికి బొమ్మలేస్తున్నా. ఏమిటవి అంటే చెప్పా. ముందుమాట కూడా రాస్తున్నానన్నా. వెంటనే ఆయన ‘నాకూ చాన్స్ ఉంటే కొన్ని మాటలు రాస్తా. వీలుంటేనే’ అని ఆఫర్ చేశాడు. నాచన సోముడూ, శ్రీనాథుడూ, మయకోవ్‌స్కీ, నెరుడా అంటూ అందర్నీ అప్ప జెప్పే ధారణ శక్తిగల వాళ్లిక పుట్టరు. అంతా కొత్తతరం వస్తోంది. వీళ్లకీ విషయాలు తెలీవని బెంగపడ్డాడు. తర్వాత రాసిచ్చాడు కూడా. గొప్ప మోడెస్టీ. బోలెడు లిబరలిజం. ఎదుటి అభిప్రాయం ఎంత దుర్మార్గంగా ఉన్నా నిజంగా సహించే భరించే రూసో. మళ్లీ మానవ హక్కులన్నా ఖైదీల విడుదల కోసమైనా కమిటీల్లో ఉండి సభలకొచ్చే కమిట్‌మెంట్. అరుదైన కాంబినేషన్.



ముందు చెప్పిన స్వర్ణయుగం పేర్లలాగే మాష్టారి పేరూ చెప్పుకుంటాం. తెలుగు భాషా, కవిత, వచనం అన్నీ కూడబలుక్కుని ఆయన గురించి బెంగపడతాయి. మేస్టారూ.. మేం కూడా నిజంగా మిస్సింగ్ యూ!

 - మోహన్, ఆర్టిస్ట్, 7702841384

 

ఆయన సంపూర్ణ స్త్రీవాది  బోధకుడి మాట

 

ఆయన మా సహ ప్రయాణికుడు. ఆయన నికార్సైన మా మనిషి. ఆయన సంపూర్ణమైన స్త్రీవాది. ఆయన మా చేరా మాస్టారు. చేకూరి రామారావుగారు తెలుగు సాహితీ ప్రపంచంలో భాషాశాస్త్రమూ సాహిత్యమూ అత్యంత బాగా తెలిసిన అరుదైన ప్రతిభాశాలి. అమెరికాలో పిహెచ్.డి పూర్తి చేసి ఉస్మానియాలో లింగ్విస్టిక్ ప్రొఫెసర్‌గా చేరిన ఆయనకు- నిలువెత్తు ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని ఎంతగానో ఇష్టపడే ఆయనకు- విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలోని లేత గులాబీ రంగు పూలతో మిలమిలలాడే బఠానీ తీగలంటే భలే ఇష్టం. హైదరాబాద్‌లో జరిగే సాహిత్య కార్యక్రమాల్లో తను స్పీకర్ అయినా కాకపోయినా సభకి ఒక శ్రోతగా వచ్చే అతి కొద్దిమంది ప్రముఖ సాహితీకారుల్లో చేరా ఒకరు. ఆయనకి సాహిత్యమంటే అంత ప్రేమ. చేరాతలు కోసం సాహితీ లోకం పాఠకులు చాలా ఆసక్తిగా ఆత్రంగా ఆదివారం రోజు యెదురు చూసేవారు. ఆ వారం యే కవి గురించి రాయబోతున్నారు. యేం రాయబోతున్నారు వారమంతా వొక చర్చ వొక ఊహ పోటీపడి యెదురు చూసేవి. ఆ ఆదివారం ఆ కవికి పండగ. కవిత్వానికి సంబరం. పాఠకులు సాహితీకారులు మెచ్చుకునేవారు. విభేదించేవారు.

విమర్శించేవారు. వారమంతా అలా గడిచేది. అయినా అందరూ మళ్లీ వచ్చే ఆదివారం కోసం యెదురు చూస్తూ ఉండేవారు. మాస్టారి కాలమ్‌కి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. స్త్రీవాద కవిత్వాన్ని మాస్టారు తన కాలమ్‌లో పరిచయం చేసేవారు. విశ్లేషించేవారు. యెన్ని కవితలు రాశావన్నది ప్రాతిపదిక కానే కాదు. యెంత కొత్తగా రాశారు అన్నదే చూసేవారు. కవిత, కథ, నవల, కాలమ్, వ్యాసం యే స్త్రీవాద రచనా ప్రక్రియైనా కావొచ్చు మాస్టారు పూర్తిగా శ్రద్ధగా చదివేవారు. ఆ రచన మీద తన అభిప్రాయాన్ని పత్రికలకి పంపించేవారు. ఆ కాలంలో వో వైపు స్త్రీవాద రచనలని ఖండించేవారుండేవారు. మరోవైపు శాసించేవారుండేవారు. వీరందరికీ యెదురొడ్డి మావైపు నిలుచున్న నిలువెత్తు స్నేహితులు చేరాగారు. సాహిత్యంలో సమకాలీన సమాజానికి ప్రతిస్పందనగా వచ్చిన ప్రతి రూపాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఆ రూపానికి వెనుక ఉన్న శక్తులని సమర్థించుకుంటూ రూపాన్ని తీర్చిదిద్దడానికి దోహదం చేశారు. సాహిత్యంలో కొత్తగా వినపడుతున్న గొంతులలో దేనికి దాన్ని విడివిడిగా చూసి బలపర్చాల్సిన గొంతుకలకి తన గొంతుని కలుపుతూ వచ్చిన భాషా సాహితీ దిగ్గజం చేకూరి రామారావుగారు. మన చేరా మాస్టారు.

 - కుప్పిలి పద్మ, 9866316174

 

ఆయన మాట లేకుండా పాఠం నడవదు



చేరా ఇక లేరన్న వార్త వినగానే గుండె బరువెక్కిపోయింది. ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. మా గురువులు- జి.ఎన్.రెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి గార్లతో చేరాకి మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. జి.ఎన్.రెడ్డి, అడపా రామకృష్ణారావు, చేకూరి రామారావు అమెరికాలో కలసి ఒక గదిలో ఉంటూ చదువుకున్నారట. చేరా గొప్ప స్నేహశీలి అని జి.ఎన్.రెడ్డిగారు అంటూ ఉండేవారు. భాషాశాస్త్రంలోనే కాదు పాకశాస్త్రంలోనూ ఆయన ఉద్దండుడు అని అనేవారు. కేతు విశ్వనాథ రెడ్డి, చేరా, కె.కె.రంగనాథాచార్యులు ఈ ముగ్గురూ సార్వత్రిక విశ్వ విద్యాలయం పాఠ్యాంశాల రూపకల్పనలో ప్రధాన భాగస్వాములు.  సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వారు అందించిన సేవ ‘ఒక నిశ్శబ్ద విప్లవం’ వంటిది. ఇక చేరా, కేతుగార్ల స్నేహ సంబంధాలు మాటల్లో చెప్పేవి కావు. చేరా అభిప్రాయాలను కేతు చాలా గౌరవించేవారు. చేరాని కేతుసార్ చాలా సరదాగా ‘కవీ’ అని పిలిచేవారు. చేరా వెంటనే పలకక పోతే ‘మహా కవీ’ అని రెట్టించేవారు. చేరా మాత్రం ఒక చిరునవ్వు నవ్వి ఊరకుండేవారు. ఎందుకు సార్ అలా పిలుస్తారు అని అడిగితే అది నాకో సరదా అనేవారు కేతు నవ్వుతూ. చేరా ఉపన్యాస ధోరణి ఎంతో బావుంటుంది. చిన్న చిన్న వాక్యాలు స్పష్టంగా సూటిగా ఉంటాయి. ఎంత లోతైన విషయాన్నైనా ఎంత గంభీరమైన విషయాన్నైనా చాలా సాదాసీదాగా చెప్పడం ఆయన విధానం. సటిల్ హ్యూమర్ ఆయన మాటల్లో కనిపించేది. ఒకసారి ఉస్మానియా పునశ్చరణ తరగతుల్లో ఆయన ‘వ్యాకరణం ఎందుకు చదవాలి’ అని ఓ ఉపన్యాసం ఇచ్చారు. క్లాసంతా నవ్వుల పువ్వులే. చేరా అనగానే తెలుగు వాక్యం, చేరాతలు, ఆయన నిరంతర అధ్యయనం, ఆయన భాషా శాస్త్ర వ్యాసాలు, విమర్శ, సాహిత్య వ్యాసాలు ఇలా ఎన్నో ఎన్నో గుర్తుకు వస్తున్నాయి. మాత్రా ఛందస్సు, ముత్యాల సరంపై చేరా వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వచన పద్యం గురించి సంపత్కుమారాతో చేసిన వాదోపవాదాలు, చర్చలు చాలా విలువైనవి. చేరా ప్రస్తావన లేకుండా ఈరోజు ఏ విశ్వ విద్యాలయంలోనూ భాషా బోధన జరగదు. భాషా శాస్త్ర అధ్యయనానికి తన జీవితాన్ని అంకితం చేసినవాడు చేరా.

 - తుమ్మల రామకృష్ణ, 9949055015


 


స్నేహితుడి జ్ఞాపకం -  చేకూరిన నిధి!

 

ఉస్మానియాలో చేకూరి రామారావుకి పెంచికల చిన నరసింహారెడ్డి సీనియర్. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో భాషాశాస్త్ర విభాగం అధిపతిగా పని చేసి ఊరి బాగు కోసం గద్వాల ప్రాంతంలోని ‘గట్టు’ గ్రామంలో అ‘విశ్రాంత’ జీవనం గడుపుతున్నారు. గురువారం రాత్రి ఫోన్ చేశాను. హలో అన్నారు. ‘తెలిసిందా?’ అన్నాను. ఎంతసేపటికీ మారు మాట రాలేదు. ఒక నిశ్చేష్ట! కొంతసేపటికి తన మిత్రుడు చేకూరిని గుర్తు చేసుకున్నారు.



 ‘‘ఉస్మానియాలో లింగ్విస్టిక్ ప్రొఫెసర్‌గా పనిచేసిన గెరాల్డ్ కెల్లీని శాఖాధిపతి భద్రిరాజు కృష్ణమూర్తిగారు  చేరాకు పరిచయం చేశారు. వారిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది.  కెల్లీ స్ఫూర్తి చేరా రచన ‘తెలుగులో నామినీకరణం’లో  ప్రతిఫలిస్తుంది. నోమ్ చామ్‌స్కీ ‘ట్రాన్స్‌ఫర్మేషన్ గ్రామర్’ను తెలుగుకు అన్వయిస్తూ వాక్యనిర్మాణాలను వివరిస్తూ  చేరా పరివర్తనా వ్యాకరణం రాశారు. ‘మాండలీకాలను బట్టి లిఖిత భాషా మారాల్సిందే’ అని పెద్దలతోనూ స్పష్టంగా చెప్పారు. నాటకం, నవల తదితర ప్రక్రియల్లో తెలుగు వెనుకబడిందేమో కాని కవిత్వం విషయంలో ఇతర భాషల కంటే ముందుంది. ఈ పరిణామానికి ముఖ్యకారకుడు చేరా. స్త్రీవాద కవిత్వాన్ని, భిన్న సామాజిక వర్గాల యువ కవులనూ ఆయన ప్రోత్సహించారు. తాను పరిచయం ప్రోత్సహించిన కవుల్లో వారిలో వారికి భిన్నాభిప్రాయాలు ఎన్నో ఉండేవి. గమనించి నవ్వుకునేవాడు. ఉస్మానియా క్యాంపస్‌లో, విద్యానగర్‌లో ఆయన ఇల్లెప్పుడూ కవిత్వాన్ని ఆవాహన చేసుకునే యువకులతో నిండి ఉండేది. పక్షుల వైవిధ్యాన్ని బట్టి వాటికి అనువైన గూడును కట్టి ఆదరించిన భాషావృక్షం చేరా. కవిత్వం అనే గుడ్డును పొదిగి కవి అనే పక్షికి తొలి ఆహారం అందించిన వాడు కూడా!



 ఈ సమాజం బాగోలేదు. దీన్ని పునర్నిర్మించాలి అనే అభ్యుదయవాదులతో పేచీ పడకుండానే ‘పాత సాహిత్యాన్ని పరిరక్షించుకోవాలి’ అని వాదించేవాడు చేరా. శ్రీశ్రీపై పీహెచ్‌డీ చేసిన మిరియాల రామకృష్ణను మెచ్చుకున్నప్పుడు నగ్నముని కొయ్యగుర్రాన్ని ఆధునిక మహాకావ్యం అన్నప్పుడు ఆత్మీయుల నుంచే విమర్శలొచ్చాయి. స్పష్టత-చిరునవ్వు చేరా ప్రత్యేకత.  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణల్లో గీతా రామస్వామికి, సార్వత్రిక విశ్వవిద్యాలయపు సిలబస్ రూపకల్పనకు ఆయన కంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. సరళమైన తెలుగు వాక్యం ఆయన సొత్తు. అయినా ఛందస్సు అంటే మహాప్రేమ. పాతకాలపు ఆభరణాల్ని మెరుగు పెట్టుకోవాలే తప్ప కరిగించకూడదు బూడిదే మిగులుతుంది అనేవారు. తిరుపతిలో ఒక సాహితీసభ జరిగింది. ఛందస్సుపై విశేష కృషి చేసిన కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత రావూరి దొరస్వామిశర్మ పాల్గొన్నారు. అంత సాంప్రదాయవాది, పెద్దాయన చేరాను చూసి ‘మీ దర్శనం నాకు ‘చేకూరి’న భాగ్యం’ అన్నారు. చేరా తెలుగు భాషకు చేకూరిన భాగ్యం. గిడుగు రామ్మూర్తి తర్వాత తెలుగుభాషకు సేవచేసిన ముఖ్యుల్లో భద్రిరాజు కృష్ణమూర్తి సరసన నిలుస్తారు చేకూరి.  గిడుగు ఉత్తరాంధ్ర. భద్రిరాజు కోస్తా. చేరా తెలంగాణ. మారిన పరిస్థితుల్లో ‘చేరా’ స్మారక పురస్కారాలూ పీఠాలు ఆశించడం తెలుగు వారి దురాశ కాదు కదా’’

 - పున్నా కృష్ణమూర్తి

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top