మానవత్వానికి నిలువుటద్దం

మానవత్వానికి నిలువుటద్దం - Sakshi


కొత్త కోణం




ఎక్కడో అమెరికాలో పుట్టిన డాక్సర్ మన్సన్ మన దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో, ఎటువంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని ప్రాంతంలో పనిచేయాలని తపన పడి మెదక్ చేరారు. భవబంధాలను కాదనుకుని జీవితమంతా సమాజసేవలో గడిపారు. కలరా మహమ్మారి కమ్మేసిన విపత్కర పరిస్థితుల్లో సైతం నిబద్ధతతో, సేవా ధర్మాన్ని పాటించి భారతీయుల మదిలో చెరగని ముద్రవేసిన మన్సన్‌ని అంతర్జాతీయ మానవతావాద దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.




‘‘నా భరత భూమికి వీడ్కోలు, నేను మళ్ళీ నిన్నెప్పటికీ చూడలేను. నీ విశాలమైన మైదానాలను, మంచు కిరీటాలను ధరించిన నీ కొండలను, సూర్యుడు ముద్దాడే నీ పిల్లల ముఖాలను నేనెన్నడూ మరిచిపోలేను. నాకు నీవు భూతల స్వర్గాన్ని అందించినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు నేనెంతో రుణపడి ఉన్నాను.’’ ఈ దేశాన్ని విడిచి వెళుతూ ఈ మాటలన్నది అమెరికాకు చెందిన 30 ఏళ్ల ఒక విదేశీ ఆడబిడ్డ, ఒక డాక్టర్. స్వతంత్ర సంస్థానంగా ఉన్న నిజాం హైదరాబాద్ రాజ్యంలో 1903 నుంచి 1908 వరకు ఐదేళ్లు మెదక్‌లో వైద్య సేవలందించిన ఈమె మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. పేరు ఆర్లే మన్సన్. 




ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ఆధ్వ ర్యంలో 2009 నుంచి ఏటా ఈ రోజున నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని, ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, అంటువ్యాధుల వంటి  ప్రమాదకరమైన పరిస్థితులలో పనిచేసిన వారిని స్మరించుకోవడం ఆన వాయితీ. ఈ కార్యక్రమానికి ఆగస్టు 19ని ఎంచుకోడానికి కారణం బ్రెజిల్ దేశానికి చెందిన సెర్గియోడిమెల్లో. ఆయన దాదాపు మూడున్నర దశాబ్దాల పాటూ ఐక్యరాజ్య సమితి మానవతావాద సహాయ కార్యక్రమాల్లో అంకిత భావంతో పనిచేసిన అధికారి. చాలా దేశాల్లో యుద్ధాల మధ్య ఐరాస సహాయ కార్యక్రమాలు చేపట్టిన ఆయన... 2003, ఆగస్టు 19న ఇరాక్‌లోని ఒక బాంబు పేలుడులో 21 మంది సహచరులతో సహా ప్రాణాలు కోల్పోయారు. సెర్గియో త్యాగాన్ని, అంకితభావంతో కూడిన సాహసోపేతమైన ఆయన జీవితానికి ప్రతీకగా ఆగస్టు 19న ఐరాస ప్రపంచ మానవతా దినోత్సవాన్ని నిర్వహి స్తోంది. ఈ సందర్భంగా ఎక్కడో పుట్టి, మరెక్కడో ఉన్న భారతదేశంలోని ఒక మారుమూల ప్రాంతానికొచ్చి సామాన్య జనం కోసం పనిచేిసిన ఆర్లే మన్సన్‌ను స్మరించుకోవడం సముచితం.


 

ఏరి కోరి మారుమూల పల్లెకు చేరిన డాక్టర్

ఆర్ల్లే మన్సన్ 1871 నవంబర్ 14న అమెరికాలోని కనెక్టికట్ బ్రిడ్జిపోర్ట్‌లో జన్మించారు. తల్లిదండ్రులు హమిల్టన్ మన్సన్, ఎట్టా హిల్ మన్సన్‌ల మత పరమైన భక్తి ప్రపత్తుల నుంచి ఆమెకు బాల్యంలోనే మానవతా దృక్పథం అలవడింది. పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాల నుంచి డాక్టర్ డిగ్రీ సంపాదించిన మన్సన్ సహాధ్యాయి కర్మాకర్‌తో (మహారాష్ట్ర) పరిచయం ప్రభావంతో ఆమె కొంతకాలం డాక్టర్‌గా భారతదేశంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. 1903లో కర్మాకర్‌తో పాటూ మన్సన్ భారత్‌కు వచ్చి షోలాపూర్‌లో డాక్టర్ ప్రభాకర్ బాలాజీ కేస్కర్ వైద్యశాలలో కొంతకాలం పనిచేశారు. అదే సమయంలో షోలాపూర్‌లో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆ ప్రాణాంతక వ్యాధి నివారణ కోసం కూడా మన్సన్ ఎంతో కృషి చేశారు. ఆ చుట్టుపక్కల ఉండే కుష్టువ్యాధి శిబిరాలను సందర్శించి వైద్య సేవలందించారు. అయితే గ్రామీణ ప్రాంతంలో, ఎటువంటి వైద్య సౌక ర్యాలు అందుబాటులో లేని ప్రాంతంలో పనిచేయాలన్నది ఆమె తపన. ఆమె ఆకాంక్షకు అనుగుణంగానే, నాటి హైదరాబాద్ సంస్థానంలోని వెస్లియన్ మెథడిస్టు మిషన్ నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. మన్సన్ మెదక్‌లోని చర్చి కాంపౌండ్‌లో ఉన్న వైద్యశాలలో చేరారు. నాటి మెదక్  చిన్న గ్రామం. హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరిన మన్సన్ అక్కన్నపేటలో దిగి, రామాయంపేటకు ఎడ్లబండిలో వెళ్ళి, రాత్రి అక్కడే ఆగి, తెల్లారాక మెదక్‌కు వెళ్లినట్టు మన్సన్ తన జ్ఞాపకాలలో తెలిపారు. ‘‘జంగిల్ డేస్’’ పేరిట వెలు వడ్డ ఆ జ్ఞాపకాలలో ‘ఐదు వందల చదరపు మైళ్ల వైశాల్యం మొత్తంలో ఒక్కరంటే ఒక్కరు శిక్షణ పొందిన వైద్యుడు లేరని తెలిసి మెదక్‌లో పని చేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.


 

ప్రతికూల పరిస్థితుల్లోనూ చలించని నైజం


గ్రామాల నుంచి వచ్చే విజ్ఞప్తులను బట్టి ఆర్లే మన్సన్ వైద్యబృందం గ్రామా లలోకి వెళ్ళేది. ఈ వైద్య బృందం రాకకు ముందు రోజునే ఒకరిద్దరు సేవ కులు ఆ గ్రామాలలోకి వెళ్లి డాక్టర్లు వస్తున్నారని చాటింపు వేసేవారు. ఎడ్ల బండ్ల మీదే వైద్య బృందం ప్రయాణం జరిగేది. ‘‘ఎల్లారెడ్డి పేటలో జైనులు ఉండేవారు. వాళ్ళు మమ్ములను అత్యంత ప్రేమతో పలకరించేవాళ్లు, గతంలో మా వద్ద వైద్యం పొందిన వాళ్లు పండ్లు, ఇతర రకాలైన బహుమతులు ఇచ్చేవారు. గ్రామాల్లోకి అడుగుపెడితే చాలు, చాలా సాదరంగా ఆహ్వనించే వారు. మేము ఆ గ్రామంలో ఉండగానే ఒక వార్త వచ్చింది. ఒక లంబాడా అమ్మాయిపై చిరుతపులి దాడిచేసింది. రక్తం కారుతోంది. మధ్య మధ్యలో ఆ అమ్మాయి కళ్ళు మూతలు పడుతున్నాయి. అయితే వెంటనే కట్టుకట్టి పంపించాం. దానితో ఆ లంబాడా తండాలో మా పట్ల ఎంతో గౌరవం ఏర్పడింది’’ అంటూ ఆమె మెదక్ సమీపంలోని ఎల్లారెడ్డి పేట అనుభవాన్ని తన పుస్తకంలో పేర్కొన్నారు.




అయితే తామిచ్చే మందులను చాలా మంది వేసుకోవడానికి భయపడే వారని, ఎక్కడి నుంచో తెల్లవాళ్ళు మనల్ని చంపడానికి గోలీలను, మందు లను ఇస్తున్నారని స్థానిక నకిలీ వైద్యులు ప్రచారం చేసేవారని మన్సన్ వివరించారు. మెదక్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామంలో ఒక పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడు. వాళ్లు హిందువులు కావడంతో క్రిస్టియన్ హాస్పిటల్‌కు రోగిని తీసుకురాలేమని, డాక్టర్‌నే ఇక్కడికి తీసుకురావాలని మనిషిని పంపారు. హాస్పిటల్‌లో చాలా మంది రోగులు ఉన్నప్పటికీ, ఒత్తిడి వల్ల మన్సన్ ఆ గ్రామానికి వెళ్లింది. ఆ రోగి పరిస్థితి విషమంగా ఉన్నట్టు గుర్తించిన మన్సన్ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతుండగానే ఆ పిల్లవాడు మరణించాడు. కొందరు నకిలీ డాక్టర్లు ఇదే అదనని ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారు, శాపనార్థాలు పెట్టారు.  పిల్లవాడి తల్లిదండ్రులు కలుగజేసుకొని, ‘‘డాక్టర్ చెప్పిందే నిజం, ఆమె తప్పేమీ లేదు’’ అని చెప్పాకే ఆమెను వదిలిపెట్టారు. ‘‘ఆ తర్వాత మెదక్ రావడానికి ప్రయాణమయ్యాం. ఎడ్లబండిలో వస్తుంటే మధ్యలో మాతో వచ్చిన చెప్రాసి కూడా ఎక్కడికో పారిపోయాడు’’అని పేర్కొన్న మన్సన్... ఇటువంటి ఘటనలు తనను ఎప్పుడూ భయపెట్టలేదని ఆ పుస్తకంలో వివరించారు.




కలరా వ్యాధి వ్యాపించినప్పుడు వీధులకు వీధులు రోగులుగా మారు తుండగా, గ్రామాల్లో శవాలు గుట్టలు పడుతుండేవి. లక్షల్లో ప్రజలు చని పోతున్న దారుణ పరిస్థితుల్లో డాక్టర్ మన్సన్ ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి ప్రజలను విముక్తి చేయడం కోసం చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. ఆమె తన వైద్య సేవలతో ఎంతో మందిని కలరా మహమ్మారి నుంచి కాపాడగలి గారు. ప్రజలు మాత్రం మైసమ్మకు కోపం రావడమే కలరాకు కారణమనే మూఢత్వంలో ఉండేవారు. ఒకవైపు మరణాలు సంభవిస్తుంటే మరోవైపు దేవతలకు బలులను, జాతర్లను చూస్తుంటే బాధ వేసేదని మన్సన్ తెలిపారు.


ప్రేమను పంచిన సేవామూర్తి

డాక్టర్ మన్సన్ తన మానవతా ధృక్పథంతోనూ, సేవాతత్పరతతోనూ ఎందరో పిల్లలు, స్త్రీల ఆదరాభిమానాలను సంపాదించుకోగలిగారు. కులం అనే భావన ప్రజల్లో ఎంత అమనుషంగా ఉండేదో డాక్టర్ మన్సన్ ఉదహరిం చిన ఒక సంఘటన ద్వారా మనకు అర్థం కాగలదు. నర్సమ్మ అనే ఒక కంసాలి మహిళ కాలు విరిగింది. ఆ కులస్తులు కొందరు ఆమెను హాస్పిటల్‌కు తీసుకొచ్చి ‘‘మీరు వైద్యం చేయండి. అన్నం మీరు పెట్టవద్దు. ఆమె తినదు. మేమే పంపిస్తాం’’ అన్నారు. తర్వాత కొన్ని రోజులకు అన్నం తేవడం మానేశారు. హాస్పిటల్ నుంచి అన్నం పెడతామంటే ‘‘నేను చావనైనా చస్తాను. కులం వదులుకోలేను. అన్నం తింటే కులం పోతుంది’’ అని కాలు విరిగిన పేషెంట్ కరాఖండిగా చెప్పింది. దానితో హాస్పిటల్ సిబ్బందే కంసాలి ఇళ్లకు వెళ్లి ఆమెకు అన్నం అడుక్కొచ్చి పెట్టి బతికించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నర్సమ్మ అనే ఆ మహిళ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్ళింది. ఆ తర్వాత ఆ నర్సమ్మే కొన్ని బియ్యం, పువ్వులతో పాటు వచ్చి ‘‘నేను మీ మందుల కోసం రాలేదు. మీ ప్రేమ కోసం వచ్చాను’’ అనడం తనను ఎంతో ఉద్విగ్నతకు గురిచేసిందని, అది తన అరుదైన జ్ఞాపకమని పేర్కొన్నారు.




హైదరాబాద్ నుంచి ఒక ధనిక ముస్లిం కుటుంబానికి చెందిన ఒక మహిళ వైద్యం కోసం మెదక్ వచ్చింది. తెల్లవాళ్ల దగ్గరికి వెళితే చంపేస్తారని బంధువులు తనను భయపెట్టారని, ఆమె చూపిన ప్రేమను చూసిన తర్వాత  అవన్నీ అబద్ధాలని తేలిందని ఆ యువతి అనడం కూడా మన్సన్ సేవా తత్పరతకు అద్దం పడతాయి. ఇట్లా ఐదేళ్లు ఎన్నో కష్టాలకు, దాడులకు గురై కూడా మన్సన్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి మన దేశానికి వీడ్కోలు పలికి, ఆమె 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ యుద్ధ భూమిలో వైద్య సేవలు అందించారు. డాక్టర్ మన్సన్‌ను ఫ్రాన్స్ ప్రభుత్వం ‘‘హానర్ ఆఫ్ మెడల్’’ బిరుదునిచ్చి సత్కరించింది. 1941లో 70వ ఏట మరణించే వరకు ఆమె వైద్యసేవలోనే నిమగ్నమైపో యారు. 52వ ఏట పెళ్లి చేసుకున్నా సంతానం వద్దనుకున్నారు. భవబంధాలు కాదనుకుని ప్రజల కోసం, జీవితమంతా సమాజసేవలో మన్సన్ గడిపారు. ప్రాణాంతక కలరా మహమ్మారి కమ్మేసిన విపత్కర పరిస్థితుల్లో సైతం నిబద్ధ తతో, తన వృత్తి ధర్మాన్ని పాటించి భారతీయుల మదిలో చెరగని ముద్ర వేసిన డాక్టర్ మన్సన్‌ని ప్రపంచ మానవతావాద దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.


(ఆగస్టు 19 ప్రపంచ మాన వతావాద దినోత్సవం సందర్భంగా) 

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్ : 97055 66213 

మల్లెపల్లి లక్ష్మయ్య


 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top