డింకీల ‘డింగరీ’ డిగ్గీ! | Digvijay singh plays Conspiracy role in state division | Sakshi
Sakshi News home page

డింకీల ‘డింగరీ’ డిగ్గీ!

Dec 16 2013 11:34 PM | Updated on Aug 14 2018 3:55 PM

డింకీల ‘డింగరీ’ డిగ్గీ! - Sakshi

డింకీల ‘డింగరీ’ డిగ్గీ!

‘సిద్ధుడు రానూ వచ్చాడు, వెళ్లనూ వెళ్లాడ’’ని తెలుగు వారి నానుడి!

‘‘శాసన వేదిక చేసే చట్టం అనేది ప్రజాభిప్రాయాన్ని / ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే దిగా ఉండాలి... అయితే ఆ చట్టం రాజ్యాంగంపైన తలపె ట్టిన మోసంగా ఉండరాదు!’’     - స్టేట్ ఆఫ్ బీహార్; 1997, సుప్రీం తీర్పు

 ‘‘లెజిస్లేచర్లను దుర్వినియోగం చేయకుండా వాటికి రక్షణ కల్పించాలంటే ప్రజలు చేయవలసిన పని - ఆ దుర్విని యోగానికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించడం కాదు, పాలక శక్తి బొడ్డులో చేయి వేసి వెంటనే ఎన్నికలు జరిపించడం!’’    - ఇల్లినాయిస్ (అమెరికా) సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, వైటీ: 1877, రాజ్యాంగ నిపుణుడు డిడి బసు ‘కామెంటరీ’: వాల్యూం ‘ఎ’’

 ‘సిద్ధుడు రానూ వచ్చాడు, వెళ్లనూ వెళ్లాడ’’ని తెలుగు వారి నానుడి! తెలుగు జాతిని చీల్చి పబ్బంగడుపుకుందామని కాం గ్రెస్, సోనియా పన్నిన కుట్రలో భాగంగానే తెలుగేతరులైన ఆ అధిష్టానవర్గ సభ్యులలో ఒకరైన దిగ్విజయసింగ్ కొలది రోజుల నాడు మన రాష్ట్రానికి రానూ వచ్చాడు. మూడురోజుల్లో ‘శకుని’ పాత్ర ముగించి తిరిగి వెళ్లనూ వెళ్లాడు! కానీ ఎక్కడి గొంగళి అక్కడే పరిచి పోయాడు. సమస్యను తేల్చడం అతని వల్లకాని పని. అసలు ఇతడి రాక సందర్భం ఏమిటి? ‘కేంద్ర మంత్రుల బృందం’ ఆకుకు అందకుండా పోకకు పొందకుండా హడావుడిగా విభజన ముసాయిదా బిల్లును తయారు చేసి రాష్ర్టపతికి పంపింది. రాష్ట్రపతి మాత్రం నిపుణుల సలహా మేరకు ఆచితూచి మరీ ఆ బిల్లును మన రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తెలుసుకోవడానికి పంపించారు. సమ యంలో ‘తాటితోనే దబ్బనం’ అన్నట్టు, బిల్లు వెంటే దిగ్విజయ్ చల్లగా కాలు మోపాడు! ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ (14.12.13) మాటల్లో చెప్పాలంటే, ‘ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌కు రావ డంతో జరిగిన పని పరిణామాల్ని ఉద్రిక్తపరచడం’. అంటే తెలుగు జాతి ఐకమత్యం తోనే రాష్ట్ర పురోగతి సాధ్యమన్న బలీయమైన వాంఛను తృణీకరిస్తూ అధిష్టానం చేసిన విభజన నిర్ణయం మారే సమస్యలేదని ప్రకటించడానికి తప్ప, మరేమీలేదు. అసాధారణమైన రీతిలో, ప్రత్యేక విమానం ద్వారా ముసాయిదా బిల్లును ఉరికించారు. కాని చిత్రమేమంటే ఆ బిల్లులో అసలు ఏముందో, ఎప్పుడు శాసనసభకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తరఫున దిగ్విజయ్ ‘పైరవీల’లోకి లెజిస్లేట ర్లను నెట్టేశారు! ఆ బిల్లులో ఏముందో కూడా అతనికి తెలియదు! రాజ్యాంగ ప్రక్రియ, నిబంధనలూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇందిరాగాంధీ రూపొందించి ఉన్న 371-డి లాంటి అనుల్లంఘనీయ మైన అధికరణలూ అతడికి తెలియవు. తెలిసినా తెలుగు జాతిని మోస గించడానికి నాయకురాలు సోనియా చేతలనీ, ప్రజా వ్యతిరేక చేష్టలనూ బలోపేతం చేయడానికైనా అతడు కంకణం కట్టుకునైనా ఉండాలి! ‘డింకీలు’ కొట్టడంలో సోనియా డింగరీ ఈ డిగ్గీ రాజా వారు!

 విజ్ఞుడు ప్రణబ్

 గతంలో కొందరి మాదిరిగా కాకుండా ప్రస్తుత రాష్ట్రపతి కొంత స్వతంత్రంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది.  రాష్ట్రాలపై ఇష్టానుసారంగా, నిరంకుశంగా పెత్తనం చెలా యించడానికి (విభజన ప్రక్రియతో సహా) రాజ్యాంగానికి 1955లో తెచ్చిన సవరణతో ‘అధికరణ-3’లో ఉన్న మంచి ‘ప్రొవిజో’ను కాంగ్రెస్ పాలకులు తొలగించి వేశారు. దాని స్థానంలో రాష్ట్రపతి ఏ ముసాయిదా బిల్లును సంబంధిత శాసనసభకు పంపినా దానిపైన ఓటింగ్ ద్వారా సభ, వారి ‘నిశ్చితాభిప్రాయాన్ని’ పొందడానికి కాకుండా కేవలం ‘రిఫర్’ చేస్తే చాలుననీ, అది కూడా సభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చుననే ప్రజావ్యతిరేక ‘ప్రొవిజో’ను దూర్చారు! అయితే రాష్ట్రపతి ప్రణబ్ అందరిలాగా కాకుండా రాష్ట్ర శాసనసభ నిశ్చితాభి ప్రాయ ప్రకటనకే విలువ ఇచ్చి, 42 రోజులపాటు బిల్లుపై చర్చకు అవకాశం కల్పించారు. బిల్లులోని ‘ప్రతి క్లాజుపైన ప్రతి సభ్యుడి అభిప్రాయాలను కూడా నమోదుచేసి తనకు పంపించాలని రాష్ట్రపతి సూచించడం ఆహ్వానించదగిన సాహసమే. ఈ షరతు పాలకపక్షాలు (కాంగ్రెస్, బీజేపీలు) రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను విడదీసే చర్యకూ, అస్తవ్యస్థ మెజారిటీలతో కునారిల్లే ప్రభుత్వాలు ఎన్నికయ్యే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు పరుగులెత్తే ప్రక్రి యకు గండికొడుతుంది! తెలుగు జాతినీ, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన మంత్రివర్గాలను అర్థాంతరంగా కూల్చ దలచిన పాలక పక్షాల కుట్రలకు కూడా రాష్ర్టపతి తాజా ప్రక్రియ ఒక చెంపపెట్టుగా భావించాలి.

 భ్రమలు తొలగించిన నిబంధన

 బాధ్యతగల రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ, తెలుగు జాతి త్యాగాలతో సాధించుకున్న తొలి భాషా ప్రయుక్త సమైక్య రాష్ట్రం విశాలాంధ్రలోని ఇరు ప్రాంతాల మధ్య ఉద్యోగ సద్యోగాలలో, ప్రమోషన్లలో, విద్యలో సమానావకాశాల కల్పనకు, ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గించడానికి ప్రత్యేకంగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా, అనుల్లం ఘనీయమైన 7 వ షెడ్యూల్‌లో అంతర్భాగం చేసి, ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా తప్ప కదిలించడానికి వీలులే కుండా ప్రత్యేక ప్రొవిజన్‌తో ‘371(డి)’ అధికరణను ఎలా రూపొందించవలసి వచ్చిందో అటార్నీ జనరల్ వాహన వతి, పార్లమెంట్ సెక్రటేరియట్ మాజీ కార్యదర్శి విశ్వ నాథన్‌ల ద్వారా తెలుసుకున్నారు (3వ, 371-డి అధికర ణాల గురించి మొట్టమొదటిసారిగా రెండు నెలల క్రితమే ‘సాక్షి’ ఇదే జాగాలో ప్రస్తావించింది). మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించకుండా, ఆపై 28 రాష్ట్రా లలో 14 రాష్ట్రాల ఆమోదం పొందకుండా ఆ ప్రత్యేక అధి కరణను సవరించడం సాధ్యపడదనీ వారు చెప్పిన తర్వా తనే రాష్ట్రపతి ఆ బిల్లులో కూడా ఫ్రస్తావించిన ఆ ప్రత్యేక అధికరణను తన ‘నోట్’లో పేర్కొనవలసి వచ్చింది! చివరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ సహితం అంతకు ముందు ఓటింగ్ మీద ఉన్న భ్రమను కాస్తా తొలగించు కుని ‘371-డి’ అధికరణ రాష్ట్ర విభజనకు అడ్డుగోడ అని గుర్తించకతప్పలేదు. 1955 నాటి ‘5’వ సవరణతో ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తిని చంపి, రాష్ట్రాల అధికారాలను కేంద్ర జాబితా ఆధారంగా స్వాహా చేయడానికి కాంగ్రెస్ పాలక పక్షం పన్నిన కుట్రను తెలుసుకోలేని వారు ముఖ్యమంత్రి పదవులకు ఎగబాక చూడటం దురదృష్టకరం! అంతే కాదు, రాష్ట్రపతి పనల్లా తన విధుల నిర్వహణలో కేవలం ఒక ‘రబ్బరు స్టాంపు’ గానే, మ్రంతిమండలి సలహా సహ కారాల పైననే నడచుకోవాలని 74(1)వ అధికరణ నిర్దేశి స్తోంది గదా అంటూ తాజాగా శంక లేవదీస్తున్నారు. కాని రాజ్యాంగ భాష్యకారుడు డీడీ బసు ఈ అధికరణకు ఇచ్చిన వివరణలో ఓ గొప్ప రహస్యాన్ని బయట పెట్టాడుః ‘‘కేవలం మంత్రి మండలి సలహా ప్రకారమే రాష్ట్రపతి విధిగా నడుచుకుని తీరాలన్న ప్రొవిజన్ మన రాజ్యాంగం లో లేదు’’ అన్నారాయన(బసు వాల్యూమ్-‘ఎ’ పేజీ: 46-47). కాబట్టే నేడు రాష్ట్రపతి ప్రణబ్ ఈ మేరకైనా సాహసించగలిగారు.

 కాశ్మీర్‌కు ఉన్న హక్కు మనకేది?

 మన రాజ్యాంగంలోని ‘సమాఖ్య వ్యవస్థ’ రక్షణకు చెందిన ప్రొవిజన్స్ ప్రత్యేక ప్రక్రియా పద్ధతికి లోబడి ఉండాల్సిన వనీ, ఆ ప్రొవిజన్స్‌కు (371-డి లాంటివి) సవరణ తేవా లంటే అందుకు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ అవసరం కావడమే గాక, దేశంలోని రాష్ట్రాల శాసనసభల్లో సగం శాసనసభలు కూడా ఆ సవరణను ధృవీకరించక తప్పదని డా. బసు వేర్పాటువాద శంకా పీడితులకు ఎలాంటి అనుమానం రాకుండా స్పష్టం చేశాడు. (పే. 24)!! అందువల్ల, ఎవరికి వారు సామ్రాజ్య దీవులుగా ఏర్పరచుకున్న ‘స్వదేశ సంస్థానాల’ను అదుపుచేయడానికి రాజ్యాంగం ముసాయిదా రచన పూర్తి కావస్తున్న సంద ర్భంగా రాజ్యాంగ నిర్ణేతలు పార్లమెంటుకు ‘3వ అధిక రణ’ ద్వారా దఖలు పరచిన అధికారాలను పాలక పక్షాలు తమ పాక్షిక రాజకీయాలకు ఉపయోగించుకోకుండా ఆ అధికరణను ఫెడరల్ వ్యవస్థా రక్షణకు అనుగుణంగా సవ రించి తీరాలి! ఎందుకంటే ఇండియాలో భాగమనుకుం టున్న కాశ్మీర్ శాసనసభ తీర్మానం లేకుండా ఇదే మూడవ అధికరణ కింద రాష్ట్రంలోని ఏ భాగాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు! కొందరికి ఉన్నది కాస్తా ‘క్షవరమైతే గాని ఇవరం’ రాదంటారు! ఇటీవల నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ కొమ్ములు కాస్తా విరిగిపోయాక గాని తాము ‘ప్రజలకు దూరమైపోయామన్న’ జ్ఞానం నాయకులకు కలగలేదు!

 కాంగ్రెస్ ‘అధిష్టానం’ పేరుతో తెలుగు జాతి ‘విభ జన’ ప్రయోగానికి ప్రయోక్తలుగా ఉన్న బాపతు ఎలాంటి వారు? ఎన్నికలలో తమ తమ రాష్ట్రాల ప్రజాబాహుళ్యం మెడపట్టి, ముడుసార్లు గెంటివేసిన దిగ్విజయ్‌సింగ్ (మధ్యప్రదేశ్), అహ్మద్ పటేల్ (గుజరాత్), లడఖ్‌లో కాంగ్రెస్‌ను ముంచిన నబీగులామ్ అజాద్, నాగర్‌కోయిల్ నుంచి ‘కన్ను లొట్టపోయి’ అనేక ఆరోపణల మధ్య ఎంపీ గా ఎన్నికైన చిదంబరం, సొంత కర్ణాటకలో నిలబడే చోటు లేక, గతిలేక రాజ్యసభ సీటు సంపాదించడానికి ఆంధ్రప్ర దేశ్‌ను దేబిరించుకోవలసివచ్చిన జైరామ్ రమేష్, ఇతర ఆంధ్రేతరులు నారాయణస్వామి (పాండిచ్చేరి), కర్ణాటక వీరప్ప మొయిలీ వగైరాలు! వీళ్లా, వేల ఏళ్లుగా  బౌద్ధంతో పెనవేసుకున్న తెగులు జాతి భవిష్యత్తుకు నిర్ణేతలు?     

 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ సహితం అంతకుముందు
 ఓటింగ్ మీద ఉన్న భ్రమను కాస్తా తొలగించుకుని ‘371-డి’
 అధికరణ రాష్ట్ర విభజనకు అడ్డు గోడ అని గుర్తించకతప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement